కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి గండం పొంచి ఉందా. మునుగోడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా. ఒక పక్క సొంత పార్టీ వాళ్లు, మరో పక్క ప్రత్యర్థి పార్టీ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిద్రలేకుండా చేస్తున్నారా. ఆయనకే ఎందుకు మాకు ఎందుకివ్వరన్న ప్రశ్నతో బీఆర్ఎస్ లో తలెత్తిన అసమ్మతి ఎటు పోతోంది…
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగులనే ఎంపిక చేసింది. జాబితాను ప్రకటించి ప్రచారం చేసుకోమని ఆదేశించింది. కాకపోతే కొందరిని మార్చుతారన్న ప్రచారం అప్పటి నుంచే మొదలైంది. మార్చే వారిలో కూసుకుంట్ల పేరు కూడా ఉందన్న వార్తల నడుమ ఆయనకు నిద్ర పట్టడం లేదని చెబుతున్నారు.
జిల్లా కేంద్రం నల్లగొండకు దగ్గరగా ఉండే మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేకతల కంటే హైప్ ఎక్కువగా ఉంటుంది. మనుగోడులో ఏం జరిగినా దాని ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుందని భావిస్తుంటారు. మొన్నటికి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో డబ్బు ఏరులై పారడటంతో జనం ముక్కున వేలేసుకున్నారు. ఓటుకు పదివేలు అందాయన్న చర్చ మునుగోడును కంట్రీ వైడ్ గా ప్రచారం చేసింది అప్పటి నుంచి మునుగోడులో చీమ చిటుక్కుమన్నా స్టేట్ ఇష్యూ అయి కూర్చుంటోంది. అప్పట్లో కూసుకుంట్ల పట్ల అసమ్మతి పెరిగిపోయిందని చర్చ జరగ్గా కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని సెటిల్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఎవరో జ్వాలను రగిలించారు..
నిజానికి మునుగోడులో మూడు పార్టీల్లోనూ గందరగోళ పరిస్థితే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముగ్గురు ఆశావహులు రోడ్డున పడి కొట్టుకునే పరిస్థితి ఉంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన పాల్వాయి స్రవంతి, మునుగోడు కాంగ్రెస్ స్ట్రాంగ్ మేన్ చలమల్ల కృష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న చలమల్ల కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మరో పక్క బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సారి పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ మొదలైంది. దానితో బీజేపీలో ఆశావహులు పెరిగిపోయారు. అయితే ఇప్పుడు ఫోకస్ మాత్రం బీఆర్ఎస్ మీదే ఉందని చెప్పలి.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై పార్టీలో ప్రత్యర్థులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గర నుంచి టికెట్ లాగేసుకోవాలని, ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తే నామినేషన్ల నాటికి అది సాధ్యపడుతుందని నమ్ముతున్నారు. టికెట్ ఆశిస్తున్న వారిలో నారబోయిన రవి, కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి చాలా కాలంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదలకు సాయంగా ఉంటున్నారు. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు ప్రయోజనం కలిగే చర్యలు చేపట్టగలిగితే బావుంటుందని ఆయన ఆలోచించారు. ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో తన పేరు లేనప్పటికీ ఎక్కడా నిరాశ చెందకుండా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. లాస్ట్ మినిట్ లో టికెట్ వస్తే చూసుకోవచ్చన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. అయితే మునుగోడులో ఇతర బీఆర్ఎస్ నేతలు మాత్రం కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదన్న హెచ్చరికలను జారీ చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు కూడా వారు సిద్ధమవుతున్నారు.
బీఆర్ఎస్ కు మరో సమస్య కూడా ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి కమ్యూనిస్టులు మద్దతు పలికారు. దానితో కూసుకుంట్లకు పది వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కమ్యూనిస్టులు అధికార పార్టీకి దూరం జరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.. అదే జరిగితే బీఆర్ఎస్ కు మునుగోడు గండం గడవడం కష్టమే అవుతుంది…