కేసీఆర్‌పై పోటీ చేయడానికి బీజేపీ అభ్యర్థి రెడీ

By KTV Telugu On 7 December, 2022
image

సీఎం నియోజకవర్గంపై దృష్టి పెట్టిన బీజేపీ
గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న ఈటల

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలనే పట్టుదలతో ఉన్న కమలనాధులు అందుకు అవసరమైన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలనే ఆలోచనతో కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ప్రస్తుతానికి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ బలంగానే ఉంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి ఊపుమీదుంది. అలాంటి బలమైన పార్టీని ఎదురించడానికి బీజేపీ ఇప్పటినుంచే అభ్యర్థుల వేటలో ఉంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా ఏకంగా కేసీఆర్‌ ను టార్గెట్‌ చేసుకుంది. ఆయన మీద మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు బీజేపీ నాయకులు. ఈటలకే కేసీఆర్‌ను ఓడించే సత్తా ఉందని వారు భావిస్తున్నారు.

అసలు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో, ఎంపీ స్థానానికి పోటీ చేస్తారో తెలియదు. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో ఆమధ్య భారత్ రాష్ట్ర సమితి పేరుతో ఒక జాతీయ పార్టీని ప్రకటించారు. ఇక్కడ కేటీఆర్‌ను సీఎంను చేసి ఆయన జాతీయ రాజకీయాల్లో కి వె ళ్లిపోతారని అనుకుంటున్నారు. అయితే బీజేపీ మాత్రం కేసీఆర్‌ అసెంబ్లీకే పోటీ చేస్తారని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఆయనుకు పోటీగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బరిలోకి దించడానికి బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్‌పై పోటీ చేయడానికి ఆయనే సరైన అభ్యర్థి అని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈటల రాజేందర్ కూడా కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తాను పోటీ చేస్తానని ప్రకటించారు. కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేసినా, మరోచోట పోటీ చేసినా తాను రెడీ అన్నారు. ఇటీవల కాలంలో గజ్వేల్ నియోజకవర్గం పై ఈటల దృష్టి సారించారు. తరచూ గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తూ చేరికలు ప్రోత్సహిస్తూ గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు. ఒకవేళ కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేస్తే ఈటలను ఎక్కడి నుంచి పోటీ చేయించాలని కూడా బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. నిజంగా కేసీఆర్‌ మీద ఈటల పోటీ చేస్తే మాత్రం అది పెద్ద సంచలనమే అవుతుంది.