జుట్టున్నమ్మ ఎలా ముడిచినా అందమే అంటారు. జుట్టు లేనమ్మ పోనీ టెయిల్‌తో సరిపెట్టుకుంటుంది. మరి నెత్తి మీద జుట్టులేని బట్టతల అంకుల్స్ సంగతేంటి ? ఇదే ప్రశ్న అడుగుతోంది బట్టతల బాధితుల సంఘం. తమ హక్కుల కోసం ఉద్యమించడానికి సిద్ధమవుతోంది. ఈ సంఘానికి సంబంధించిన ఒక పేపర్ క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వారి డిమాండ్లు చూసి జనం కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే సిద్దిపేట జిల్లా కోహెడ మండలంకు చెందిన కొంతమంది బట్టతల యువకులు తంగళ్లపల్లి గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ గుడిలో సమావేశమయ్యారు. తమ సమస్యల మీద చర్చించుకున్నారు. బట్టతల బాధితుల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. తమ సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బట్టతల బాధితుల సంఘానికి మొట్టమొదటి అధ్యక్షులుగా వెల్ది బాలయ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రధాన కార్యదర్శిగా రాజేశం, కోశాధికారిగా మౌటం రాము ఎన్నికయ్యారు. దివ్యాంగులకు ఒంటరి మహిళలకు వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నట్లుగా తమకు కూడా పెన్షన్ ఇవ్వాలని ఈ బట్టతల బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమలాగా నెత్తి మీద వెంట్రుకలు లేనివారికి నెలకు 6000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. బట్టతల బాధితుల సంఘం అధ్యక్షుడు వెల్ది బాలయ్య మాట్లాడుతూ ఈ సమాజంలో బట్టతల బాధితులు చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారని తమను కూడా మానసిక వికలాంగుల క్రింద పరిగణించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. బాధితులందరికీ సంక్రాంతి పండుగ లోపు ఆరు వేల రూపాయల పెన్షన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో బట్టతల బాధితుల జిల్లా సంఘం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. అలాగే ప్రగతి భవన్‌ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. పీత కష్టాలు పీతవి అని ఊరకే అన్లేదు.