తెలంగాణపై బీజేపీ ఆశలు నెరవేరతాయా.. అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలన్న కోరిక తీరుతుందా. పార్టీకి ప్రతిబంధకాలున్నాయా. దానికి కారణం ఏమిటి.నేతలు బీజేపీ వైపుకు వస్తున్నా… విజయంపై ఆత్మవిశ్వాసం ఎందుకు కలగడం లేదు..
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పార్టీల్లో కాక పెరుగుతోంది. కాంగ్రెస్ నేత సీఎం రేవంత్ రెడ్డి దూసుకుపోతుంటే.. ఆయనకు అడ్డు తగిలేందుకు మిగతా రెండు పార్టీల నుంచి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆయన కంటే ముందుండాలని ఇతర పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే..తాము రేవంత్ ను దాటిపోయి చాలా రోజులైందని జనం మదిలో గూడుకట్టుకుని స్థిరపడిపోయామని ఇతర పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి…తెలంగాణలోని 17 లోక్ సభా స్థానాల్లో 14కి పైగా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. కనీసం పది గెలవాలని అప్పుడే తమకు దేశ వ్యాప్తంగా 370 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందని బీజేపీ లెక్కలేసుకుంటోంది. ఈ నెంబర్ గేమ్ లో బీఆర్ఎస్ బాగా వెనుకబడిపోయినా..ముక్కోణ పోటీలో లబ్ధి పొందడం ఖాయమని ప్రచారం చేసుకుంటోంది. ఈసారి మిగతా రెండు పార్టీలకు సర్ ప్రైజ్ ఇస్తామని బీజేపీ పెద్దలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ట్రాకర్ పోల్ సర్వే ప్రకారం 12 స్థానాల్లో కాంగ్రెస్‌వైపే ప్రజలు మొగ్గు చూపారు.. కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండగా, 30 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. ఇక పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని తేల్చింది. గత ఎన్నికల్లో 9 స్థానాలు గెలిచిన బీఆర్‌ఎస్‌కు ఈసారి కేవలం 22 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ తెలిపింది. ఈ సర్వేలను నమ్మొద్దని ఓట్ల శాతంలో తాము అగ్రభాగాన ఉంటామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి….
నాయకులు చేరుతున్నా బీజేపీలో జోష్ కనిపించడం లేదు. నేతల మధ్య సమన్వయం ఉన్నట్లుగా సంకేతాలు రావడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. కార్యకర్తలతో టచ్ లో ఉన్నారా లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి….
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ లో పోటీ చేసే అవకాశం రాదనుకున్న వారు బీజేపీ వైపే చూస్తున్నారు. ఫిరాయింపుదారులకు ఆ పార్టీ హాట్ ఫేవరెట్ గా ఉన్నప్పటికీ నేతల్లో జోష్ లేదనే చెప్పాలి.ఇంతకాలం మాటలకే పరిమితమయ్యామని కేడర్ బలం అంచనా వేసుకోలేకపోయామని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో గ్రాస్ రూటు స్థాయిలో నిర్వహించిన కార్యక్రమాలు పేలవంగా సాగాయి. టిఫిన్ పే చర్చా, గావ్ చలో, ఘర్ చలో లాంటి కార్యక్రమాలకు ప్రజా స్పందన పెద్దగా కనిపించలేదు. జనంలో బీజేపీ పట్ల ఇంట్రస్ట్ ఉన్నట్లు వార్తలు రావడం లేదు. తెలంగాణలో బీజేపీ పూర్తిగా అర్బన్ పార్టీగా ఉంది. నేతలంతా సిటీల్లో తిరుగుతుంటారు. గ్రామాల్లో ఓటర్లకు వారు అందుబాటులోకి రావడం లేదన్నది విస్తృతాభిప్రాయం. గ్రామీణ ప్రాంతాలపై నేతలు చూడటం లేదు. దానితో అక్కడ బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలత రావడం లేదు. అసలు చర్చేజరగడం లేదు. పోలింగ్ బూత్ స్థాయిలో పెద్దగా కార్యక్రమాలు జరగడం లేదు. ఒకరిద్దరు సొంత పరపతిపై పనులు చేయడమే తప్ప వారికి రాష్ట్ర అధిష్టానం వైపు నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదు. పోలింగ్ కేంద్రానికి పది మంది క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేసి వారిచేత కార్యక్రమాలు నిర్వహింపజేయడం పార్టీ విధానాల్లో ఒకటి. తెలంగాణలో మాత్రం అలాంటి ప్రయత్నమే లేదు. పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్థలు లేరనే చెప్పాలి. ఉత్తరాది మాదిరిగా రామాలయ సెంటిమెంట్ లేదు. మోదీ మాత్రమే నాయకుడన్న ఫీలింగ్ రావడం లేదు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు రాహుల్ గాంధీని ప్రధాని కావాలని కోరుకుంటున్నారంటే.. గ్రాస్ రూట్లో అసలు మోదీ చర్చే లేదని అర్థమవుతోంది.. అందుకే ఈ సారి కూడా పార్టీ ఓట్ షేర్ మొత్తం అర్బన్ ప్రాంతాలపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈసారి బీజేపీ కోరుకున్నట్లుగా పది సీట్లు రావు.. ఐదు సీట్లు కూడా రాకపోవచ్చు. జనంలో పార్టీ పట్ల ఆసక్తి లేకపోవడం ఒకటైతే రాష్ట్ర పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు రెండోవదని చెప్పారు. కాలం చెల్లిన నేతలను చేర్చుకుంటున్నారన్న వాదన బలపడుతోంది…..
తెలంగాణలో బీజేపీ ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో నిలబడి ఉంది. ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోతోంది. మోదీ ఛరిస్మాతో పాటు స్థానిక నాయకత్వంపై విశ్వాసం ఉంచాలా..లేక వేరు మార్గాలు వెదుక్కోవాలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా కొనసాగుతోంది. జనాన్ని బీజేపీ వైపు మౌల్డ్ చేయడంలో విఫలమైన ప్రతిఫలం ఇప్పుడు అనుభవించాల్సి రావడం పెద్ద వైకల్యంగానే భావించాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…