బండి సంజయ్ ఇప్పుడు టాక్ ఆఫ్ బీజేపీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ రెండు రోజుల కార్యవర్గ సమావేశాల్లో సంజయ్ ను ప్రధాని మోదీ స్వయంగా ఆకాశానికెత్తేశారు. బీఆర్ఎస్ దాడులను సంజయ్ టీమ్ సమర్థంగా తిప్పికొడుతోందంటూ ప్రశంసించారు. బెంగాల్ బీజేపీ తర్వాత ఎక్కువ పోరాట పటిమ చూపినదీ తెలంగాణ యూనిటేనని మోదీ కితాబిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎగబడి కొడుతున్నా సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కేడర్ తట్టుకుని నిలబడి తిరగబడి పార్టీని కాపాడుకుంటున్నాయని మోదీ అన్నారు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని కూడా మోదీ గుర్తు చేశారు.
ఒక పక్క మోదీ ప్రశంసల జల్లు కురిపిస్తుంటే పార్టీలో నెంబర్ టూ గా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నెల 27, 29 తేదీల్లో రెండు రోజుల పాటు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అలాగే మంచిర్యాల బూత్ కమిటీ సభ్యులతో కూడా అమిత్ షా సమావేశమై చర్చించనున్నారు. ఈ నెల 28న కొమురం భీం జోడే ఘాట్ ను కూడా అమిత్ షా సందర్శించనున్నారు. అనంతరం ఈ నెల 29వ తేదీన ఆదిలాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదంతా పార్టీ కేడర్ ను ఉత్తేజ పరిచే చర్యగా భావిస్తున్నారు.
ఢిల్లీ నుంచి వచ్చే పార్టీ ఇంఛార్జ్ ల పనితీరుపై మోదీ, అమిత్ షా కొంత అసంతృప్తిగా ఉన్నట్లు భావిస్తున్నారు. బండి సంజయ్ ప్రదర్శిస్తున్న దూకుడుకు వారి సహకారం సరిపోవడం లేదని లెక్కలేసుకుంటున్నారు. తెలంగాణ ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారని అంటున్నారు. పైగా బీఎస్ సంతోష్ ను ఫార్మ్ హౌస్ కేసులో ఇరికించి కేసీఆర్ పైచేయి సాధించారు. దానితో ఇప్పుడు అమిత్ షా స్వయంగా తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు.
గ్రేటర్ ఎన్నికల తర్వాత హైదరాబాద్ పరిసరాల్లో బీజేపీ చాలా వరకు బలపడింది. ఇప్పుడు జిల్లాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధిష్టానం భావిస్తోంది అందుకే తాజా పర్యటనగా అమిత్ షా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నారు. అక్కడ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు పార్టీని మరింత బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నారు. బీజేపీ చేసుకున్న అంతర్గత సర్వే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ లో పార్టీ బలపడుతున్నట్లు చెబుతోంది. ఒక ఎంపీ సీటుతో పాటు కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే తెలంగాణపై అమిత్ షా దండయాత్రలో ఆదిలాబాద్ ను ఎంచుకున్నట్లు చెబుతున్నారు..
అమిత్ షా తన పర్యటనలో డైరెక్టుగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన అజెండా పాయింట్స్ రాష్ట్ర శాఖలో ఈటల రాజేందర్, రఘునందన్ రావు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు తెలంగాణలో ఆస్తులు కట్టబెడుతున్న తీరును అమిత్ షా ప్రస్తావిస్తారు. కేసీఆర్ కుటుంబ అవినీతి మరోసారి ప్రస్తావనకు వస్తుంది. తెలంగాణ మంత్రులు చేస్తున్న అరాచకాలను కూడా అమిత్ షా ఎండగడతారు. ఏదేమైనా బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫుల్ టైమ్ ఫోకస్ పెట్టిందనే చెప్పాలి.