నాలుగో నగరం రియల్ గేమ్ ప్లాన్ !

By KTV Telugu On 3 August, 2024
image

KTV TELUGU :-

హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకుని మరో నగరం అవసరమా.. నాలుగో నగరం అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త రాగం ఎందుకు అందుకున్నారు. ఇప్పటి మూడు నగరాలుగా వర్గీకరించిన ఆయన నాలుగో నగరం అన్న భావనను ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగర నిర్మాణం అవసరమా.. మౌలిక సదుపాయాలు ఏర్పాటు అంత సులభమా… నగరవాసులు పడుతున్న బాధలు సీఎంకు అర్థమవుతున్నాయా లేదా…

తెలంగాణ సీఎం రేవంత్ ఇప్పుడు కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. పైగా న్యూయార్క్ ను మించేలా ముచ్చర్లను నిర్మిస్తామని ఆయన అసెంబ్లీలోనూ, నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలోనూ ప్రస్తావించారు. బేగరికంచ.. ఈరోజు వరకూ ఎవరికీ తెలియని ప్రాంతం. నాలుగేళ్లలో న్యూయార్క్‌ నగరం మాదిరిగా అభివృద్ధి చెందబోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. న్యూయార్క్‌లో మాదిరిగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్‌ టూరిజం హబ్, క్రికెట్‌ స్టేడియం, రాత్రివేళల్లో లయన్‌ సఫారీ వంటివి ఏర్పాటు చేయనున్నాం. భవిష్యత్తులో విమానాలు ఎక్కాలన్నా… కొనాలన్నా ఇక్కడికే రావాల్సి ఉంటుంది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా మెట్రో రైలును ఇక్కడికి తీసుకువస్తాం అని రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లను మించే రీతిలో నాలుగో మహానగరాన్ని నిర్మించనున్నాం. మన కళ్లముందే.. నాలుగేళ్లలో ఈ మహానగరం రాబోతోంది. హైదరాబాద్‌ను నిజాం నవాబు, సికింద్రాబాద్‌ను బ్రిటిష్‌ పాలకులు, సైబరాబాద్‌ను చంద్రబాబునాయుడు, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిలు నిర్మిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం బేగరికంచెను నాలుగో మహానగరంగా తీర్చిదిద్దనుంది. దీనికి అంకురార్పణలో భాగంగా ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు భారీస్థాయిలో కమ్యూనిటీ సెంటర్‌ పేరుతో ఇళ్లు నిర్మిస్తున్నాం. వారి పిల్లలు చదువుకునేందుకు కార్పొరేట్‌ తరహాలో పాఠశాల ఏర్పాటు చేయనున్నాం. వైద్యసేవల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వృత్తివిద్య అభ్యసించే విద్యార్థుల కోసం అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నాం. మైట్రోరైలు సౌకర్యంతోపాటు ఓఆర్‌ఆర్‌ను అనుసంధానించేందుకు 200 అడుగుల వెడల్పుతో రహదారిని అందుబాటులోకి తీసుకురానున్నాం అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నాలుగో నగరాన్ని ఆరోగ్య, క్రీడా హబ్ గా నిర్మిస్తామని రేవంత్ ప్రకటించారు. వైద్యసేవల నుంచి ఉపాధి వరకు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని, క్రికెట్‌ స్టేడియం నుంచి గోల్ఫ్‌ కోర్స్‌ వరకు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముచ్చర్లలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణంపై ఇప్పటికే బీసీసీఐతో మాట్లాడినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న మాట వాస్తవం. నగరంలో చోటు లేకపోతే జనం శివారు ప్రాంతాలు దాటి వెళ్లిపోయి స్థిరపడటమూ అనివార్యం. అందులో కొత్త విషయం ఏమి లేదు.అయితే ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేయడం అనేది వ్యూహాత్మకమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐదేళ్ల క్రితం ఇలాంటి చర్చ వచ్చింది. అప్పటి ప్రభుత్వం కూడా ఒక మాట అనేసింది. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి సర్కారు ఉద్దేశం మాత్రం ఒకటేనని తెలుస్తోందీ. అదీ రియల్ ఎస్టేట్….. కాసులు దండుకునే వ్యాపారం….

