కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తడంతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. పార్టీ కీలక నేతలు అందరూ.. ఆ పార్టీ వైపు చూస్తున్నారు. చాన్స్ ఉన్నంత వరకూ చేరిపోతున్నారు. అందర్నీ కాంగ్రెస్ కు వదిలేయడం ఎందుకని బీజేపీ కూడా రంగంలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వైపు చూస్తున్న కొంత మంది ఎమ్మెల్యేలతో పాటు కేసుల భయంతో ఉన్న పలువురు సీనియర్ నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల కంటే ముందే ఈ చేరికలు ఉంటాయని అంటున్నారు.
బీఆర్ఎస్లో ఉండాలా.. వేరే పార్టీల్లో చేరిపోవాలా అని గులాబీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఎమ్మెల్యేల సంగతి చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీలో 26 మందిని చేర్చుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలనుకున్న వారిని మాత్రం చేర్చుకున్నారు. కానీ ఎన్నికలకు ముందో.. తర్వాతో ఇరవై ఆరు మందిని చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీ విలీనం పూర్తి చేస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వారంతా ఇప్పుడు పార్టీలో చేరనప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరోక్షంగా అయినా పని చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అందర్నీ కాంగ్రెస్ పార్టీకి వదిలేయడం ఎందుకన్న ఉద్దేశంతో.. ఇప్పుడు బీజేపీ కూడా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ లో కొంత మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు ప్రారంభించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టింది గ్రేటర్ హైదరాబాదే. కానీ ఇప్పుడదే గ్రేటర్ నేతలు బీఆర్ఎస్కు తీవ్ర నష్టం చేకూర్చబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే హస్తం గూటికి చేరి, సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తుండగా, అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీ అయినట్టు తెలిసింది. మాజీ మంత్రి, సీనియర్ నేత అయిన తలసాని శ్రీనివాస యాదవ్ బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు ఒక్క సారిగా గుప్పు మంది. అంతా ఓకే అయితే ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. నిజానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉంది. సికింద్రాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కు లక్ష ఓట్లకుపైగా మెజార్టీ రావడంతో తన కుమారుడ్ని నిలబెట్టి ఎంపీగా గెలిపించాలనుకున్నారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్ పుట్టిన రోజున ఘనంగా నిర్వహించారు. కానీ తర్వాత క్రమంగా పరిస్థితి అర్థం కావడంతో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. హైకమాండ్ తలసానినే పోటీ చేయమని ఒత్తిడి చేసినా ఆయన అంగీకరించలేదు. చివరికి పద్మారావును అభ్యర్థిగా ఖరారు చేయాల్సి వచ్చింది.
గ్రేటర్లో ఎటు వైపు చూసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.కానీ ఎక్కడా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కవిత అరెస్టు అయినప్పుడు జంట నగరాల్లో నిరసనలే కనిపించలేదు. చివరికి కవిత ఇంటి వద్దకు కూడా ఎమ్మెల్యేలు రాలేదు. అంబర్‌పేట, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి… అధికార కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక మల్లారెడ్డి సంగతి చెప్పాల్సిన పని లేదు. వీరు ఎప్పుడైనా పార్టీ మారే అవకాశం లేకపోలేదని బీఆర్ఎస్ నేతలే చెప్పుకుంటున్నారు. వీరిలో కొంత మంది బీజేపీలో చేరిన ఆశ్చర్యం లేదన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా ఏడుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్ లో ఉందని అంటున్నారు .
క్యాడర్లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టి, వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ‘ఎండిపోయిన పొలాల’ బాట పట్టారు. ఈ కార్యక్రమం ద్వారా జనంలోకి వెళ్లేందుకు, పనిలో పనిగా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా షురూ చేసేందుకు ఆయన నిర్ణయించుకుని, దాన్ని అమలు చేస్తున్నారు. అయినా నాయకులు, ప్రజా ప్రతినిధుల గోడ దూకుడుకు ఆయన అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమ సమయంలోనూ, అటు తర్వాత పదేండ్ల ఏలుబడిలో గులాబీ బాస్ కేసీఆర్ వేసిన ఎత్తుగడలు, పన్నిన వ్యూహాలు ఇప్పుడు పని చేయటం లేదనే వాదనలు వినబడుతున్నాయి. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా నేతలందరూ బీఆర్ఎస్కు బై..బై…చెబుతుండటంతో పార్టీలో ఎవరుంటారో..? ఎవరు పోతారో…? తెలియని అయోమయం నెలకొందని మొదటి నుంచి ఉద్యమ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు వాపోతున్నారు.
గతంలో టిక్కెట్ ఇవ్వకపోతేనో లేక తనకు నచ్చిన వారికి, పార్టీలోని ప్రత్యర్థులకు టిక్కెట్ ఇస్తేనో అలగటం, కార్యక్రమాలకు రాకుండా ఉండటం లేదంటే రాజీనామా చేయటం లాంటి నిరసన కార్యక్రమాలు లీడర్ల నుంచి ఎదురయ్యేవి. ప్రతీ పార్టీలోనూ ఇవి సహజం. కానీ ఇందుకు భిన్నంగా ఇప్పుడు కారు పార్టీలో ప్రజా ప్రతినిధిగా గెలిచినా, టిక్కెట్ ఇచ్చినా ఉండని పరిస్థితి. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉదంతాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. మరోవైపు మొన్నటిదాకా ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన సీనియర్లలో చాలా మంది ఇప్పుడు పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవటం గమనార్హం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మెన్లుగా ఉన్న వారిలో అత్యధిక మంది ఇప్పుడు పార్టీకి ముఖం చాటేస్తున్న పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు, నాయకుల గోడ దూకుళ్లను ఆపేందుకు కేసీఆర్ వ్యూహాలు ఏ మాత్రం వర్కవుట్ కావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఊహించనంత గడ్డు పరిస్థితికి వెళ్లిపోతుందన్న ఆందోళన ఆ పార్టీ క్యాడర్ లో వ్యక్తమవుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…