తెలంగాణాలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన వేళ మెరికల్లాంటి ఇద్దరు ఐఏఎస్ అధికారులు అమాంతం వార్తల్లోకెక్కారు. ఇప్పటిదాకా తెలంగాణా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఓ అధికారి కేంద్ర సర్వీసులోకి వెళ్లాలని ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే.. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తోన్న మరో ఐఏఎస్ అధికారి తెలంగాణా ప్రభుత్వంలో పనిచేయాలని ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్ అధికారుల్లో ఈ ఇద్దరికీ చాలా మంచి పేరు ఉంది. నిజాయతీ పరులు..నిక్కచ్చిగా వ్యవహరిస్తారు..కష్టపడి పనిచేస్తారని ఇద్దరి గురించి చెప్పుకుంటూ ఉంటారు.
ప్రభుత్వాలు మారినపుడు కీలకమైన అధికారులు కూడా మారుతూ ఉంటారు. కొత్తగా కొలువు తీరేవారి ఆలోచనలకు అనుగుణంగా ఉండే అధికారులనే కొత్త పాలకులు తమ టీమ్ లో చేర్చుకోవాలని భావిస్తారు. ఆ క్రమంలోనే తెలంగాణాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అటూ ఇటూ మారుతున్నారు. కొన్ని వ్యవస్థల ప్రక్షాళనకు కొత్త ప్రభుత్వం నడుం బిగించింది కూడా.నిన్నటి దాకా బి.ఆర్.ఎస్. ప్రభుత్వంలో కీలక అధికారిగా బాధ్యతలు వహించిన స్మితా సబర్వాల్ కేసీయార్ హయాంలో సిఎంఓలో ముఖ్యఅధికారిగా బాధ్యతలు చేపట్టారు. . 2001 ఐ ఏ ఎస్ క్యాడర్ కు చెందిన స్మితా సబర్వాల్ ఉమ్మడి ఏపీలోనూ..విభజన అనంతరం తెలంగాణాలోనూ వివిధ శాఖల్లో పనిచేశారు.
కరీంనగర్, మెదక్ జిల్లాల కలెక్టర్ గా అద్భుతంగా పనిచేశారని పేరు తెచ్చుకున్నారు. ఆమె పనితీరు.. అంకిత భావం మెచ్చి కేసీయార్ ఆమెకు సిఎంఓలో ప్రత్యేక కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు. దాంతో పాటే నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగించారు. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు.తాజా ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొలువు తీరారు. రాష్ట్రంలో నీటిపారుదల శాఖ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి స్మితా సబర్వాల్ హాజరు కాలేదు.
ఆమె కేంద్ర సర్వీల్లో చేరాలని ఉబలాట పడుతున్నారని..కేంద్రంలోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.తాజాగా ఆమె ఒక ట్వీట్ లో తాను కొత్త సవాళ్లకు ఎప్పుడూ రెడీగా ఉంటానన్నారు. 23 ఏళ్ల కెరీర్ ను ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టిన స్మిత సబర్వాల్ తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.ఒక్క అవినీతి ఆరోపణ కానీ..వివాదం కానీ స్మితా సబర్వాల్ పై ఇంత వరకు లేవు. అంత క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారి కేంద్ర సర్వీసులోకి వెళ్లిపోవడం రాష్ట్రానికి నష్టమే అంటున్నారు నిపుణులు.
స్మిత సబర్వాల్ ఢిల్లీ వైపు చూస్తోన్న తరుణంలోనే ఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయంలో కీలక పదవిలో ఉన్న మరో ఐఏఎస్ అధికారి హైదరాబాద్ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆ ఐఏఎస్ అధికారి ఎవరో కాదు ఆమ్రపాలి. 2010 బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలి డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా సీరియస్ అవుతారు. ఎంతో నిజాయితీగా పనిచేస్తారు. గతంలో తెలంగాణాలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గానూ, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గానూ పనిచేశారు.
ఆమె నిజాయితీని మెచ్చి 2020లో ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. అలా ఆమె పి.ఎం.ఓ.లో డిప్యూటీ సెక్రటరీ అయిపోయారు. అత్యంత చిన్న వయసులో ఆ హోదా పొందిన అధికారిగా చరిత్ర సృష్టించారు. ఇద్దరూ మహిళా అధికారులే. ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు ఈ ఇద్దరినీ. మరి స్మితా సబర్వాల్ కు కేంద్రం నుంచి పిలుపు వస్తుందా? ఆమ్రపాలికి తెలంగాణా ప్రభుత్వం వెల్ కమ్ చెబుతుందా అన్నది కాలమే చెప్పాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…