తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులతో అలర్ట్‌ అయిన కేసీఆర్‌

By KTV Telugu On 10 November, 2022
image

తెలంగాణలో మూడు రోజులుగా గ్రానైట్‌ పరిశ్రమల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆదాయపన్ను శాఖ ముప్పేట దాడులు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌లలో ప్రముఖుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించాయి. బుధవారం మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో తనిఖీలు చేశారు. మంత్రి గంగుల ఇంటికి తాళం ఉండడంతో ఆయన పీఏను పిలిపించిన ఈడీ, ఐటీ అధికారులు తాళాన్ని పగులగొట్టి లోనికి వెళ్లారు. మంత్రి బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. అలాగే గురువారం టీఆర్‌ఎస్‌ ఎంపి వద్దిరాజు రవిచంద్ర కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. దీంతో సీఎం కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ప్రగతిభవన్కు పిలిపించారు. కేంద్రం ఇదే తంతు కొనసాగిస్తే చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన వెంటనే ఈడీ, ఐటీ అధికారులు పెద్ద ఎత్తున గ్రానైట్‌ వ్యాపారుల మీద దాడులు చేయడం టీఆర్‌ఎస్‌వ వర్గాల్లో కలకలం రేపింది.