2019లో అప్పటి తెలంగాణ మున్సిపల్ పాలన ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ మీడియాతో ఒక మాట అన్నారు. ఐదు లక్షల మందికి నివాసం, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఇచ్చే విధంగా ఒక కొత్త నగరం ఏర్పాటు అవుతుందని ఆయన చెప్పారు. కోకపేటకు అవతల ఉండే ఆ నగరంలో 90 మిలియన్ స్క్వేర్ ఫీట్ వర్క్ స్పేస్ కూడా లభిస్తుందన్నారు. ఒకప్పుడు హైటెక్ సిటీ వల్ల కలిగిన భౌతిక, భౌగోళిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి సిటీ డెవలప్ మెంట్ పక్కాగా ఉంటుందని కూడా ఆయన తెలియజేశారు. ఇందుకోసం హెచ్ఎండీఏ వైపు నుంచి అన్ని అనుమతులు లభిస్తాయని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 45 మీటర్ల రోడ్లు ఉంటాయన్నారు. ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. వాక్ టు వర్క్ అంటే ఇంటికి దగ్గరగా కార్యాలయాలు నిర్మించి అందరికి వెసుకుబాటు కల్పించడమే కొత్త నగరం ఉద్దేశ్యమని అర్వింద్ కుమార్ అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో మాట్లాడుతున్నారనుకోవాలి. అయితే కొత్త నగరానికి ఎలాంటి హంగులు అవసరమో చెప్పకుండా హెల్త్ హబ్స్, స్పోర్ట్స్ స్టేడియం సంగతి ఆయన ప్రస్తావిస్తూ కొంత అయోమయానికి అవకాశం ఇస్తున్నారు. అసలు కొత్త నగరం ఎవరికి అవసరమన్న చర్చ మొదలవుతోంది. హైదరాబాద్ సిటీలోనే సరైన మౌలిక సదుపాయాలు లేక వర్షం వస్తే గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. మెట్రో రైలును ఇంకా అన్ని ప్రాంతాలకు విస్తరించలేదు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు నానాటికి తీసిబొట్టు నాగం బొట్టు అన్నట్లుగా తయారైంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచే ప్రక్రియ ఇంకా వేగం పుంచుకోలేదు. అక్కడక్కడా ఒకటి రెండు పనులు చేస్తూ మమ అనిపిస్తున్నారు. పైగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే పెరిగిపోయిన రియల్ ఎస్టేట్ నగరవాసుల అవసరాలకు మించి ఉంది. ఇప్పుడు రియల్టర్ల వ్యాపారం మందగించిందన్న వార్తలు వస్తున్నాయి. కట్టిన ఇళ్లు, ప్లాట్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో మరో నగరం పేరుతో అధికారిక విస్తరణ అవసరమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇంక రియల్ ఎస్టేట్ విస్తరణ కష్టమైనందున స్థిరాస్తి వ్యాపారం కొత్త ప్రాంతాలకు విస్తరించే విధంగా సరికొత్త ఫార్ములాలు ప్రచారం చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం ఏం మాట్లాడారో ఎందుకు మాట్లాడారో తెలియకపోయినా ఒక ప్రాంతం పేరు చెప్పగానే పలోమని డబ్బులు పట్టుకెళ్లి కొనుగోలు చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అలాంటి వారిని ట్రాప్ చేసేందుకే రేవంత్ ఈ పాచిక వేసి ఉండొచ్చని అంటున్నారు. మరో పక్క హైదరాబాద్ ఇప్పటికే హెల్త్ హబ్ గా ఉంది. కార్పొరేట్ ఆస్పత్రులు ఇబ్బడి ముబ్బడిగా తమ బ్రాంచీలను తెరిచాయి. క్రికెట్ విషయం కూడా అలాంటిదే. ఎన్ని మ్యాచులైనా నిర్వహించేందుకు ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంది. క్రీడా పండితులే మరో స్టేడియం గురించి ఆలోచించడం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకే డబ్బులు లేనప్పుడు.. కొత్త ప్రాజెక్టులకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించే వారు పెరుగుతున్నారు. రేవంత్ రెడ్డి మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోకటి మాట్లాడుతున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయి….

తెలంగాణ నేతలకు న్యూయార్క్ అంటే ఇష్టమనిపిస్తోంది. న్యూయార్క్ లో కరెంట్ పోవచ్చు. హైదరాబాద్ లో మాత్రం పోదని అప్పటి సీఎం కేసీఆర్ అనేవారు. ఇప్పుడు న్యూయార్క్ ను మించేలా మరో నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.నిజానికే నగరం చుట్టూ గ్రీన్ టౌన్ షిప్‌లు, రీజినల్ రింగు రోడ్డు వంటి ప్రాజెక్టులు అవసరమే. దానికే సిటీ నెంబర్ ఫోర్ అని పేరు పెట్టడం కాస్త విడ్డూరంగానే అనిపిస్తోంది…

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి