అప్పట్లో మల్లారెడ్డి – ఇప్పుడు హరీష్ టార్గెట్ ! మైనంపల్లి వెనుక ఉన్నదెవరు ?

By KTV Telugu On 24 August, 2023
image

KTV TELUGU :-

భారత రాష్ట్ర సమితిలో సిట్టింగ్‌లకే సీట్లు ప్రకటించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాబట్టి పెద్దగా ఎక్సైట్ కాలేదు. సంబరాలు పెద్దగా జరగడం లేదు. చాన్స్ కోసం చూసిన నేతలు గొణుక్కుంటున్నారు. కానీ బీఆర్ఎస్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ అంతా మైనంపల్లి హన్మంతరావుదే. ఆయన ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసినట్లుగా హరీష్ రావుపై కామెంట్లు చేస్తున్నారని.. దీని వెనుక బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల కోణం ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. తిరుమలలో అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా మైనంపల్లికి టిక్కెట్ ప్రకటించారు. ఇప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఏ క్షణమైనా సస్పెండ్ అనే లీకులు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ అభ్యర్థిపై కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. కానీ… ఇదందా ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ అన్న అనుమానం ఎక్కువ మందికి వస్తోంది. ఓ బలమైన శక్తి మద్దతు లేకపోతే మైనంపల్లి ఇలా రివోల్ట్ అవరన్న చర్చ జరుగుతోంది.

గత ఏడాది డిసెంబర్‌లో మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందర్నీ తన నివాసానికి పిలిచారు. మల్లారెడ్డిని మాత్రం దూరం పెట్టారు. ఎందుకంటే.. మల్లారెడ్డికి వ్యతిరేకంగా జరిగిన సమావేశం అది . మల్లారెడ్డి కారణంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఈ అంశం బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ అయింది. కానీ తర్వాత చల్లారిపోయింది. మల్లారెడ్డిని కంట్రోల్ చేయడానికి మైనంపల్లితో కావాలనే హైకమాండ్ పెద్దలు ఈ సమావేశం పెట్టించారని విమర్శలు చేయించారన్న గుసగుసలు ఉన్నాయి. ఇవి రాజకీయాల్లో అధారాలతో ఎప్పుడూ ఫ్రూవ్ కావు. కానీ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సిందే. మైనంపల్లితో భేటీ అయి… మల్కాజిగిరి జిల్లా ఎమ్మెల్యేలంతా మల్లారెడ్డిపై తిరుగుబాటు స్వరం వినిపించేంత ధైర్యం.. హైకమాండ్ కు తెలియకుండా ఎమ్మెల్యేలు చేయలేరు. అందుకే మైనంపల్లి హైకమాండ్ మనిషేనని అందరూ గట్టిగా నమ్ముతున్నారు.

మొదట్లో మల్లారెడ్డిని టార్గెట్ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఇప్పుడు పార్టీలో మరో కీలక అయిన హరీష్ రావును లక్ష్యంగా ఎంచుకున్నారు. హరీష్ రావుపై చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రబ్బర్ చెప్పులతో సిద్దిపేటకు వచ్చి లక్ష కోట్లు సంపాదించారని ఆరోపించారు. అంతటితో వదిలి పెట్టలేదు. సిద్దిపేటలోనే పోటీ చేస్తానని.. సిద్దిపేటలోనే ఓడిస్తానని సవాల్ చేశారు. మైనంపల్లి సవాళ్లను చూస్తే… హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారని అర్థం చేసుకోవచ్చు. మైనంపల్లికి, హరీష్ రావుకు పాత గొడవులు ఉన్నాయా అంటే… లేవనే సమాదానం వస్తుంది. మైనంపల్లి మెదక్ జిల్లాకు చెందిన వారు. 2009లో మహాకూటమిలో భాగంగా టీఆర్ఎస్ పొత్తులో మెదక్ సీటు టీడీపీకి వచ్చింది. టీడీపీ నుంచి మైనంపల్లి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఆయన హైదరాబాద్ సిటీకి మారాలనుకుని.. మెదక్ ఎమ్మెల్యేగా ఉంటూ… మల్కాజిగిరిలో టీడీపీ తరపున పని చేసుకున్నారు. కానీ 2014కి వచ్చే సరికి.. బీజేపీతో పొత్తుల్లో ఆయనకు చాన్స్ దొరకలేదు. దాంతో కాంగ్రెస్‌లో చేరారు. అక్కడా టిక్కెట్ దొరకకపోవడంతో వెంటనే బీఆర్ఎస్ లో చేరి ఎంపీగా పోటీ చేశారు. మల్లారెడ్డి చేతిలో చాలా స్వల్ప తేడాతోనే ఓడిపోయారు కానీ.. కేసీఆర్ మంచి ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత మల్కాజిగిరి టిక్కెట్ ఇచ్చారు. అయితే తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్ ను తన కుమారుడికి వారసత్వంగా ఇవ్వాలని.. గత మూడు,నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నారు.

