పొత్తు నొప్పులు

By KTV Telugu On 9 November, 2023
image

KTV TELUGU :-

తెలంగాణాలో బిజెపి-జనసేన పొత్తు వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాల్లో స్థానిక బిజెపి నేతలు , కార్యకర్తలు బిజెపి నాయకత్వంపై మండి పడుతున్నారు. ఎక్కడినుంచో వచ్చిన పార్టీకి ఇక్కడ సీట్లు ఇవ్వడం ఏంటని వారు  నిప్పులు చెరుగుతున్నారు. జనసేనకు తమ నియోజక వర్గాలు కేటాయిస్తే తామే దగ్గరుండి ఓడించి చూపిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 9 స్థానాలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏ ఒక్క నియోజక వర్గంలోనూ జనసేన అభ్యర్ధలకు తాము సహకారం అందించే ప్రసక్తే లేదని లోకల్  కమలనాథులు తెగేసి చెబుతున్నారు.

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీతో  పొత్తు పెట్టుకుని సీట్లు పంచుకుని  ఎన్నికల బరిలో దిగాలని  జనసేన నిర్ణయించింది. ఈక్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఎంపీ లక్ష్మణ్ లతో విడిగా భేటీ అయిన పవన్ కళ్యాణ్ రక రకాల అంశాలపై చర్చించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పిలిపించారు. అక్కడ పార్టీ అధ్యక్షుడితో పవన్ కళ్యాణ్  భేటీ అయ్యారు. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఆ చర్చలో పాల్గొన్నారు. అందులో  బిజెపి-జనసేన కలిసి తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  దీనికి ముందు జనసేన నేతలు తెలంగాణాలో 32 నియోజక వర్గాల్లో  అభ్యర్ధులను బరిలోకి దింపాలని నిర్ణయించారు.

జనసేన ముందుగా అనుకున్నట్లుగా 32 స్థానాలు కాకుండా 11 స్థానాలు  జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ సంఖ్య 9కి మారినట్లు చెబుతున్నారు. ఇప్పటికీ ఎన్ని స్థానాలనేది క్లారీటీ రాలేదు.  అయితే పొత్తు మాత్రం ఖరారైందని రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి. గ్రేటర్ పరిధిలో కూకట్ పల్లి, శేరిలింగం పల్లి నియోజక వర్గాలను జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అదే విధంగా జిల్లాల్లో తాండూరు, నాగర్ కర్నూలు, కోదాడ,పాలేరు, మధిర, కొత్తగూడెం, అశ్వారావు పేట నియోజక వర్గాల పేర్లు వినిపించాయి. బిజెపి ఎన్నికల ప్రచారంలో పవన్  కళ్యాణ్ విస్తృతంగా పాల్గొంటారని కూడా  చెప్పారు

నాగర్ కర్నూల్ లో బిజెపి పార్టీ  శ్రేణుల సమావేశం జరిగింది. అందులో  స్థానిక బిజెపి నేతలు రాష్ట్ర నేతలపై మండి పడ్డారు. నాగర్ కర్నూలు సీటును జనసేనకు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. బిజెపికి అంతో ఇంతో బలం ఉన్న చోట దశాబ్దాల తరబడి పార్టీ జెండాను మోసి పార్టీ బలోపేతానికి పనిచేసిన వారిని పక్కన పెట్టి ఎక్కడినుంచో వచ్చిన జనసేనకు ఎందుకు కేటాయించారని నిప్పులు చెరిగారు. తక్షణమే నాగర్ కర్నూలు లో బిజెపి అభ్యర్ధినే  బరిలో దింపుతామని ప్రకటన చేయాలని అలా కాకుండా జనసేన అభ్యర్ధి బరిలో ఉంటే మాత్రం   విపక్షాల మాట దేవుడెరుగు తామే దగ్గరుండి ఓడిస్తామాని వారు అల్టిమేటం జారీ చేయడంతో రాష్ట్ర నాయకులు తలలు పట్టుకున్నారట.

గ్రేటర్ పరిధిలో కూకట్ పల్లి, శేరిలింగం పల్లి నియోజక వర్గాల్లోనూ  జనసేనకు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు నేతలు  నినాదాలు చేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి ఎవడు వాడు? అంటూ జనసేన పార్టీని ఉద్దేశించి శేరిలింగం పల్లి బిజెపి నేతలు  ఒంటికాలిపై నిలబడి  ఏకిపారేసినట్లు సమాచారం. పొత్తులో భాగంగా కొన్ని చోట్ల త్యాగాలు తప్పవని పార్టీ నాయకత్వం చెప్పినా ఆ త్యాగాలు తాము చేయలేమని వారు  ఢంకా బజాయించి మరీ చెప్పారట. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన రోజున అన్నం కూడా తినాలనిపించలేదని పవన్ కళ్యాణ్ గతంలో అన్న వ్యాఖ్యను   ప్రస్తావించిన ఓ బిజెపి నేత తెలంగాణాపై అంత ద్వేషం ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీతో అసలు మనకి పొత్తేంటి? అని విరుచుకు పడినట్లు చెబుతున్నారు.

జనసేనకు కేటాయించాలనుకున్న ప్రతీ నియోజక వర్గంలోనూ పరిస్థితి ఇలానే ఉండడంతో బిజెపి నాయకత్వానికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. మరో పక్క ఏపీలో  టిడిపితో పొత్తు పెట్టుకున్న జనసేన తెలంగాణాలో టిడిపిని వ్యతిరేకించే బిజెపితో పొత్తు పెట్టుకోవడంపై రాజకీయ వర్గాల్లో   అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాక మీద ఉన్న స్థానిక నేతలను పిలిపించి వారికి నచ్చచెప్పాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే బిజెపి-జనసేన  పార్టీల నుండి నేతలతో  సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఆలోచిస్తున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి