గుజరాత్ లో అఖండ విజయం సాధించిన బీజేపీ ఇక తమ దృష్టి మొత్తం తెలంగాణ మీద ఫోకస్ చేసింది. ఈసారి ఎలాగైనా గెలిచి తెలంగాణలో అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం అవసరమైన కార్యాచరణ పార్టీ పెద్దలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి దృష్టి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీద పడింది. రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను లేవనెత్తుతూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు షర్మిల. ఇటీవల జరిగిన పరిణామలతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. పోలీసులు ఆమెపట్ల వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండిచారు. అయినా ఆమె వెనక్కు తగ్గకుండా ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కమలనాధుల చూపు షర్మిలవైపు మళ్లింది. ఆమె పోరాట తత్వాన్ని, పార్టీ కార్యకలాపాలను పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించడం అందులో భాగమే అనంటున్నారు పరిశీలకులు. దాంతో ముందుముందు షర్మిలను తమతో కలుపుని వెళ్లడానికి బీజేపీ ప్రయత్నిస్తోందనే అనుమానాలకు బలం చేకూరింది. గతంతో పోలిస్తే తెలంగాణాలో బీజేపీ కాస్త బలపడింది. టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తోంది. అయితే అధికార పార్టీని ఢీకొట్టాలంటే ఆ బలం సరిపోదు. చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి చెప్పుకోదగిన నాయకులు లేరు.
ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. షర్మిల తమతో కలిసొస్తే బలమైన రెడ్డి సామాజిక వర్గం తమ వెంట ఉంటుందనేది బీజేపీ ఆలోచన. అలాగే తెలంగాణలో ఉన్న వైఎస్సార్ అభిమానుల ఓట్లు కూడా గంపగుత్తగా తమకే పడతాయని వారి అంచనా. అయితే ఈ ప్రతిపాదనకు షర్మిల ఒప్పుకుంటుందా లేదా తెలియదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణలో షర్మిలతో పొత్తు పెట్టుకుంటే తమకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్న బీజేపీ పవన్ కళ్యాణ్ ను కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్దామనే ఆలోచనే చేయడంలేదు. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయి. కానీ తెలంగాణలో జనసేన తమకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని కమలనాథులు భావిస్తున్నారు. తెలంగాణలో జనసేనతో ఎలాంటి పొత్తులు ఉండవు, జనసేన తో దోస్తీ ఏపీ వరకు మాత్రమే అని గతంలోనే బీజేపీ నాయకులు చెప్పారు. నిజానికి తెలంగాణలో కూడా పవన్‌కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయినా సరే పవన్ ను దూరం పెట్టాలని అనుకుంటున్నారట బీజేపీ నాయకులు. బిజెపి దృష్టిలో షర్మిలకు ఉన్న విలువ పవన్ కల్యాణ్ కు లేకుండా పోయిందా అని జనసైనికులు గొణుక్కుంటున్నారు.