సీఎం కేసీఆర్ కు బూట్లు పంపించిన వైఎస్ షర్మిల

By KTV Telugu On 2 February, 2023
image

తెలంగాణాలో విజయవంతంగా సాగుతున్న తన పాదయాత్రను నర్సంపేటలో కేసీఆర్‌ గూండాలు అడ్డుకున్నారని ఎక్కడ ఆగిపోయిందో అక్కడినుంచే తిరిగి ప్రారంభిస్తానని అన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. ఇప్పటికే 3520 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిందని ఆమె వెల్లడించారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని ఆరోపించారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను నిర్వీర్యం చేశారన్నారు. కేసీఆర్‌కు తన పాలన మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా తనతో కలిసి ఒక రోజు పాదయాత్రకు రావాలని సవాల్‌ చేశారు. ఎలాంటి సమస్యలు లేవని తేలితే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. సమస్యలు ఉంటే కేసీఆర్‌ తాను రాజీనామా చేసి ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌కు షర్మిల ఒక వినూత్నమైన బహుమతిని పంపించారు. తనతో కలిసి పాదయాత్రకు రావాలంటూ షూ బాక్స్‌ను ఆయను కానుకగా పంపించారు. అవి వేసుకొని రాష్ట్రంలో తనతో కలిసి ఒక్కరోజు పాదయాత్రలో పాల్గొనాలని ఆమె సవాల్ విసిరారు. పిట్టలదొరలాగా టోపీ పెట్టుకుని ప్రయివేట్‌ విమానాల్లో దేశాలు పట్టి తిరగడం కాదు. మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల గురించి ఆలోచించండి అని వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్పార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాదర్బార్‌ నిర్వహించేవారని సామాన్యుడు కూడా నేరుగా వచ్చి సీఎంను కలిసేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా కనీసం నాయకులకు ఉద్యమకారులకైనా ఆయన అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి సీఎం అయ్యారని మండిపడ్డారు. తన పాదయాత్ర నిలిచిన చోటు నుంచి చివరి దశ యాత్ర తిరిగి ప్రారంభిస్తున్నట్టు ఆమె తెలిపారు.