తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఫలితాల తర్వాత పార్టీల వ్యూహాలు ఏమిటి. బీఆర్ఎస్ పని అయిపోయిందని భావిస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య సమరం ఎలా ఉండబోతోంది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ తీరు ఏమిటి..ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. బీజేపీతో డైరెక్ట్ ఫైట్ కు దిగే ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నే అవుతుంది…..
పదహారణాల ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయిన తర్వాత రాజకీయాలే మారిపోయాయి. కక్షసాధింపుతో సమయం వృథా చేసుకోకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అందుకోసం ఎవరితోనైనా కొట్లాడేందుకు సిద్ధమయ్యారు. కొట్టాడుతున్నారు కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొద్ది కాలంలోనే లోక్ సభ ఎన్నికలు రావడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు వస్తాయో అంచనాకు అందకపోవడంతో ఇప్పుడు ఆ దిశగా కూడా చర్చ జరుగుతోంది. ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఖరి, రేవంత్ రెడ్డి తీరు ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమవుతోంది. కేంద్రంలో అధికారానికి వచ్చే కూటమిని బట్టి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అంత వరకు వేచి చూస్తూ.. వ్యూహాలను పదునుపెడుతున్నారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు….
రేవంత్ రెండు మూడు రకాలుగా ఆలోచిస్తున్నారట. ఇండియా కూటమి వస్తే ఎలా ఉంటుందీ, ఎన్డీయే గెలిస్తే తమ ముందున్న ప్రాథమ్యాలేమిటని ఆయన లెక్కలేసుకుంటున్నారట. ఏది జరిగినా ప్రజా సంక్షేమం కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతాయని కూడా చెప్పుకుంటున్నారట…
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి స్వర్ణయుగమేనని, ఆర్థిక సహకారం అందుతుందని, అభివృద్ధి పనులకు క్లియరెన్స్ వస్తుందని, ఏకకాలంలో బీజేపీ, బీఆర్ఎస్‌లకు రాష్ట్రంలో రాజకీయంగా సమాధి తప్పదన్నది కాంగ్రెస్ ధీమాగా ఉంది. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారం అందుతుందని, ఐదేండ్ల కాలంలో ఊహించని ఫలాలు అందుకునే వీలు ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. 2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో యూపీఏ ఉన్నప్పుడు తమకు అంతా మంచే జరిగిందని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకుంటున్నారు.పైగా కేంద్రంలో ఈసారి ఇండియా కూటమి ప్రభుత్వం ఖాయమని, జూన్ 9వ తేదీన రామ్‌లీలా మైదానంలో రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెబుతూ వస్తున్నారు.మరో పక్క కేంద్రంలో ఎన్డీయే వస్తే తమకు చిక్కులు తప్పవన్న వాదనను రేవంత్ రెడ్డి అనుచరుల వద్ద తోసిపుచ్చుతున్నట్లు సమాచారం. ఎవరికీ భయపడేది లేదని ఆయన తెగేసి చెబుతున్నారు. పబ్లిక్‌లోని జనరల్ టాక్‌కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి 9 నుంచి 13 లోక్ సభా స్థానాల మధ్య రావచ్చని అంచనా వేసుకుంటూ.. అప్పుడు తమను టచ్ చేసేందుకు మోదీ భయపడతారని విశ్వసిస్తున్నారు..ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే సమాజం ఊరుకోదని హెచ్చరిస్తున్నారు.అలాగే బీజేపీ లీడర్లను ఉక్కిరిబిక్కిరి చేసేలా వారి ఎత్తుగడలను చిత్తు చేసి డిఫెన్సులో పడేసేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రానికి సహకారం ఆశించిన స్థాయిలో ఉండకపోగా తరచూ ఇబ్బందికర పరిస్థితులను సృష్టించవచ్చనే అనుమానాలను తోసిపుచ్చుతున్నారు. రాజ్యాంగ పరంగా, చట్ట పరంగా వాటిని ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు…
ఎదురుదాడే కరెక్టు నిర్ణయమని కాంగ్రెస్ వాదనగా ఉంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా హస్తం పార్టీ నేతలు అదే పని చేయబోతున్నారు. ఇప్పుడు చేస్తున్న పని కూడా అదే కదా మరి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…