బండి స్పీడ్‌కి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. రాజకీయంగా కాదు కొడుకుమీద వచ్చిన అభియోగాలతో మొదటిసారి ఆత్మరక్షణలో పడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకుంటే సరిపోదు. కుటుంబంలో ఎవరు తేడా పనిచేసినా ఆ బద్నాం నాయకుడికే. యూపీలో కొడుకు రైతులను వాహనంతో తొక్కిస్తే ఇప్పటికీ ఆ నిందను భరిస్తున్నారు ఆ పుత్రరత్నాన్ని కన్న కేంద్రమంత్రి. దేశవ్యాప్తంగా ఇలా ‘సన్’స్ట్రోక్‌తో దెబ్బతిన్న నేతలు చాలామందున్నారు. ఇప్పుడు బండి సంజయ్ వంతువచ్చింది. పిల్లలన్నాక కొట్టుకుంటారు కలుసుకుంటారని బండి సంజయ్ భాష్యంచెబుతున్నా అదేం చిన్నపిల్లల కొట్లాట కాదు ఒక్కడ్ని చేసి దాదాగిరీ.
టెక్ మహీంద్రాయూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టారు. కొట్టింది బండి సంజయ్ వారసుడు బండి సాయి భగీరథ్. ఆవేశంలో ఒక దెబ్బకొట్టడం వేరు. ర్యాగింగ్ చేస్తూ దారుణంగా తిడుతూ ఇష్టమొచ్చినట్లు దాడిచేశాడు భగీరథ్. పక్కనే ఉన్న అతని స్నేహితుడు కూడా దాడికి తెగబడ్డాడు. ఎవరికన్నా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మంత్రికి చెప్పుకున్నా తననేమీ చేయలేరని రంకెలేశాడు. రెచ్చిపోయి వ్యక్తిగతదాడికి దిగుతున్న బండి సంజయ్ కొడుకు దొరికితే సర్కారు ఊరుకుంటుందా. కేసులు పెట్టింది. దీంతో పోలీసుల ఎదుట హాజరైన భగీరథ్‌కు స్టేషన్ బెయిల్ వచ్చింది. లాయర్ సమక్షంలోనే విచారించిన పోలీసులు మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు.
బండి సంజయ్ ఇరుకునపడటంతో బాధిత విద్యార్థి మాటమార్చాడు. తనపై చేయిచేసుకున్న భగీరథ్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ సోషల్‌మీడియాలో వివరణ ఇచ్చాడు. తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని పాత వీడియోని ఎందుకు వైరల్ చేశారో తెలీదని అంటున్నాడు బాధితుడు. పాతదైనంత మాత్రాన తప్పు తప్పుకాకుండా పోదు. కానీ బాధితుడే ఏమీ లేదనటంతో కేసు నిలబడుతుందో లేదో చెప్పలేం. భగీరథ్ ఇలా దురుసుగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఢిల్లీలో చదువుకుంటున్న సమయంలోనూ అతను ఇలాగే దురుసుగా ప్రవర్తించాడని చెబుతున్నారు. దీంతో కాలేజీ యాజమాన్యం అతన్ని బయటికి పంపించేసింది. ఇప్పుడు మహీంద్రా యూనివర్సిటీలో తనకు అడ్డులేదన్నట్లు రెచ్చిపోయాడు బండి సంజయ్ వారసుడు.
కొడుకు చేసింది తప్పేనని చెప్పాల్సిన బండి సంజయ్ దీన్ని కక్షసాధింపు చర్యగా ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దంటున్నారు. దెబ్బలు తిన్న విద్యార్ధి ఫిర్యాదు చేశాడా, వేధింపులకు గురైన విద్యార్థిని ఫిర్యాదు చేసిందా అంటూ లాజిక్ మాట్లాడుతున్నారు. ఆయన భాషలో చదువుకునే పిల్లలు కొట్టుకుంటారు ఆ తర్వాత కలిసిపోతుంటారు. ఇందులో కేసీఆర్‌కు వచ్చిన నొప్పేంటని బండి ప్రశ్నిస్తున్నారు. అంటే మర్డర్లూ రేప్‌లూ కూడా చేసేసి రాజీపడొచ్చని చెప్పదల్చుకున్నారా. నా కొడుకు జీవితం నాశనం చేశావ్ ఈ పాపం ఊరికేపోదని సంజయ్ శాపనార్థాలు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబాన్ని ఏకిపారేస్తున్న బండి సంజయ్‌కి తన కొడుకు గురించి వివరణ ఇచ్చుకోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. తొందరపడ్డాడనో బాధిత విద్యార్థిని క్షమించమనో అడిగితే అది వేరే విషయం. కానీ కొట్టడమే తప్పుకాదన్నట్లు మాట్లాడితే తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరన్న విషయం గుర్తుచేయాల్సి ఉంటుంది.