కొద్దిరోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. వరదలు సంభవించాయి. పల్లెలు, పట్టణాలను ముంచెత్తాయి. చెరువులు, కుంటలు ఎక్కడికక్కడె తెగిపోయాయి. వరదనీరు జనావాసాల్లోకి పోటెత్తింది.
ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అంచనాలకు మించిన స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఖమ్మం నగరాన్ని మున్నేరు వాగు ముంచివేసింది. దాదాపుగా సగానికిపైగా ఖమ్మం నగరం వరద నీటిలో మునకేసింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి.
మహబూబాబాద్ జిల్లా కూడా వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్నది. పట్టాలు కొట్టుకుపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక్కడ. నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, సూర్యాపేట, జనగామ, మంచిర్యాల్, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది అప్పట్లో.
దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాల ధాటికి అనేక చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. వేల హెక్టార్లల్లో పంట నష్టం సంభవించింది. ఈ వరదల వల్ల మొత్తం 10 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలను ప్రకటించారు. సినిమా, పరిశ్రమలు, వ్యాపారం, ఐటీ.. వంటి దాదాపు అన్ని రంగాలకు చెందిన వాళ్లు సహాయనిధికి విరాళాలను ప్రకటించారు. తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్పట్లో 20 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు రిలయన్స్ ఫౌండేషన్ అధినేత నీతా అంబానీ. ఆమె తరఫున ఇప్పుడా మొత్తంతో కూడిన చెక్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు.
కొద్దిసేపటి కిందటే బంజారాహిల్స్‌లో రేవంత్ ఇంటికి వెళ్లారు. చెక్‌ను అందజేశారు. ఆ సమయంలో వారి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొంతమంది అధికారులు ఉన్నారు. త్వరలోనే ఏపీకి ప్రకటించిన మొత్తంతో కూడిన చెక్‌ను వాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అందజేసే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…