బినామీల సునామీలో కవిత కష్టాలు

By KTV Telugu On 8 March, 2023
image

మద్యం కుంభకోణంలో కవిత కూడా పాత్రధారేనని ఢిల్లీ బీజేపీ ఆరోపించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా కేసుపై ఆసక్తి పెరిగిపోయింది. తొలి అరెస్టు జరిగినప్పటి నుంచి రేపే మాపో కేసీఆర్ తనయ తిహార్ జైలుకు వెళ్లడం ఖాయమన్న వాదనా బలపుడుతూనే ఉంది. తాజాగా వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అరెస్టు చేసిన తర్వాత తదుపరి టార్గెట్ కవితేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈడీ, సీబీఐ దూకుడును చూస్తే ఆ ఆనుమానాలు నిజం కాక మానవు అని విశ్వాసం కలుగుతోంది. సీబీఐ ఈడీ పోటీపడి ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నాయి. వందకోట్ల స్కాం అని చెబుతున్నప్పటికీ లెక్కలు చూస్తే అంతకు మించే చేతులు మారి ఉంటాయని కేసు ఒక కొలిక్కి వస్తేనే స్కాం స్వరూపం బయట పడుతుందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన తర్వాత కవితను మాత్రం ఎందుకు వదిలిపెడతారన్న చర్చ ఊపందుకుంది.

స్కాంలో కవిత పేరును బీజేపీ ప్రస్తావించినప్పటి నుంచి కథ మొత్తం అరుణ్ రామచంద్ర పిళ్లై చుట్టూ తిరుగుతోంది. మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాఘవ రెడ్డి ఎమ్మెల్సీ కవిత అరబిందో శరత్‌చంద్రారెడ్డిలతో కూడిన సౌత్‌ గ్రూప్‌ ద్వారా 100 కోట్ల ముడుపులను ఆప్‌ నేతల తరఫున విజయ్‌నాయర్‌ స్వీకరించారనేది ఈడీ ప్రధాన అభియోగం. ఈ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహించిన వారిలో అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఒకరని ఈడీ ఆధారాలతో సహా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఇప్పటికే సమర్పించింది. సౌత్‌ గ్రూప్‌ భాగస్వాములు ఆప్‌ నేతలతో కలిసి కుట్రకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈడీ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ అరుణ్ రామచంద్ర పిళ్లై మద్యం తయారీ కంపెనీ ఇండోస్పిరిట్స్ సంస్థకు అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. ఈ కంపెనీలో 32.5 శాతం షేర్ పిళ్లైదే కావడం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త మనీ లాండరింగ్‌కు పాల్పడి ప్రజాప్రతినిధులకు ఢిల్లీలో లిక్కర్ లైసెన్సుల విషయంలో అక్రమ మార్గంలో మేలు చేశాడనేది ప్రధాన అభియోగం. సీబీఐ చెబుతున్న దాని ప్రకారం ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ‘ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22’ని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో కూడా పిళ్లై కీలక పాత్ర పోషించారు.

ఢిల్లీ స్కాంలో కవిత పాత్ర ఏమిటి కవితకు వచ్చిన కష్టమేంటి అరుణ్ రామచంద్ర పిళ్లైను అరెస్టు చేస్తే ఆమెకు ఇబ్బంది ఏమిటి ఇలాంటి ప్రశ్నలకు స్థూలమైన సమాధానం కవితకు తాను బినామీనని పిళ్లై అంగీకరించడమే అవుతుంది. దేశ రాజధాని రాష్ట్రంలో మద్యం పాలసీ రూపకల్పనకు తానే కీలక పాత్ర పోషించానని కూడా పిళ్లై ఈడీ అధికారుల ముందు అంగీకరించారు. బడా మద్యం వ్యాపారులకు ఉపయోగపడే విధంగా కొత్త మద్యం పాలసీని రూపొందించారు. దీనితో చిన్న కాంట్రాక్టర్ల దుకాణాలు మూతబడ్డాయి. పైగా కొత్త పాలసీలో కమిషన్ మొత్తం కాంట్రాక్టర్లకు వెళ్లిపోయింది. ప్రతీ మద్యం సీసాలో ప్రభుత్వ ఆదాయం 330 రూపాయల నుంచి నాలుగు రూపాయల కంటే తక్కువకు దిగిపోయింది. దీనితో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. పైగా మందుబాబుల జేబులు కూడా ఖాళీ అయ్యే పరిస్తితి వచ్చింది. సగటున ఫుల్ బాటిల్ ధర 30 నుంచి 60 రూపాయల వరకు పెరిగింది.

