తెలంగాణలో ఈసీ పాలన -బీఆర్ఎస్‌కు నాటి టీడీపీ కష్టాలే !

By KTV Telugu On 13 October, 2023
image

KTV TELUGU :-

తెలంగాణలో పాలనను ఎన్నికల కమిషన్ దాదాపుగా చేతుల్లోకి తీసుకుంది. అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చేందుకు ప్రయత్నిస్తోంది. మొదటి విడతగా… బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులకు సన్నిహితుల అని పేరు పడ్డ ముఖ్య అధికారులందర్నీ బదిలీ చేసింది. నిజానికి ఇది మొదటి విడతే.  ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఇంకా ఇరవై రోజులకుపైగా ఉంది. ఈ లోపు ఎంత మంది అధికారులు మారుతారన్నది చెప్పడం కష్టమే. ఎందుకంటే… ఈసీ కి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి.  కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు.  2019లో టీడీపీకి ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అలాంటి పరిస్థితులు ఎదురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ ఎన్నికల్లో ఎంతో కొంత మేలు చేస్తుంది. కానీ కేంద్రంతో సున్నం పెట్టుకున్న పార్టీలకు మాత్రం మేలు చేయదు. గతంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో గొడవ పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది..  కోడ్ రాగానే ఎన్నికల సంఘం  సీఎస్ సహా కీలకమైన అధికారులందర్నీ మార్చేసి..   సీఎం చంద్రబాబును డమ్మీని చేసేసింది. చివరికి సీఎస్ కూడా ఆయన మాట వినలేదు.  చివరికి ఎన్నికల కోడ్ రాక ముందే కేబినెట్ లో ఆమోదించిన నిర్ణయాల అమలు జీవోలూ విడుదల చేయలేదు. అది చంద్రబాబు  తీవ్ ఎఫెక్ట్ చూపిచింది. ఎన్నికల్లో  ఓటమికి అదే కారణం కాకపోవచ్చు కానీ.. అది కూడా ఓ కారణం అయింది.

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఒక్క రోజులోనే ఎన్నికల సంఘం పాలన చేతుల్లోకి తీసుకుంది. ముఖ్యమైన అధికారులందర్నీ బదిలీ చేసేసింది. హైదరాబాద్ కమిషనల్ సీవీ ఆనంద్ నూ బదిలీ చేయాలని ఆదేశించింది. నాలుగు జిల్లాల కలెక్టర్లతో పాటు పదమూడు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్లనూ  బదిలీ చేయాలని ఆదేశించారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు సీనియర్ అధికారులను నియమించి..  గురువారం సాయంత్రం కల్లా నివేదిక పంపాలని ఈసీ ఆదేశించింది.   సాధారణంగా  ఫిర్యాదులు వస్తే బదిలీ చేస్తారు. కానీ ఇక్కడ ముందే లిస్ట్ రెడీ చేసుకున్నట్లుగా జాబితా వచ్చేసింది.  వెంటనే సీఎస్ క్షణం ఆలోచించకుండా  అమలు చేసేశారు. ఈసీ పంపిన జాబితాలో అందర్నీ రిలీవ్ చేశారు. కొత్త వారిని నియమించారు.  ఆలస్యమైతే ఏమవుతుందో..  సీఎస్ కు బాగా తెలుసు.  తమ ఆదేశాలు పాటించకపోతే సీఎస్ నూ బదిలీ చేసేస్తారు.  అందుకే బదిలీ చేయాలని ఉత్తర్వులు వచ్చిన గంటల్లో పూర్తి చేసేశారు.

తెలంగాణ లో ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. మూడు వారాలకుపైగానే ఉంది. అయినప్పటికీ.. ఈసీ షెడ్యూల్ వచ్చిన ఒక్క రోజులోనే అధికారుల్ని పూర్తి స్థాయిలో  బదిలీలకు ఆదేశించడం సంచలనంగా మారింది. నిజానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంబమైన తర్వాత  విధి నిర్వహణలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనుకుంటే.. బదిలీ చేస్తారు. కానీ ఈ సారి మాత్రం.. ఈసీనే చర్యలు తీసుకుంది. ప్రతి ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు కీలకమైన  స్థానాల్లో విధేయుల్ని నియమించుకుంటుంది. బీఆర్ఎస్ కూడా అదే చేసింది. కానీ ఈసీ ఆ లెక్కలన్నీ తారుమారు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు పలువురి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అదే సమయంలో ఆ అధికారులంతా..   కేసీఆర్ కు అత్యంత విధేయులుగా పేరు పడ్డారని.. విధి నిర్వహణలో  బీజేపీ నేతల్ని వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ సీపీ రంగనాథ్…   బండి సంజయ్ పై  తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి.  వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బదిలీల ప్రక్రియ చేపట్టినట్లుగా తెలుస్తోంది.

