తెలంగాణలో తెల్లవారితే ఓటర్లు పోలింగ్ బూత్‌కు వెళ్తారనగా.. ఆంధ్రప్రదేశ ప్రభుత్వ పోలీసులు ఒక్క సారిగా తెలంగాణ ప్రభుత్వ నిర్వహణలో నాగార్జున సాగర్ పై విరుచుకుపడ్డారు. దౌర్జన్యంగా ప్రాజెక్టులోకి ప్రవేశించారు. పదమూడు గేట్లు మావి అని చెప్పి బారికేడ్లు పెట్టుకున్నారు. ఉదయమే ఓ గేటు ఎత్తి నీరు విడుదల చేసుకున్నారు. తరవాత తెలంగాణ అధికారులు కరెంట్ నిలిపివేయడంతో నీటి విడుదల ఆగిపోయింది. పోలింగ్ అయిపోయింది. ఇప్పుడేం జరుగుతుంది ? అసలు ఏపీ ప్రభుత్వం చేసింది కరెక్టేనా ? రాజకీయాల కోసం ఇలా చేసి ఉంటే ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?
ఓ రాష్ట్ర నిర్వహణలో ఉన్న ప్రాజెక్టుపై మరో రాష్ట్ర పోలీసులు దాడిచేయడం అసాధారణం. అది కూడా ఎలాంటి కారణం లేకుండా. ఓ పద్దతి ప్రకారం .. మాట్లాడుకుని తమ అవసరాలు తీర్చుకోవాల్సిన చోట. ప్రతి విషయంలోనూ సైలెంట్ గా ఉండి… హఠాత్తుగా ప్రాజెక్టును ఆక్రమించుకోవాలనుకోవడం.. ఖచ్చితంగా సంచలన విషయమే. ఇదేమీ ప్రైవేటు ఆస్తిని కబ్జా చేయడం కాదు. మరి ఎందుకు ఇలా చేశారు…అంటే రాజకీయం కోసమేనని ఏ కోణంలో చూసినా అర్థమయ్యే విషయం.
తెలంగాణలో ఎన్నికలకు బందోబస్తు కోసం ఏపీ పోలీసుల్ని ఈ సారి ఎన్నికల సంఘం ఎంపిక చేసుకోలేదు. తమిళనాడు నుంచి పోలీసు బృందాలను తెచ్చుకున్నారు. దీంతో ఏపీ రిజర్వ్ పోలీసులు ఖాళీగానే ఉన్నారు. తెలంగాణ పోలింగ్ కు సిద్ధమైన సమయంలో గురువారం రోజున గుంటూరులో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఐదు వందల మంది పోలీసుల్ని ఆపరేషన్ కోసం పోలీసు ఉన్నతాధికారులు రెడీ చేశారు. వారి హడావుడి ఎందుకో ఎవరికీ తెలియదు. కాకపోతే ఏపీలో ప్రతిపక్ష నేతల్ని సోషల్ మీడియా కేసుల్లో కూడా అర్థరాత్రి అరెస్టులు చేస్తూంటారు. ఆ కోణంలోనే అర్థరాత్రి ఏ టీడీపీ నేతనో అరెస్టు చేయబోతున్నారని లేకపోతే టీడీపీ ఆఫీసుపై దాడిచేయబోతున్నారని ్నుకున్నారు. అదీ కాకపోతే సీఎం జగన్ హిట్ లిస్ట్ లో ఉన్న సంగం డెయిరీని క్లోజ్ చేయించే ప్లాన్ అమలు చేస్తున్నారని అనుకున్నారు. కానీ ఆ పోలీసులు అందర్నీ ఉన్నతాధికారులు చీకటి పడిన తరవాత నాగార్జున సాగర్ వైపు మళ్లించారు. ప్రాజెక్టు ఆక్రమణకు పాల్పడ్డారు.
తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేయాలంటే వారు అందుబాటులో ఉన్నా సరే. అర్థరాత్రి వాళ్లు నిద్రపోయిన తర్వాత గేట్లు దూకి, తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తారు. అది కోర్టులో నిలబడని కేసు.. కనీసం కోర్టు రిమాండ్ కు ఇవ్వని కేసు అయినా సరే భయపెట్టడానికి ఈ వ్యూహం అమలు చేస్తారు. సాగర్ డ్యాం పైనా అదే ప్లాన్ మలు చేశారు. అర్థరాత్రి సాగర్ డ్యాం గేట్లు దూకారు. పదమూడు గేట్లు మా వాటా అని బారికేడ్లు అడ్డం పెట్టుకున్నారు. ఉదయం ఒకటి, రెండు గేట్లు కాస్త పైకి ఎత్తి బలవంతంగా నీళ్లు వదులుకున్నారు. గేట్లు ఎత్తడానికి ఒంగోలు ఇరిగేషన్ ఇంజినీర్ ను పిలిపించారు. అయితే ఇలా గేట్లు ఎత్తగానే అలా తెలంగాణ అధికారులు కరెంట్ ఆపేశారు. దీంతో నీటి విడుదల ఆగిపోయింది. అయినా సరే తాము ప్రత్యామ్నాయ కరెంట్ ఏర్పాట్లు చేసి నీళ్లు ఇస్తామని ఏపీ అధికారులు చెప్పుకొచ్చారు కానీ సాగర్ గేట్లు ఆపరేట్ చేయడానికి అవసరమయ్యే కరెంట్ కు ప్రత్యేక వ్యవస్థ కావాలి. దాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవడం కష్టమే.
ఈ సారి కృష్ణా డెల్టాలో కరువు పరిస్థితి ఉంది. తాగునీటికి కూడా నీటి కొరత ఉంది. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ? సంబంధిత వర్గాలను అడగాలి. సాగర్ లో అడుగూబొడుగూ నీళ్లు ఉన్నాయి. తాగడానికి నీళ్లు కావాలనేది ఏపీ ప్రభుత్వ వాదన. మరి ప్రాజెక్టు నిర్వహిస్తున్న వారిని అడిగాలి లేదా నీటి పంపకాలు చేసే కృష్ణా బోర్డుకు ప్రతిపాదన పెట్టాలి. వారు స్పందిస్తారా లేదా అన్న సంగతి తర్వాత కానీ అడగడం ప్రభుత్వ విధి. రావాల్సిన నీటిని కూడా ఇవ్వకపోతే.. అప్పుడు తాము దాడి చేశామని చెబితే.. ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారేమో. కానీ ఇక్కడ ముందస్తుగా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అర్థరాత్రి పూట గోడలు దూకి ప్రాజెక్టును ఆక్రమించుకోవడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదన్నది అందరి అభిప్రాయం.ఓ ప్రభుత్వం ఇలా మరో రాష్ట్ర భూభాగంపై దండయాత్ర చేయడం వెనుక ఉన్నది అసలు రాజకీయం అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు ఓటింగ్ కు వెళ్తున్న సమయంలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్లాన్ అమలు చేశారని ఎక్కువ విమర్శలు వస్తున్నాయి.
ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం అన్ని రకాల రాజ్యాంగ నిబంధనలు అధిగమించిందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. నిపుణులూ అదే చెబుతున్నారు. ఇలాంటి దాడికి ఏపీ ఎందుకు ప్రయత్నించిందంటే.. ప్రజల దాహాన్ని తీర్చడానికి కాదని పొరుగు రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ మిత్రులకు సాయం చేయడానికని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది అందిరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా జల వివాదాలను తాము ఇట్టే పరిష్కరించకుంటామని ఢిల్లీ దగ్గరకు పోయేది లేదని సీఎం గా జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ ప్రకటించారు. బేసిన్లు , బేషజాలు ఉండవని ఆయన మార్క్ డైలాగ్ కూడా చెప్పారు. మరి ఇప్పుడేం జరిగింది ?
పోలింగ్ ముందు రోజు ప్రాజెక్టుపై దాడి చేయడం ద్వారా ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఓ రకమైన సెంటిమెంట్ ను పెంచడం ద్వారా .. ఓ పార్టీ ఓట్లకు గండికొట్టి… మరో పార్టీకి మేలు చేయాలని వ్యూహం పన్నారని అంటున్నారు. జరిగిన పరిణామాలు చూస్తే ఇది నిజమని అంగీకరించక తప్పదు. అసలు అడ్డగోలుగా గేట్లు ఎత్తేసుకుని రుబాబు చేసుకునేదానికి కృష్ణాబోర్డులు.. ఇతర వ్యవస్థలు.. ఎందుకు ? కోర్టులు ఎందుకు ?. అసలు ఓ ప్రభుత్వం ఇలా చేయడం ఏమిటన్నది అందరికీ వచ్చే డౌట్. ఏపీ ప్రభుత్వం నీటి వాటా కోసం అద్భుతంగా ఏమైనా పోరాడుతోందా అంటే.. కృష్ణా జలాల కేటాయింపులపై రివ్యూ చేయాలని కేంద్రం నిర్ణయిస్తే.. కిక్కురమనలేదు. ఒక్క మాట మాట్లాడటం లేదు. లేఖ రాయలేదు. సాగర్ పై కి ఏపీ పోలీసులు చేసిన దండయాత్ర .. ఏపీ రాష్ట్రానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. రాజకీయ మిత్రుల స్నేహం కోసం .. ప్రభుత్వాలకు ఉండాల్సిన కనీస నైతిక విలువలు కూడా పాటించకుండా పొరుగు రాష్ట్ర నిర్వహణలో ఉన్న ప్రాజెక్టుపై దాడిచేయడం.. బలవంతంగా గేట్లు ఎత్తివేయడం క్రిమినల్ చర్య అవుతుంది. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి కో.. మరొకరికో చేటు చేయదు. రాష్ట్రానికి చేస్తుందన్న వాదన వినిపిస్తోంది.
ఈ ఘటన ఖచ్చితంగా ఏపీ ఇమేజ్ పై ఘోరమైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. రాజకీయం కోసం రాష్ట్రాన్ని ఏమైనా చేయగల నేర్పు ఉన్న నేతలు నేడు కీలక పొజిషన్లలో ఉన్నారని అడ్డగోలు పనులు చేయడానికి వెనుకాడని అధికారుల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్న వాదన వినిపిస్దోంది. రాజకీయంతో ప్రజలకు మేలు చేయాలి కానీ… కుట్రలు చేసి రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టకూడదు., అలా పెడితే అది రాజకీయం కాదు.. రాక్షసత్వం అవుతుంది. దురదృష్టవశాత్తూ సాగర్ డ్యాంపై అదే జరిగింది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…