మెదక్‌ నియోజకవర్గం నుంచి పద్మా దేవందర్ రెడ్డి వరుసగా రెండు సార్లు గెలిచారు. ఆమె ఉన్నప్పటికీ.. మైనంపల్లి రోహిత్ తో … హన్మంతరావు అక్కడ పాగా వేయించే ప్రయత్నం చేశారు. విస్తృతంగా సేవా కార్యాక్రమాలు చేపట్టారు. రాజకీయాల్లో మైనంపల్లిపై అవినీతి ఆరోపణలు ఎక్కడా పెద్దగా వినిపించారు. భూ లావాదేవీలు లేకపోతే.. మరో ఆర్థిక తవకల విషయంలో ఆయన పేరు ఎప్పుడూ వివాదాల్లోకి రాలేదు. ఐటీ దాడులు.. ఈడీ కేసుల జాడ ఉండదు. కానీ.. ఆయన రాజకీయాల్లో విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. మల్కాజిగిరిలో గెలవడానికి ఆయన సొంత ఖర్చుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేశారు. అదే తరహాలో తన కుమారుడి కోసం… పాతిక కోట్ల రూపాయలను పైగా వెచ్చించి మెదక్ లో … సొంత వర్గాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించారు. సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. ఇదంతా పార్టీలో పెద్దల అనుమతి.. ఆశీస్సులు లేకుండా చేయడం సాధ్యం కాదు. అంటే… మైనంపల్లికి సొంత పార్టీలో సపోర్ట్ ఉంది. తన కుమారుడు మెదక్ లో కార్యకలాపాలు నిర్వహించడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ టిక్కెట్ మాత్రం దక్కలేదు. దీనికి హరీష్ కారణం అని ఆయన గట్టిగా నమ్మారు. అందుకే విమర్శలు గుప్పించారు.

మైనంపల్లి ఆగ్రహం వెనుక బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు ఉన్నాయా ? కేటీఆర్, కవిత మైనంపల్లి వ్యాఖ్యలను ప్రత్యేకంగా ఖండించడం ఎందుకు ? పార్టీ పరంగా తీసుకునే చర్యల విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది ?

హరీష్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవే. కానీ ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తరవాత కూడా కేసీఆర్ టిక్కెట్ ప్రకటించడంతో … బీఆర్ఎస్ నేతలందరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎలా స్పందిస్తే ఏమవుతుందో అన్న అనుమానాలతో చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ చాలా ఆలస్యం తర్వాత అలాంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావుకు అండగా ఉంటామన్నారు. ఆయన పార్టీ పిల్లర్లలో ఒకరని కేటీఆర్ అన్నారు. తర్వాత కవితకూడా స్పందించారు. హరీష్ పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే.. మైనంపల్లి పేరును వారిద్దరూ ప్రస్తావించలేదు. దీంతో బీఆర్ఎస్ లో అంతర్గత రాజకీయాలపై మరింత జోరుగా చర్చ జరుగుతోంది.

గత ఎన్నికలకు ముందు కూడా హరీష్ రావుకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయనను పూర్తిగా సిద్దిపేటకే పరిమితం చేశారు. పార్టీ ఎన్నికల వ్యూహాల్లో ఎలాంటి భాగస్వామ్యం కల్పించలేదు. అప్పట్లో హరీష్ రావు కూడా పలు సంస్థలకు ఇంటర్యూలు ఇచ్చి కేసీఆర్ తర్వాత కేటీఆరే నాయకుడని… స్పష్టం చేశారు. ఆయినా ఆయన విధేయపై బీఆర్ఎస్ హైకమాండ్ కు పెద్దగా నమ్మకం కలగలేదు కానీ చాలా కాలం లూప్ లైన్ లో ఉండిపోయారు. న్నికల తర్వాత కూడా హరీష్ కు మంత్రి పదవి ఇవ్వలేదు. చాలా రోజులు ఆలోచించిన తర్వాత హరీష్ తో పాటు ఈటలకూ కలిపి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ ప్రాధాన్యం మాత్రం పెద్దగా దక్కలేదు. ఆయన ఎక్కువగా సిద్దిపేటకే పరిమితమవుతూ వస్తున్నారు. కానీ ఈటల రాజేందర్ ను ఎప్పుడైతే బీఆర్ఎస్ నంచి బయటకు పంపాలని డిసైడయ్యారో అప్పుడు మాత్రమే హరీష్ కు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక బాధ్యతను హరీష్ రావుకే ఇచ్చారు. ఈటలరాజేందర్ ను పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాతనే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన శాఖలు హరీష్ కే ఇచ్చారు. ఇప్పుడు మైనంపల్లి.. హరీష్ ను టార్గెట్ చేయడం వెనుక ఆ రాజకీయం ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు మైనంపల్లి తన కుమారుడికి టిక్కెట్ విషయంలో తగ్గే అవకాశం లేదని.. ఆయన పార్టీ మారిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తో మాట్లాడుకున్నారని అంటున్నారు. కానీ చివరిలో అసలు ట్విస్ట్ ఉంటుందని … మొత్తంగా హరీష్ టార్గెట్ గానే బీఆర్ఎస్ లో రాజకీయాలు జరుగుతున్నాయని అందులో మైనంపల్లి ఓ పావు అనే అనుమానాలూ బ లంగా ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

రాజకీయం అంటే నేరుగా ప్రత్యర్థితో చేసే యుద్ధమే కాదు పావుల్ని ప్రయోగించి సొంత పార్టీలో ప్రత్యర్థుల్ని ఓడగొట్టడం కూడా. ఈ రాజకీయాన్ని ఎవరూ ఊహించలేరు . బీఆర్ఎస్‌లో ఇప్పుడు అదే జరుగుతోందనుకోవచ్చు

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి