సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి

By KTV Telugu On 2 November, 2022
image

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయం ఉన్నందున బీజేపీపై సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తన పదవికి రాజీనామా చేశారంటూ ఓ లేఖ వైరల్‌గా మారింది.
తన రాజీనామాపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బండి సంజయ్‌ ఖండించారు. దొంగ పాస్‌పోర్టులు తయారుచేసేవాడికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం పెద్ద కష్ఠం కాదని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసి, దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని తెలిసినప్పుడు కూడా కేసీఆర్‌ తమపై ఇట్లాంటి ఫేక్ లేటర్స్‌ను సృష్టించారని బండి సంజయ్ విమర్శించారు. ఈ ఫోర్జరీ లేఖపై పోలీసులకు, ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సర్వే చేయించినట్లు ఒక సర్వే రిపోర్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వారి సర్వేలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవబోతున్నారని, రెండవ స్థానంలో బీజేపీ, మూడవ స్తానంలో కాంగ్రెస్‌ నిలుస్తాయని తేలినట్లు ఆ రిపోర్టులో ఉంది. అయితే ఇది కూడా ఫేకే అని స్పష్టమైంది. తాము ఎలాంటి సర్వే చేయించలేదని, ఆర్‌ఎస్‌ఎస్‌ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ స్వయం సేవక్‌ సంఘ్‌ శాఖ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.