6నెలల్లో BRS-BJP ప్రభుత్వం ?

By KTV Telugu On 11 December, 2023
image

KTV TELUGU :-

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి, రాజాసింగ్ అంతా ఓ కోరస్‌లో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఒక సారి కాదు పదే పదే చేస్తున్నారు. వ్యూహాత్మకంగా చేస్తున్నారా లేకపోతే నిజంగానే అలాంటి ప్రణాళికలు ఉన్నాయో కానీ…  సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాలన్న సంకేతాలను పంపుతున్నారు. వీరి హెచ్చరికలను బూచిగా చూపి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌కు దిగితే…  బీఆర్ఎస్, బీజేపీల బలం తగ్గిపోవడం ఖాయమన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం  ఏర్పడినప్పటి నుండి  విపక్ష నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రభుత్వంపై కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని, ఆరు నెలల్లోనే కూలిపోతుందని జోస్యం చెబుతున్నారు. ఏడాది ఓపిక పట్టాలని కడియం శ్రీహరి అంటే, కాంగ్రెస్ నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు.  తాజాగా పాలకుర్తిలో అనుచరులతో సమావేశం అయిన ఎర్రబెల్లి కూడా  అదే చెప్పారు.

అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చుట్టూ  బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఉచ్చు బిగిస్తున్నారా …  లేదంటే తమ ఎమ్మెల్యేలను చేర్చుకోండి చూద్దామంటూ ఉసి గొల్పేలా వ్యవహారిస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మందిపై కేసులు ఉన్నాయి. పైగా వారిలో ఎక్కువ మంది బంగారు తెలంగాణ బ్యాచ్. ఇతర పార్టీల్లో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చిన వారే. వారెవరికీ సిద్దాంతం ఉండదు.  రాజకీయ లాభమే ముఖ్యం.  పైగా వ్యాపారాలు .. వాటిలో లొసుగులు.. ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ఉండగా చేసిన దందాలు లెక్కలేనన్ని.  దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు సాహసం చేసే అవకాశం ఉండదు.

అయితే ఏడాదిలోపే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటు అవుతుందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  కొన్ని లెక్కలు కూజా చెప్పారు.  గులాబీ పార్టీకి 39 సీట్లు ఉన్నాయని  బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతు ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న కమలం పార్టీని కలుపుకొని, మ రికొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదన్నారు కడియం శ్రీహరి. ఏడాది వరకు ఓపిక పడితే పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తారన్న ఆయన, సింహం తిరిగి వస్తుందన్నారు.   కడియం ఆ వ్యాఖ్యలు చేయక ముందే  తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోయిందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరనే నిరాశలో కాంగ్రెస్ ఓటర్లు ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత మూడు రోజులనుంచి ఇలాంటి సందేశాలు, వీడియోలు వస్తున్నాయని కార్యకర్తలకు వివరించారు.   ఏడాదిలో ప్రభుత్వం వస్తుందని కేటీఆర్ ఎక్కడా చెప్పలేదు కానీ.. ఆ  ఉద్దేశం మాత్రం కేటీఆర్ మాటల్లో ఉంది.

అనూహ్యగా బీఆర్ఎస్ నేతలే కాదు.. బీజేపీ నేతలు కూడా అదే అంటున్నారు.  ఏడాదికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్న ఆయన, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజాసింగ్ అంటున్నారు.  కేసీఆర్ దిగిపోతూ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారని ఆరోపించారు. ఆ అప్పులు తీర్చలేక కాంగ్రెస్ నేతల్లో గందరగోళం మొదలవుతుందన్నారు.  బహుశారాజాసింగ్ ఉద్దేశం  బీఆర్ఎస్, బీజేపీ కావొచ్చన్న అభిప్రాయం ఉంది.

ప్రభుత్వాన్ని కూలగొడతామని … ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే బెదిరింపులు వస్తూంటే సీఎం రేవంత్ రెడ్డి ఊరుకుంటారా ?. తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కాదు..  ప్రతిపక్షాలను బలహీనపర్చే ప్రయత్నం చేయకుండా ఉంటారా ?

గతంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో…అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి  టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు టచ్ లో ఉన్నారని, తాను తలచుకుంటే ప్రభుత్వం పడిపోతుందంటూ హెచ్చరించారు.  జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ   23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను  పార్టీలో చేర్చుకున్నారు.  ఇప్పుడు కూడా   కీలకమైన నేతలంతా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్స్ చేస్తుండటంతో రేవంత్ రెడ్డి కూడా  ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటీ మార్కులతో పాస్ అయింది. అంటే 65 స్థానాలతో   ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డిని సీఎంగా చేయడం కాంగ్రెస్‌లో ఉన్న ఓ వర్గం ఎమ్మెల్యేలకు ఇష్టం లేదనే చర్చ కూడా నడుస్తోంది. ఇటు విపక్షాలు అదే మాట చెప్పకనే చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో అసంతృప్తులను మేనేజ్ చేసుకుంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

2014లో కూడా బీఆర్‌ఎస్‌ ఇలా బొటాబొటీ మెజార్టీతోనే అధికారంలోకి వచ్చింది. తర్వాత ఇతర పార్టీల నేతలను చేర్చుకొని 2018నాటికి బలపడింది. ఇదే సూత్రాన్ని కాంగ్రెస్ కూడా ఎందుకు అమలు చేయదూ అనే టాక్ కూడా నడుస్తోంది. ఏమైనా సరే విపక్షాల నుంచి వినిపిస్తున్న కామెంట్స్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.  ఏడాదిలో ప్రభుత్వం మారుతుందన్న బెదిరింపులపై   కాంగ్రెస్ నుంచి మాత్రం రియాక్షన్ రాలేదు. దృష్టి రాజకీయాల కంటే పాలనపై పెట్టాలనే ఆలోచనలో ఉన్నామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అంటున్నారు.

రేవంత్ రెడ్డి స్పందించకపోయినప్పటికీ ఆషామాషీగా రాజకీయాలు చేయడరని ఆయన రాజకీయ స్వభావం చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఇలాంటివి ప్రకటనల కన్నా చేతల్లోనే ఎక్కువ చూపించే అవకాశం ఉంది.  అందుకే రేవంత్ రెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నది ముందు ముందు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. అందుకే ఆపరేషన్ లోటస్ లు విస్తృతంగా నిర్వహించేసి ప్రభుత్వాల్ని మార్చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలోనూ అలాంటి ప రిస్థితుల్ని కాదనలేరు. కానీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం నాయకుడి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. రేవంత్ కు ఆ సామర్థ్యం ఉందని ఎక్కువ మంది నమ్మకం…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి