తెలంగాణ మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు టైమ్ బాగో లేదనిపిస్తోంది. చేయాల్సిన పనులు కాకుండా ఆయన అధిక ప్రసంగం చేస్తున్నారన్న చర్చ టీబీజేపీలో కనిపిస్తోంది. ఏదో సాధిస్తారని బీజేపీలో చేర్చుకుంటే గుదిబండలా తయారయ్యారని ఒక వర్గం బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అలిగి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కు పార్టీ అధిష్టానం అన్ని మర్యాదలు చేసింది. ఉత్తర తెలంగాణలో బలమైన నాయకుడు కావడంతో జనాన్ని తీసుకొస్తారన్న విశ్వాసం అధిష్టానానికి కలిగింది. దానితో ఆయనకు చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించింది. ఈటల ఆ పని చేపట్టి చాలా రోజులైనా ఆయన వల్ల పార్టీ బలోపేతమైన దాఖలాలు కనిపించడం లేదు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి ఒకరిద్దరు జాయిన్ కావడం మినహా భారీ చేరికలు జరగలేదు. వాళ్లు కూడా కాంగ్రెస్ లో ఉన్న విభేదాల కారణంగానే బీజేపీకి వచ్చారే తప్ప కమలం పార్టీ గొప్పదనం చూసి రాలేదని తేలిపోవడంతో ఈటల పరపతి మసకబారిపోయిందనే చెప్పక తప్పదు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వ్యవహారం ఇప్పుడు ఈటల మెడకు చుట్టుకుంది. వారిని చేర్చించే బాధ్యత తీసుకున్నట్లుగా ఈటల కలరింగ్ ఇవ్వడమే ఇందుకు కారణం. ఈటల ఓ బృందాన్ని తీసుకుని వెళ్లి మరీ వారితో మంతనాలు జరిగి మీడియాకు పెద్ద వార్తే ఇచ్చారు. ఆ తర్వాత కట్ చేసి ఆ ఇద్దరు నేతలు బీజేపీలో చేరేందుకు ఊత్సాహం చూపడం లేదు. వారిద్దరూ కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లుగా ప్రచారమైంది. ఆ విషయాన్ని తెలివిగా దారి మళ్లించి మౌనంగా వదిలేయ్యాల్సిన ఈటల రాజకీయ తేనెతుట్టెను కదిలించారు. పొంగులేటి జూపల్లిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని మీడియా సాక్షిగా ఆయన వెల్లడించారు. పైగా వారిద్దరూ తనకే రివర్స్ కౌన్సిలింగ్ చేశారని చెప్పుకున్నారు. దానితో ఈటలను కూడా కాంగ్రెస్ లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు తెరపైకి వచ్చాయి.
ఈటల ప్రెస్ మీట్ వ్యవహారం ఢిల్లీలోని బీజేపీ అధిష్టానానికి చేరింది. హైకమాండ్ ప్రతినిధులు పూర్తి నివేదిక తెప్పించుకున్నట్లు కూడా చెబుతున్నారు. మీడియాతో మాట్లాడటం తగ్గించాలని మాట్లాడేప్పుడు సంయమనం పాటించాలని ఈటలకు ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడెక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అన్నింటినీ సేకరించే పనిలో పడింది. రాష్ట్ర నాయకులు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని కూడా భావిస్తోంది. అసలు పార్టీకి చెప్పకుండా మీడియా చిట్ చాట్‌లు ఏర్పాటు చేయడంపై కూడా ఆగ్రహంగా ఉంది. బీజేపీ రాష్ట్ర నేతలు లైన్ దాటి వ్యవహరిస్తున్నారని దీని వల్ల పార్టీకి నష్టం కలగడమే కాకుండా కార్యకర్తల్లో కూడా ఆందోళన నెలకొంటోందని భావిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని అంచనాకు వచ్చింది. ఇకపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని కూడా అంచనా వేస్తోంది. అందుకే ఇకపై మీడియా ముందు అనసవర వ్యాఖ్యలు చేయకుండా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత టీబీజేపీలోనే కొందరు నేతలు పునరాలోచనలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో క్రియాశీలంగా కనిపిస్తూ రాష్ట్ర పార్టీకి ఆర్థిక వనరులు అందించే ఇద్దరు మాజీ ఎంపీలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు కమలం పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. అందులో వివేక్ వెంకటస్వామి ఒకరిన్న చర్చ కూడా మొదలైంది. లోక్ సభ ఎన్నికల్లో టికెట్ హామీ ఇస్తే పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నామని చెబుతున్నారట. తమకు టికెట్ ఇవ్వడం కదరని పనైతే కనీసం తమ వారసులను అకామడేట్ చేయాలని కోరుతున్నారట. త్వరలోనే డీల్ కుదిరి వారిద్దరూ వెళ్లిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ అలాంటి దుస్థితి రాకుండా అడ్డుకోవడంతో ఈటల రాజేందర్ ఫెయిల్ అయ్యారని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
ఈటల టీబీజేపీలో ఓ వర్గం నేతగా ఎదిగారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ను సైతం దాటుకుపోయారు. సంజయ్ ను కరీంనగర్ కు పరిమితం చేసి టీబీజేపీని ఈటల చేతులో పెడతారన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు మాత్రం ఈటలకు సీన్ సితారైంది. ఈటల కారణంగా పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితి వచ్చిందన్న ఆందోళన మొదలైంది. కొండ విశ్వశ్వరరెడ్డి సహా పలువురు నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్న ఆవేదన అధిష్టానంలో కనిపిస్తోంది. పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను ఇప్పుడు బండి సంజయ్ పై పెట్టారు. అంతా మీరే చూసుకోండి అందరినీ దారికి తీసుకురండని చెప్పారట. మరి సంజయ్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.