తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసింది. కాంగ్రెస్ విజేతగా నిలిచింది. బీఆర్ఎస్, బీజేపీలు పరాజితులయ్యాయి. అయితే ఒక్క విజయంతో గెలిచిన వాళ్లు ఐదేళ్లు హాయిగా ఉండే రాజకీయాలు ఇప్పుడు జరగడం లేదు. బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు అసలు సాధ్యం కాదు. ఇప్పుడు అతి పెద్ద గండం లోక్ సభ ఎన్నికల రూపంలో ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌కే కాదు బీఆర్ఎస్, బీజేపీకి కూడా ఈ లోక సభ ఎన్నికలు విషమ పరీక్షే. అందుకే కాంగ్రెస్ ను ఓడించడానికి ఆ రెండు పార్టీలు కలుస్తాయా అన్న చర్చ ప్రారంభమయింది. కలవడానికి అన్నట్లుగా సర్వే రిపోర్టులు వెలుగులోకి వస్తున్నాయి. రెండు పార్టీలు కలిస్తే స్వీప్ చేస్తారని సీఓటర్ తాజాగా వెల్లడించింది.
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే చాన్స్ ఉండటంతో ఆటోమేటిక్ గా దేశీయ సర్వే సంస్థలు తమ ఫలితాలను వారికోసారి ప్రకటించడం ప్రారంభించాయి. ఈ సర్వేల్లో నిజాయితీ ఎంత అనేది పక్కన పెడితే కొంత విశ్వసనీయత సంపాదించుకున్న సంస్థల్లో సీఓటర్ ఒకటి. తాజాగా ఈ సంస్థ ఓ సర్వేను ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి మూడు లోపు, బీఆర్ఎస్‌కు నాలుగైదు సీట్లు వస్తాయని కాంగ్రెస్‌కు పది ప్లస్ వస్తాయని సీఓటర్ సంస్థ వెల్లడించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితానే తీసుకుని విశ్లేషణ చేస్తే ఇదే రిజల్ట్ వస్తుంది. ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు కానీ.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అదేమిటంటే.. బీఆర్ఎస్, బీజేపీకి కలిసి పోటీ చేస్తే పధ్నాలుగు సీట్లు వచ్చేలా స్వీప్ చేస్తారని సీఓటర్ సంస్థ చీఫ్ స్పష్టం చేశారు. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
లోక్ సభ ఎన్నికల విషయంలో బీజేపీ చిన్న నిర్లక్ష్యానికి కూడా చాన్సివ్వడం లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ గట్టి పట్టుతో ప్రయత్నిస్తోంది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉంది. అయితే మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే.. అధికార పార్టీ అడ్వాంటే.. కొత్త మోజు అన్నీ కలిసి కాంగ్రెస్ కు లాభిస్తుంది. అందుకే.. బీఆర్ఎస్, బీజేపీ కలయికపై చర్చ ప్రారంభమయింది. ఇప్పుడు బీజేపీని బీఆర్ఎస్ ఏమీ అనడం లేదు. గతంలో అయోధ్య రామమందిరంపై కూడా విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పొగుడుతున్నారు. గతంలో బీఆర్ఎస్‌తో కలిసేందుకు ప్రయత్నించారని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. పార్టీని కాపాడుకోవాలంటే… బీజేపీకి సన్నిహితం కాక తప్పదన్న భావన కేసీఆర్ గతంలోనే వ్యక్తం చేశారు. త ఇప్పుడు అధికారం పోయింది. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ నుంచి ప్రతిపాదన వస్తే.. ఖచ్చితంగా పొత్తు పెట్టుకోక తప్పదు.
ఇప్పుడు బీఆర్ఎస్‌కు పోటీగా రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరొకటి కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలను కేసీఆర్ ఎదుర్కోవాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ గత అనుభవాల కారణంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుంది. ఇక బీజేపీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎంత బలమైన పార్టీ అయినా రెండు జాతీయ పార్టీలతో పోరాడటం అంటే.. కేసీఆర్ కు..బీఆర్ఎస్‌కు అంత తేలిక కాదు. ఎందుకంటే పదేళ్ల పాటు అధికారంలో ఉండటం వల్ల అనేక రకాల ఆరోపణల లగేజీ మోసుకు తిరగాల్సి వస్తోంది. సీఎంగా ఉండటం వల్ల.. ఢిల్లీలిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కాకుండా తప్పించగలిగారని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు పవర్ పోయింది. ఇప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణల వల్ల మరింత టెన్షన్ ఎదుర్కోవాలి. అందుకే ఇప్పుడు ఏదో ఓ జాతీయ పార్టీతో కేసీఆర్ అవగాహనకు రావాల్సి ఉంటుంది.
నిన్నామొన్నటిదాకా జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కు రెండు చాయిస్ లు ఉన్నాయి. రెండు పార్టీల్లో దేనితోనైనా కలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలోకాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఆ పార్టీతో కలిసే అవకాశం ఉండదు. అలా కలిస్తే నేరుగా బీజేపీ నోట్లో చిక్కినట్లే. ఇక మిగిలింది బీజేపీతో కలవడమే . అలా కలిస్తే పార్టీని కాపాడుకోగలరా అంటే.. తాత్కలికంగా అన్న సమాధానం వస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న మరు క్షణం బీఆర్ఎస్ సైజ్ తగ్గిపోతుంది. మెల్లగా ఆ పార్టీ ప్రాధాన్యాన్ని కోల్పోతుంది. ఓ రకంగా బీజేపీనే మొత్తం లాగేస్తూ పోతుంది. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ను బీజేపీ నిర్వీర్యం చేసినా ఆశ్చర్యం లేదు. ఎలా చూసినా.. బీఆర్ఎస్‌కు అత్యంత కఠినమైన పరిస్థితులు ఉన్నాయని అనుకోవచ్చు.
కేసీఆర్ ఇప్పుడు రెండే ఆప్షన్లు ఉన్నాయని అందులో ఒకటి ఒంటరిగా రెండు జాతీయ పార్టీలతో ఫైట్ చేయడం.. రెండోది.. బీజేపీతో కలవడం. రెండు ఆప్షన్లు కూడా రెండు వైపులా పదునున్న కత్తిలాంటివే. కేసీఆర్‌కు ఇది అత్యంత గడ్డు పరిస్థితి. బీజేపీ పొత్తు పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తే తిరస్కరించలేని నిస్సహాయ స్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. అంటే చాయిస్ బీజేపీదే…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…