బండి సంజయ్‌కు బీజేపీ అధిష్టానం బ్రేక్

By KTV Telugu On 27 December, 2022
image

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కూడా దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో ఉంది. అందుకోసం పార్టీని అన్నివిధాలుగా సమాయత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇటీవలే ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే ఆరో విడత పాదయాత్రను కొనసాగించాలని భావించారు. అయితే దానికి పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని తెలుస్తోంది. బండి సంజయ్ పాదయాత్రకు ప్రజా స్పందన బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ యాత్రలకు బ్రేక్ ఇచ్చి తాము చెప్పిన పనులు ముందు పూర్తిచేయాలని పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దాంతో సంక్రాంతి లోపు ఆరో విడత పాదయాత్రను పూర్తి చేయాలని అనుకున్నారు. ఆ తరువాత బస్సు యాత్ర ప్రారంభించాలని భావించారు.

అయితే అధిష్టానం బండి సంజయ్ పాదయాత్ర కు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. పాదయాత్ర లో వచ్చిన జనాన్ని చూసి ఓట్లు పడతాయని భావించకుండా క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని భావిస్తున్న బిజెపి అధిష్టానం ఇప్పటినుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టాలని బండి సంజయ్‌కు సూచించింది. జనవరి మొదటి వారంలోగా మండలాల వారీగా బూత్ కమిటీల సమావేశాలు పూర్తి చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కూడా ఆయనకు స్పష్టం చేసింది.
జనవరి 7వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల లో బూత్ కమిటీల తో అసెంబ్లీ సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దీని కోసం ఇప్పటి నుంచే బూత్ కమిటీల సమావేశాలకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. బూత్ కమిటీలతో నిర్వహించే అసెంబ్లీ సదస్సులలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ గా ప్రసంగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా డిసెంబర్ 28, 29, 30 తేదీలలో దక్షిణాది రాష్ట్రాల పూర్తి సమయ కార్యకర్తల సమావేశం, తెలంగాణ అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశం హైదరాబాద్‌లో జరగబోతోంది. ఆ తరువాత బండి సంజయ్ అసెంబ్లీ ల వారీగా పర్యటించాలని రోజూ మూడు అసెంబ్లీల చొప్పున సంస్థాగత అంశాలపై సమీక్ష చేయాలని బూత్ కమిటీలను నేరుగా కలిసి మాట్లాడాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఉన్నందున బండి సంజయ్ పాదయాత్ర దాదాపు ఒక నెల రోజుల పాటు నిర్వహించే అవకాశం లేదని భావిస్తున్నారు.