ఇదంతా అరుణ్ పిళ్లై సూచనల మేరకు సిసోడియా ఆదేశాల ప్రకారం రూపొందించిన పాలసీగా సీబీఐ, ఈడీ నిర్దారణకు వచ్చాయి. లైసెన్స్ ఫీజును పెంచకుండా లైసెన్స్ హోల్డర్‌ల ప్రయోజనం కోసం వారి కార్యాచరణ పదవీకాలం మొదట ఏప్రిల్ 1 2022 నుండి మే 31 2022 వరకు తరువాత జూన్ 1 2022 నుండి జూలై 31 2022 వరకు పొడిగించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఎలాంటి ఆమోదం తీసుకోలేదు. తర్వాత జులై 14న హడావుడిగా కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి అనేక అక్రమ నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించే పనిలో పడ్డారు. మద్యం విక్రయాలు పెరిగినప్పటికీ ఆదాయం పెరగడానికి బదులు 37.51% తక్కువ ఆదాయం వచ్చింది. ఈ కారణంగానే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నమోదై అరెస్టుల పర్వం ప్రారంభం అయింది.

నిజానికి కవిత విషయంలో సీబీఐ, ఈడీ చేయాల్సిన పని చాలానే ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఒక్క రోజులో రూపొందించినది కాదనేది అందరూ అంగీకరిస్తున్న అంశం. ఎన్నో రోజుల చర్చల తర్వాతే సమగ్రమైన విధానాన్ని తయారు చేసి వందల కోట్ల స్కాంకు తెరతీశారు. దీని కోసం కవిత ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ లో ఆరు నెలల పాటు రూమ్ బుక్ చేశారని బీజేపీ గతేడాది ఆరోపించింది. అయితే పాలసీ రూపకల్పన విషయంలో అరుణ్ పిళ్లై స్వయంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నారా లేక ఎప్పటికప్పుడు విషయం కవితకు చెబుతూ ఆమె సలహాలను పాటించారా అన్నది రెండు దర్యాప్తు సంస్థలు ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు సరైన లింక్ దొరకని కారణంగానే కవితను అరెస్టు చేయలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సిసోడియా రాఘవరెడ్డి విషయంలో తగిన ఆధారాలు దొరికాయని కూడా చెబుతున్నారు. ఆ సంగతి తెలిసే వాళ్లు బీజేపీపై ఎదురుదాడి చేశారు. ఇప్పుడు కవిత కూడా ఎదురుదాడి చేస్తున్నారు.

ఇప్పుడు కాకపోయినా నాలుగు రోజుల తర్వాతైనా కవిత దర్యాప్తు సంస్థల ముందు హాజరు కావాల్సిందే. సిసోడియానే అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థలకు కవితను తిహార్ కు పంపడం కష్టమేమీ కాదు. అటు ఇటుగా కొన్ని రోజుల తర్వాత బెయిల్ రావడం కూడా సహజ పరిణామమే. కాకపోతే కవిత అరెస్టు ఎవరికి రాజకీయ ప్రయోజనమన్నది పెద్ద ప్రశ్న. బీఆర్ఎస్ ఏ విధంగా దాన్ని తమ ప్రయోజనానికి ఉపయోగించుకుంటుందో చూడాలి. ఇప్పటికే మహిళా దినోత్సవం రోజున మహిళకు నోటీసులిచ్చారన్న ఆరోపణలు అప్పుడే తెరమీదకు వచ్చాయి.