ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలకు ఎర కేసు. కేసీఆర్ అంత హడావుడి చేస్త చివరికి కొండని తవ్వి చిట్టెలుకని పట్టినట్లయింది. ఎలాగైనా బీజేపీ ముఖ్యులను ఇరికిద్దామనుకుంటే కోర్టు తీర్పుతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఆపరేషన్ మొయినాబాద్ ఫాంహౌస్ కేసు స్టేట్ చేతుల్లోని సిట్ నుంచి సెంటర్ పర్యవేక్షణలోని సీబీఐకి వెళ్లిపోయింది. ఇక అప్పట్నించీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబాన్నీ బీజేపీ ఓ ఆటాడుకుంటోంది. ఎద్దేవాచేస్తోంది. దీంతో ఈ ఫైటింగ్లో ఎక్కడా తగ్గకూడదన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు. కిందపడ్డా ఓటమిని ఒప్పుకోకూడదనుకుంటున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును హైకోర్టు సింగిల్‌బెంచ్ సీబీఐకి అప్పగించడాన్ని న్యాయపరంగా సవాలు చేస్తోంది కేసీఆర్ సర్కారు. దీనిపై అప్పీల్‌కు వెళ్లింది. దీంతో కేసు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు వెళ్లే అవకాశం ఉంది. అయితే అప్పీల్లో తీర్పు ఎలా ఉంటుందో ఊహించలేం. సీబీఐకి అప్పగించడాన్ని సమర్ధించవచ్చు తప్పుపట్టొచ్చు. కానీ ఈ కేసు తన చేజారిపోవడాన్ని కేసీఆర్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టినా కీలకమైన కేసును కేంద్ర దర్యాప్తుసంస్థకు అప్పగించడంతో ప్రభుత్వం కూడా సవాలుగా తీసుకుంది. అవసరమైతే హైకోర్టుకు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని కేసీఆర్ సర్కార్ పట్టుదలతో ఉంది.
అదే సమయంలో ఈ కేసు విషయంలో సీబీఐ కూడా ఎక్కడా తగ్గకపోవచ్చు. సీబీఐ విచారణకు కేసీఆర్‌కి కూడా నోటీసులు అందే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణ తాలూకు ఆడియోలు, వీడియోలు ముఖ్యమంత్రికి ఎలా చేరాయని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదే పాయింట్‌తో సీబీఐ ఆయన్ని విచారించాలని అనుకోవచ్చు. సిట్ దర్యాప్తు సరిగాలేదని సింపుల్‌గా తీర్పు ఇచ్చేయలేదు హైకోర్టు. కేసును సీబీఐకి అప్పగించడానికి 45 కారణాలు చూపించింది. బీజేపీ నేతలను ఇరికించాలనే అత్యుత్సాహంతో కేసును రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఫ్రేమ్ చేయలేకపోయింది. ఇప్పుడు రహస్యంగా ఉండాల్సిన ఆధారాల లీకేజీ కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఆయనతో పాటు బేరసారాలు ఆడేందుకు వచ్చినవారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించామని జబ్బలు చరుచుకుంటున్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా సీబీఐ నుంచి శ్రీముఖాలు తప్పకపోవచ్చంటున్నారు.