మహారాష్ట్ర ప్లాన్ – మేలో BRS-BJP సర్కార్ !?

By KTV Telugu On 27 December, 2023
image

KTV TELUGU :-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలల ముచ్చటేనని బీఆర్ఎస్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదేమీ కాంగ్రెస్ పార్టీని బెదిరించడానికి చేస్తున్న కామెంట్స్ కావు. వ్యూహాత్మకంగా చేస్తున్నవేనని జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం అవుతోందని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి.  దానికి తగ్గట్లుగానే సీక్రెట్ గా కొన్ని వ్యవహారాలు, చర్చలు జరిగిపోతున్నాయి. తెర వెనుక అసలేం జరుగుతోందంటే ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.  ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోబోతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. మొత్తం 11 పార్లమెంట్ నియోజకవర్గాల్లో  విజయం సాధించవచ్చని చెబుతున్నారు. అలా విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదు. కానీ ఫలితాలు తేడా వస్తే మాత్రం.. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కూడా కష్టమవుతుంది. ఖచ్చితంగా ఇదే లాజిక్ తో బీఆర్ఎస్ రాజకీయాలు ప్రారంభించింది.

బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే 14 వరకూ పార్లమెంట్ సీట్లు గెలుచుకోవచ్చని ఓ సర్వే వెల్లడించింది. అయితే ఇక్కడ రెండు  పార్టీలు ఇంకా కలవలేదు. కానీ కలవడానికి ఓ ప్రాతిపదిక అయితే ఏర్పడింది. అదే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు.  బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు లోక్ సభ సీట్లు ముఖ్యం కాదు. తెలంగాణలో  అధికారం ముఖ్యం. మరో ఐదేళ్ల పాటు ఆగితే పార్టీని కాపాడుకోవడం కష్టం. అందుకే ఇప్పటికిప్పుడు అధికారం కావాలి. .. అందు కోసమే కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. బీజేపీ రాజకీయాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన బీజేపీ పెద్దలు ఇరు వర్గాలకు అనుకూలమైన ఓ ఫార్ములాను రెడీ చేసి బీజేపీతో సంప్రదింపులు ప్రారంభించినట్లుగా చెబుతున్నారు.

బీఆర్ఎస్ ఫార్ములా ప్రకారం లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలసి పోటీ చేస్తాయి. ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరుతుంది. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన తర్వాత  కాంగ్రెస్ డీలా పడుతుంది.  కేంద్రంలో ఎలాగూ మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. వెంటనే ఆపరేషన్ కమల్ ప్రారంభించాలి. అంటే గతంలో కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ కూటమిని కూల్చేసినట్లుగా.. మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాడీ అధికారాన్ని లాగేసుకున్నట్లుగా  ఆపరేషన్ పూర్తి చేయాలి.  కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన ఉత్సాహం… తెలంగాణలోనూ కాంగ్రెస్ లోక్ సభ సీట్లు గెల్చుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతల్ని ఆకర్షించడం చాలా సులువు అని బీఆర్ఎస్ భావిస్తోంది.   గతంలో కడియం శ్రీహరి చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే ఐదారుగురు ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే చాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది.  బీజేపీ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఇదేమంత కష్టం కాదని కేసీఆర్‌కుతెలుసు.

ఏ అధికారం లేకుండా కేసీఆర్ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆకర్షించలేరు… అంతే కాదు.. తన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేరు. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ అవసరం. కానీ బీజేపీతో వ్యవహారం అంత ఈజీ కాదు. తేడా వస్తే బీఆర్ఎస్ నిర్వీర్యం అయిపోతుంది. భారతీయ జనతా పార్టీ లక్ష్యం తన పార్టీని బలోపేతం చేసుకోవడమే. అందుకే ఎన్ని ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసిందో చెప్పాల్సిన పని లేదు.  ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కోసం బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే… ఆ పార్టీ నుంచి తన పార్టీని కాపాడుకోవడం అంత తేలిక కాదు. పొత్తులు పెట్టుకున్న మరుక్షణం తెలంగాణలో సగం సీట్లు బీజేపీకి సమర్పించుకోవాలి. మెజార్టీ సీట్లు సాధించి లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ ను కూలగొట్టి కేసీఆర్ సర్కార్ ను ఏర్పాటు చేసినా బీజేపీకి వాటా ఇవ్వాలి. ఏర్పడేది బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వమే. అలా ఏర్పడినా కేసీఆర్ జుట్టు బీజేపీ చేతుల్లోనే ఉంటుంది. ఇది అత్యంత రిస్క్ .

ఇవన్నీ పక్కన పెడితే  పొత్తులు పెట్టుకున్న తర్వాత కూడా  బీజేపీ, బీఆర్ఎస్ కూటమి మంచి ఫలితాలు సాధించకపోతే..  బీజేపీకి నష్టం ఏమీ ఉండదు.. కానీ బీఆర్ఎస్ మాత్రం ఉనికి సమస్యలో పడిపోతుంది. నేతలంతా కాంగ్రెస్, బీజేపీల వైపు వెళ్లిపోతారు. ఉద్యమపార్టీ ఉనికి సమస్యను ఎదుర్కొంటుంది. ఎలా చూసినా కేసీఆర్ ముందు అత్యంత కఠినమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయని అనుకోక తప్పదు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి