ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా కవితమ్మా

By KTV Telugu On 4 March, 2023
image

ఉన్నట్లుండి మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు గురించి మార్చి 10న న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేస్తానని మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్‌పై పోరాడడం ఆహ్వానించదగిన అంశమే అయినా హఠాత్తుగా ఈ బిల్లుపై ఢిల్లీలో దీక్ష చేయాలనే ఆలోచన కవితకు ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. కొంతకాలంగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు వినిపిస్తోంది. ఇటీవలే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేసింది. త్వరలో కవితను కూడా అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో చట్టసభల్లో మహిళల రిజర్వేషన్‌ బిల్లుపై దీక్ష చేస్తానని కవిత ప్రకటించడం రాజకీయమే తప్ప ఇంకేమీ లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం గురించి కవితకు నిజంగా చిత్తశుద్ది ఉంటే బీఆర్‌ఎస్‌లో మహిళలకు ఎంతటి ప్రాతినిధ్యం ఉందో చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

2014లో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఎన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్‌ పట్టించుకోలేదు. మహిళా మంత్రి లేకుండానే అయిదేళ్లు గడిచిపోయింది. మరి ఆనాడు తమరు ఎందుకు మాట్లాడలేదు అని నిలదీస్తున్నారు. అదంతా పోనీ ఈ ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలలో తమ పార్టీ తరఫున 33 శాతం మంది మహిళలకు టికెట్లు ఇస్తారా ఇవ్వాలని తండ్రిని ఒప్పిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కవితపై దీక్షపై ప్రశ్నల వర్షం కురిపించారు. మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో కేసీఆర్ను అడగాలని కవితకు సూచించారు. అలాగే తొలి కేబినెట్లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో కేసీఆర్ను చెప్పమని సూచించారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నోరెందుకు విప్పడం లేదో కేసీఆర్ను కవిత ప్రశ్నించాలన్నారు. మహిళా గవర్నర్ను ఎందుకు అవమానిస్తున్నాడో సమాధానం చెప్పమని కేసీఆర్ను అడుగు అని కోరారు.

మహిళలకు రాజకీయ ప్రాధాన్యత గురించి దీక్ష తలపెట్టిన కవిత ముందుగా తాను తీసుకురావాల్సిన మార్పును ఇంటి నుంచే మొదలు పెట్టాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్‌ సెటైర్‌ వేశారు. తెలంగాణ క్యాబినెట్‌ లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని మీ తండ్రి ని అడగాలని సూచించారు. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత వైఎస్‌ షర్మిల కూడా ట్విట్టర్‌లో కవితపై విరుచుకుపడ్డారు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ చేసిన కవిత ఆ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డూరం అన్నారు. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్టుందని చురకలు అంటించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మహిళలకు 33% సీట్లు ఎందుకు కేటాయించలేదు అని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో రెండు సీట్లు ఇచ్చారు అంటే 11.76% ఇదేనా మహిళలపై మీకున్న ప్రేమ అని నిలదీశారు. తెలంగాణ తొలి క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదు. ఇప్పుడున్న క్యాబినెట్ లో పట్టుమని ఇద్దరు మంత్రులు. ఇదేనా మహిళలపై మీకున్న మక్కువ అని ప్రశ్నించారు. మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు ప్రగతిభవన్ ముందు ఫామ్ హౌజ్ ముందు అని సూచించారు. ఈ ప్రశ్నలకు కవిత వద్ద సమాధానం లేదు. అయినా ఆమె ఢిల్లీలో దీక్షకు సిద్ధమవుతున్నారు.