బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వరసగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు. రోజుకో నేతను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఆయన అసలు ఉద్దేశం వేరే ఉందా. ఆయన కావాలనే అలా మాట్లాడుతున్నారా. కాంగ్రెస్ లో విభేదాలు సృష్టించాలన్నదే ఆయన పన్నాగమా… మహేశ్వర్ రెడ్డిని ఎవరైనా నడిపిస్తున్నారా.. ఆయనకు అందుతున్నదంతా స్పూన్ ఫీడింగేనా….
మహేశ్వర్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్న నాయకుడే. కాంగ్రెస్ రాజకీయాలు, కాంగ్రెస్ అవినీతి, కాంగ్రెస్ తీరు ఆయనకు బాగానే తెలుసు. అందుకే సంప్రదాయ బీజేపీ నాయకుల కంటే ఎక్కువగా ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శించగలరు. అధికార పార్టీ లొసుగులను ఆయన గట్టిగా పట్టుకోగలరు. మహేశర్ రెడ్డి ఇప్పుడు క్రమంగా తెలంగాణ కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిని, మంత్రులను ఏకి పడేసే ప్రయత్నంలో రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వరుసగా విమర్శిస్తూ వస్తున్నారు. ఇరిగేషన్ బిల్లుల కోసం బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఏలేటి పరోక్షంగా ఆర్థిక మంత్రి భట్టిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఇన్ డైరెక్ట్‌గా ఎటాక్ చేశారు. దీంతో కాంగ్రెస్ లీడర్ల ప్రొత్సాహంతోనే ఏలేటి ఆరోపణలు చేస్తున్నారనే చర్చ జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్‌లోని కొందరు కీలక నేతలతో మహేశ్వర్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీ అంతర్గత అంశాలను సదరు లీడర్లే ఏలేటికి చేరవేస్తున్నారేమోనని అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి సైతం తీసుకెళ్లారు.పైగా ప్రధాని మోదీ కూడా ఆర్ఆర్ టాక్స్ విషయం ఒక సభలో ప్రస్తావించారు. కొద్ది కాలంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమైందని మోదీ ఆరోపించారు….
ఏలేటికి రేవంత్ రెడ్డి అప్పాయింట్ మెంట్ ఎందుకిచ్చారు. ఇద్దరి మధ్యా జరిగిన చర్చలేమిటి.. మంత్రి ఉత్తమ్ పై మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలేమిటి.. ఆయనంటే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారా.. ఎప్పుడేం మాట్లాడతారోనని టెన్షన్ పడుతున్నారు..
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రైస్ మిల్లర్లతో సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమ్మక్కై ‘యూ’ ట్యాక్స్ పేరుతో 5 వందల కోట్లను వసూలు చేశారని ఆరోపించారు. అందులో వంద కోట్లు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి పంపారని కూడా వెల్లడించారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టారని మహేశ్వర్ రెడ్డి కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. దానతిో ఉత్తమ్ యథాలాపంగా సమాధానం చెప్పారే తప్ప… గట్టిగా కౌంటర్ ఇవ్వలేదు. మరో పక్క ఏలేటి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు.
ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి బిజీ షెడ్యూలులో ఉన్నారు. ఉదయం ఇరిగేషన్ రివ్యూ, సాయంత్రం కేబినెట్ సమావేశం పెట్టుకున్నారు. సరిగ్గా అదే రోజు ఉదయం రైతాంగ సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు తమకు సీఎం అపాయింట్‌మెంట్ కావాలని సీఎంఓ అధికారులను సంప్రదించారు. సీఎం బీజీ షెడ్యూలు నేపథ్యంలో తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే సెక్రటేరియట్ ఎదుట ఆందోళనకు దిగాలని బీజేపీ లీడర్లు ప్లాన్ చేసుకున్న విషయం రేవంత్ గ్రహించారు. వెంటనే బీజేపీ నాయకులను పిలిచి వినతి పత్రం తీసుకుని, ఫొటోలను అధికారికంగా విడుదల చేయించారు. దానితో నిరసన జరగలేదు.. ఆరోపణలు మాత్రం ఉత్తమ్ వైపుకు మళ్లాయి. అదే ఇప్పుడు చర్చకు దారితీసింది. సెక్రటేరియట్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఏలేటీ టార్గెట్ ఉత్తమ్ వైపుకు ఎందుకు మళ్లిందనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీని వెనుక గట్టి రాజకీయ కారణాలున్నాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏలేటిని కాంగ్రెస్ నాయకులే నడిపిస్తున్నారా లేక ఒక అదృశ్య శక్తి ఉందా అని పరిపరివిధాలా అనుమానాలు కలుగుతున్నాయి.
ఏలేటిని నడిపించే ఆ అదృశ్య శక్తి ఎవరనేది కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఏదోక రోజున ఆయనే ఆ అంశాన్ని బయటపెడతారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో బీజేపీ మాత్రం మౌనరాగాలు ఆలాపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…