గతంలో ఏపీ ఎన్నికల సమయంలో  ఈసీ ఇలాగే వ్యవహరించింది. చివరికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో.. జరిగిన వివేకా  హత్య కేసు విచారణ చేస్తున్న కడప ఎస్పీని కూడా  బదిలీ చేశారు. అదేమిటని ఎవరు ప్రశ్నించినా .. ఈసీకి అధికారం ఉందనే సమాధానం వచ్చింది. చివరికి సీఎస్ ను కూడా తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని కూర్చోబెట్టారు. అప్పట్లో తెలంగాణ సర్కార్ కు ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు.  తెలంగాణ సర్కార్ 2018 ముందస్తు ఎన్నికల సమయంలో  కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుకుంది. పాతిక లక్షలకుపైగా ఓట్లు గల్లంతయ్యాయన్న  ఆరోపణలు వచ్చినా  సీఈవో పట్టించుకోలేదు. ఎన్నికలైన తర్వాత ఆయన సారీ చెప్పారు. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సారి మాత్రం అలాంటి సహకారం బీఆర్ఎస్ అందడం లేదని తాజా పరిణామాలతో తేలిపోయింది.

ఓ సారి ఈసీ బదిలీ చేసిన అధికారుల్ని   ఎన్నికల విధుల్లో  నియమించరు. వారెవరికీ ఇక ఎన్నికలతో సంబంధం ఉండదు. ఎన్నికల సంఘం చేపట్టే ఈ నియామకాల విషయంలో అధికార పార్టీ నుంచి విమర్శలు రావొచ్చు కానీ…  ఈసీకి దురుద్దేశం అపాదించలేరు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈసీ ఇలా ఎందుకు దూకుడుగా ఉండదనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. పక్ష పాత ధోరణి ఉందనే విమర్శలూ మూట గట్టుకోవాల్సి ఉంటుంది.

ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా నిర్వహించడం ఎన్నికల సంఘం విధి. అందుకే  రాజ్యాంగంలో ఈసీకి పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టారు. ఈసీకి ఉండే అధికారాలను కోర్టులు కూడా ప్రశ్నించలేవు. ఎన్నికల నిర్వహణలో కోర్టులు కూడా జోక్యం చేసుకోవు. అంతటి అధికారాలు ఈసీ కఠినంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో.. టీఎన్ శేషన్ లాంటి వాళ్లు చూపించారు. నిబంధనలను కఠినంగా అమలు చేసి ప్రజల్లో ఎన్నిక ల ప్రక్రియపై విశ్వాసం పెంచారు.  ఆయనకు అంత పేరు రావడానికి కారణం..   అధికార, ప్రతిపక్ష అనేత తేడా లేకుండా నిబంధనలన్నీ ఒకే రకంగా అన్వయించడం.  పక్షపాతం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం. అయితే తర్వాత వచ్చిన ఎన్నికల సంఘాలు.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు…  పక్ష పాత నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. కేంద్రంలో ఉండే అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారని బలంగా విమర్శలు ఉన్నాయి.  కాంగ్రెస్ ఉన్నప్పుడు.. బీజేపీ వచ్చిన తర్వాత కూడా అవి పెరిగాయి కానీ తగ్గలేదు. ఇప్పుడు మరోసారి అలాంటి విమర్శలు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే… ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో  ఎన్నికల సంఘం బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లోనూ ఎన్నికలు నిర్వహిస్తోంది. అక్కడ ఇలా దూకుడుగా వ్యవహరిస్తుందా అంటే అసాధ్యమని చెప్పాలి

గతంలోనూ అంతే.  కేవలం అధికార పార్టీ.. ఆ పార్టీ సన్నిహితులు చేసే ఫిర్యాదులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సెలక్టివ్ గా చర్యలు తీసుకోవడం తరచూ వివాదాస్పదం అవుతుంది.  బెంగాల్ ఎన్నికల సమయంలో అక్కడి డీజీపీని కూడా  మార్చారు.  ఫలితాలు తారుమారు అవుతాయా లేదా అన్న సంగతిని పక్కన పెడితే.. అధికార వ్యవస్థ.కు.. ఓ సంకేతం పంపినట్లు అవుతుంది. దాని వల్ల వారు..  పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో షెడ్యూల్ వచ్చిన ఒక్క రోజులోనే కీలక అధికారులందర్నీ బదిలీ చేయడం వల్ల ఇలాంటి బావనే ఏర్పడుతోంది.  ఇది ప్రారంభమే.. ముందు ముందు ఎన్నికల నిర్వహణలో అధికారులంతా.. ఈసీ నియమించిన వారే ఉండే అవకాశం కనిపిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా బీఆర్ఎస్ భరించాల్సిందే. విమర్శలు చేయడం తప్ప ఉపయోగం ఉండదు. ఎందుకంటే 2018లో  ఈసీ సానుకూలంగా ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాల్ని బీఆర్ఎస్ గరిష్టంగా ఉపయోగించుకుంది. చివరి క్షణంలో అసెంబ్లీని రద్దు చేసినా…  ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో రెడీ కాకపోయినా ఎన్నికలు నిర్వహించేసింది. ఈ సారి మాత్రం…  అప్పటి సహకారంలో పదో శాతం కూడా అందదు. అందుకే … అధికార పార్టీ అడ్వాంటేజ్ ఈ సారి బీఆర్ఎస్ కు లేనట్లేనని అనుకోవచ్చు.

ఎన్నికల నిర్వహణలో ఈసీది అంపైర్ పాత్ర.  ఆటగాళ్లను మార్చకూడదు. రూల్స్ అందరికీ సమానంగా పాటించాలి. అలాంటివి చేసినప్పుడే ఈసీ విలువ పెరుగుతుంది. లేకపోతే విమర్శల పాలవుతుంది. అలాంటివి జరగకుండా చూసుకోవాల్సింది ఈసీనే.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి