రాజకీయాల్లో ప్రత్యర్థి కంటే రెండాకులు ఎక్కువ తిన్నవాడే మనుగడ సాగిస్తాడు. ఎత్తులకు పైఎత్తులు వేసిన వాడే ముందుకు వెళతాడు.మిగతా వాళ్లు వెనుకబడి పోవడం ఖాయం. అందుకే అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలు ఏదోక కార్యక్రమంలో బిజీగా ఉంటాయి. ప్రత్యర్థులను ఒత్తిడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ అదే పనిలో ఉన్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన ఒక ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. త్వరలో తాను రాష్ట్రమంతా పాదయాత్ర చేసి.. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడతానని కేటీఆర్ ప్రకటించారు.ఏడాది పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తామని, కాంగ్రెస్ వైఫల్యాలను గ్రామగ్రామానికి తీసుకు వెళ్తామని ఆయన అన్నారు. పారలల్ గా తాను కూడా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కూడా చెబుతున్నారు. దానితో నీరసంగా పడున్న పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. పార్టీ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలకు తెరతీసింది..
పాదయాత్రపై చర్చ ఒక వైపు కొనసాగుతుండగానే బీఆర్ఎస్ ను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ కొత్త అస్త్రాన్ని బయటకు తీస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ దిశగా ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు. దీపావళికి పొలిటికల్ బాంబులు కూడా పేలతాయని ఆయన అన్నారు. సీయోల్ పర్యటన సందర్భంగా పొంగులేటి చేసిన ప్రకటనతో ఒక్క సారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ రాత్రికి ఏమైనా జరగొచ్చని కేటీఆర్ ఒక రోజు ట్వీట్ చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతవరకు ఏమీ జరగకపోయినా.. బీఆర్ఎస్ అగ్రనేతలను అరెస్టు చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ దిశగా కొంత గ్రౌండ్ వర్క్ కూడా ఊపందుకున్నట్లు చెబుతున్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ఎగ్గొట్టిందని విస్తృత ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దానికి కౌంటర్ గా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న విద్యుత్ అవకతవకలపై సమగ్రంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ ప్రభుత్వానికి ఇటీవల ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యల దిశగా అడుగులు వేయబోతోంది. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రభుత్వం నియమించిన కమీషన్ దాదాపుగా విచారణ పూర్తి చేసింది. జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా మరో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. కాళేశ్వరం అవకతవకలపై మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ – రేస్ నిర్వహణలో కేటీఆర్, మున్సిపల్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో ఏదోక కేసులో కేటీఆర్ ను అరెస్టు చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతున్న టాక్. అయితే ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో మీడియాలో కొంత ప్రచారం నిర్వహించిన తర్వాతే అరెస్టుల పర్వానికి తెరతీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. లేనిపక్షంలో బీఆర్ఎస్ కు సింపథీ పెరుగుతుందని రేవంత్ ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ ఏడాది ఆఖరుకు లేదా వచ్చే ఏడాది మొదట్లో అరెస్టులు ఉంటాయని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో అరెస్టు కంటే ముందు పాదయాత్ర మొదలవుతుందా అన్నది చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…