కాషాయ తీర్థం పుచ్చుకోనున్న మర్రి శశిధర్‌రెడ్డి
ఢిల్లీలో అమిత్‌షాతో సమావేశం
ఆపరేషన్ ఆకర్ష్. ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీల మీద ప్రయోగిస్తున్న తిరుగులేని అస్త్రం. ఇదివరకులాగా ఇప్పటి తరం నాయకులు సిద్ధాంతాల జోలికి పోకుండా తమ స్వార్థం పార్టీలు మారడంలో తప్పేమీ లేదని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీలో చేరి మంత్రులు అయినవారు కూడా ఉన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయమేఉన్నా తెలంగాణలో ఇప్పటినుంచే ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెడుతున్నారు టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు. లేటెస్టు న్యూస్ ఏంటంటే కాంగ్రెస్ సినియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మొదట ఈ వార్తలను ఆయన ఖండించారు. అయితే శుక్రవారం రాత్రి శశిధర్‌రెడ్డి ఢిల్లీలో బీజేపీ అగ్రనేత కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాతో భేటి అయ్యి అందరికీ షాకిచ్చారు.
సుమారు 40 నిమిషాలు జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై మర్రి శశిధర్‌రెడ్డి తో అమిత్‌షా మాట్లాడినట్లు తెలిసింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, విధి విధానాలపై చర్చించినట్లు సమాచారం. గురువారం రాత్రి అమిత్‌షాతో ఈటల రాజేందర్ భేటి అయినప్పుడే మర్రి శశిధర్‌రెడ్డి చేరికపై చర్చ జరిగింది. అమిత్‌షా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో శశిధర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆయానతో భేటీ అయ్యారు. కొంతకాలంగా మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మర్రి శశిధర్‌రెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నేతలు రేవంత్‌రెడ్డిపై తమ అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి రేవంత్‌రెడ్డి వైఖరే కారణమని గత ఆగస్టు నెలలో మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ రేవంత్‌రెడ్డికి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అమిత్‌షాను కలిసిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధపడుతోందని ఇప్పట్లో ఆ క్యాన్సర్ నయమయ్యే సూచనలు కనిపించడంలేదని అన్నారు. అందుకే ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడాల్సి వస్తోందని వెల్లడించారు. తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బయటికి వస్తున్నట్టు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదని, మునుగోడు ఉప ఎన్నికను ఎంతో తేలిగ్గా తీసుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అందుకు రేవంత్ దే బాధ్యత అని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను చెంచాగాళ్లతో నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. మర్రి బాటలో బీజేపీలో చేరే కాంగ్రెస్ నాయకులు ఎవరనేది అప్పుడు చర్చనీయాంశం అయిది.