అమిత్ షా టార్గెట్ ?

By KTV Telugu On 10 August, 2023
image

KTV Telugu ;-

ఆట మొదలైంది. అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ వ్యవహారాన్ని తాను స్వయంగా చూసుకుంటానని ఆయన ప్రకటించేశారు. ఎన్ని సీట్లు గెలవాలో కూడా టీబీజేపీ నేతలకు చెప్పేశారు. ఆ దిశగా నేతలు తమ ప్రయత్నాలు కొనసాగించాలని సూచించారు.

తెలంగాణలో ముక్కోణ పోటీ ఖాయమని ఎప్పుడో తేలిపోయింది. దానితో బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు వీలైతే గెలిచేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చేరికలను ప్రోత్సహించడం ద్వారా తాము బలంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నాయి. కాంగ్రెస్ కంటే బీజేపీ కాస్త ముందున్నానని చెప్పేందుకు ఎన్ని సీట్లలో గెలవాలో కూడా ఓ టార్గెట్ పెట్టుకుంది. అన్ని సీట్లలో విజయం సాధించేందుకు వ్యూహాలు కూడా అమిత్ షా స్వయంగా సిద్దం చేస్తున్నారు.
ఎన్డీయే ఎంపీలను పదకొండు టీములుగా విడగొట్టి ప్రధాని మోదీ ఒక్కో టీముతో విడివిడిగా సమావేశమవుతున్నారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏం చేయాలో ఆయన వివరిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి వ్యూహాలు రచించాలో దిశానిర్దేశం చేస్తున్నారు దక్షిణాది ఎంపీల మీటింగ్ బుధవారం జరిగింది. దక్షిణ రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోయిందని, ఉచిత పథకాలను ఎరగా వేసి గెలిచేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మోదీ నేరుగా అటాక్ చేశారు. ఇలాంటి చిల్లర పనులకు పోకుండా ప్రజల్లో మమేకమై గెలిచేందుకు ప్రయత్నించాలని ఎన్డీయే ఎంపీలను మోదీ కోరారు. ఆ వెంటనే తెలంగాణ ఎంపీలు, ముఖ్యనేతలతో కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. తెలంగాణ ఇంఛార్జ్ ఎవరైనా సరే అన్ని వ్యవహారాలను తాను కూడా చూసుకుంటానన్నట్లుగా ఆయన సంకేతాలిచ్చారు. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని సమీక్షించుకుంటానని కూడా వెల్లడించారు.

తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఒక బంపర్ ఆఫరిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న నేతలు ఎవరైనా సరే … ముందుగా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని ఆయన తేల్చేశారు. నిజానికి పోయిన సారి కూడా అలా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎంపీలుగా గెలిచారు. ఈసారి కూడా కనీసం పది పన్నెండు మంది ఎంపీ అభ్యర్థులు ముందు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ప్రచారం కార్యక్రమం మొదలు పెట్టాలని అమిత్ షా సందేశమిచ్చారు. ఎవరెవరు ఎక్కడ పోటీచేయాలో త్వరలోనే కేంద్ర కార్యాలయం నుంచి ఒక జాబితా వస్తుందని కూడా ప్రకటించారు. దాదాపు 30 మంది సభ్యులు ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో ఇప్పటికే ఖరారైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 75 గెలిచేందుకు సీనియర్ నేతలంతా నడుం బిగించాలని అదే టార్గెట్ – 75 అని అమిత్ షా చెప్పేశారు. ఆ 75 స్థానాలేమిటో కూడా త్వరలో పార్టీ నేతలు సమాచారమిస్తామని అంటున్నారు.

నేతలెవ్వరూ ఢిల్లీ రావాల్సిన అవసరం లేదని గల్లీల్లోకి వెళ్లిపనిచేయాలని అమిత్ షా కుండబద్దలు కొట్టారు. బూత్ స్థాయిలో కార్యకర్తల బలాన్ని పెంచాలని ఆదేశించారు. ఏపీ కంటే తెలంగాణలోనే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించిన బీజేపీ అధిష్టానం క్షేత్రస్తాయిలో బలోపేతమయ్యేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. తెలంగాణలో బీజేపీ సోషల్ మీడియా వీక్ గా ఉందని గ్రహించిన పార్టీ పెద్దలు.. ప్రచారానికి కొందరు సోషల్ మీడియా వారియర్స్ ను కూడా నియమించుకోవాలని ఆదేశించింది. మరి పార్టీ తెలంగాణ నేతలు ఏ మేరకు దారికి వస్తారో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి