తెలంగాణ లో అధికారంలోకి రావడం కోసం బీజేపీ పగడ్బందీ వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన కుమారుడు చేసిన ఘనకార్యం కారణంగా ఇరకాటంలో పడిపోయారు. ఆయన కుమారుడు బండి భగీరథ్ తోటి విద్యార్థులపై దౌర్జన్యం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్పల్లిలోని మహేంద్ర వర్సిటీలో బీటెక్ చదువుతున్న భగీరథ్ తోటి విద్యార్థిని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరిస్తూ తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం వర్సిటీ కి చెందిన స్టూడెంట్ అపెక్స్ కోఆర్డినేటర్ దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే భగీరథ్ చేతిలో దాడికి గురైన స్టూడెంట్ ఒక వీడియో విడుదల చేశాడు. అందులో భగీరథ్ స్నేహితుడి చెల్లిని తాను ఇబ్బంది పెట్టినందుకే తనపై అతను చేయి చేసుకున్నాడని ఇప్పుడు తామంతా కలిసిపోయామని చెప్పాడు. తన కుమారుడిపై కేసు నమోదు చేయడంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీకు దమ్ముంటే నువ్వు మొగోడివి అయితే నాతో రాజకీయం చేయాలి. నాతో రాజకీయ చేయడం చేతకాక నా కొడుకును లాగుతావా అని కేసీఆర్పై మండిపడ్డారు. చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగకూడదనే సోయి లేదా ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి నా కొడుకుపై కేసు పెట్టిస్తావా. పిల్లలు పిల్లలు కొట్టుకుంటారు మళ్లీ కలుస్తారు. నీకేం నొచ్చింది కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కొడుకును నేనే పోలీస్టేషన్లో సరెండర్ చేస్తా. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తావా లాఠీలతో కొట్టిస్తావా చూద్దాం అన్నారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ కుమారుడు మరో విద్యార్థి మీద దాడి చేస్తున్న మరొక వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ గదిలో భగీరథ్ నథఖ బండి సంజయ్ కుమారుడు సహా పలువురు విద్యార్థులు తోటి విద్యార్థిని కొడుతున్నట్టు అందులో ఉంది. పక్కవాళ్లను వద్దని చెప్పి వారిస్తూనే బండి సంజయ్ బాధితుడిపై దాడి చేస్తున్నట్టు ఈ వీడియోలో ఉంది.