ఖమ్మం లో తుమ్మల.. పొంగులేటి విందు రాజకీయం

By KTV Telugu On 2 January, 2023
image

తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. విందు రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవితవ్యంపై కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. ఖమ్మం రూరల్ లో తుమ్మల విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన అభిమానులు, కార్యకర్తల ఆత్మీయ కలయిక పేరుతో ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నాయకులు భారీగా తరలివచ్చారు. తామంతా తుమ్మల వెంటే ఉంటామని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సేవలపై 10వేల పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. పాలేరు నుంచి మళ్లీ పోటీచేయాలని ఆయన అభిమానులు వత్తిడి చేస్తున్నారు. అయితే బిఆరెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీచేస్తానని ప్రకటించారు.

మరో వైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన కార్యకర్తల కోసం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మీ అందరి మనసులో ఏముందో తనకు తెలుసని అందరూ కాస్తంత ఓపిక పట్టాలని పొంగులేటి తన అనుచరులతో అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయడం ఖాయం అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తనతోపాటు తన అనుచరులు కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో బిఆరెస్ ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పక్కనపెట్టి నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు కేసీఆర్. ఆ ఎన్నికల్లో నామా ఘనవిజయం సాధించారు. అప్పటి నుంచి పొంగులేటికి సరైన ప్రాతినిధ్యం దక్కడంలేదంటూ ఆయన అనుచరులు కినుక వహించారు. పొంగులేటి పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడాయన రానున్న ఎన్నికల్లో తాను పోటీచేస్తానని ప్రకటించడంతో ఇక్కడి రాజకీయం వేడెక్కింది. ఇంతకూ పొంగులేటి ఏ పార్టీ నుంచి పోటీ చేశారనేది స్పష్టత లేదు.