తరచుగా ఆగిపోతున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం
తిరిగి తీసుకెళ్లండని ఇంటలిజెన్స్ ఐజీకి లేఖ
పిడి యాక్టు కింద జైలుకెళ్లి ఇటీవల బెయిల్ మీద విడుదలైన బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయన జైలుకెళ్లినప్పుడు పార్టీ నుంచి తగినంత సహాయ సహకారాలు లభించలేదని రాజాసింగ్ అనుచరుల్లో అసంతృప్తి ఉంది. ఇప్పటికే ఆయన టెర్రరిస్టుల హిట్ లిస్టులో ఉన్నారు. చంపేస్తామంటూ పలుమార్లు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు రాజాసింగ్‌కు ఒక కొత్త సమస్య ఎదరైంది. ఆయనకు పోలీసులు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతోందని ఆయన తెలిపారు. సోమవారం అఫ్జల్ గంజ్ మీదుగా బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తుండగా.. అది మధ్యలో మొరాయించింది. దాంతో ఆయన మరో వాహనంలో ఇంటికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. ఇలా తరచూ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోతుండటంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపించానని. వాళ్లు మరమ్మతులు చేసి తిరిగి అదే వాహనాన్ని ఇచ్చారంటూ రాజాసింగ్ వెల్లడించారు.
తీవ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్న తనకు పోలీసులు కల్పించే భద్రత ఇదేనా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీకి ఆయన ఒక లేఖ రాశారు. తనకు కేటాయించిన వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ పలుమార్లు పోలీసు శాఖ దృష్టికి తీసుకొచ్చినా.. తిరిగి అదే వాహనాన్ని కేటాయిస్తున్నారని ఆరోపించారు. 2010 మోడల్‌కు చెందిన వాహనంలో అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. తరచుగా ఆ వాహనం దారి మధ్యలో ఆగిపోతోందని పేర్కొన్నారు. తీవ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉన్న విషయం పోలీసులకు తెలుసని.. అయినా తన భద్రత విషయంలో అలసత్వం వహిస్తున్నారంటూ వివరించారు. తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేకపోతే. దాన్ని తిరిగి తీసుకెళ్లండి అని ఆ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా రాజాసింగ్‌కు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిస్తారో లేకపోతే పాత వాహనాన్నే మళ్లీ రిపేరు చేసి పంపిస్తారో చూడాలి.