గులాబీ దళానికి కాషాయ ఎర…

By KTV Telugu On 27 October, 2022
image

నలుగురు ఎమ్మెల్యేలకు తలా వంద కోట్లు

ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారు. అడ్డంగా బుక్కయ్యారు. ఆరోపణలు రావడంతో నీళ్లు నములుతున్నారు. సీఎం కేసీఆర్ కే బీజేపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైడ్రామాపై ప్రత్యేక కథనం…..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించిన సంఘటన ఇది. 400 కోట్లతో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర జరిగింది. ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాదాపు గంటన్నరపాటు సాగిన బేరసారాలను రహస్యంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ కూడా చేశారు. వారి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీరం హర్షవర్థన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజును డబ్బులిచ్చి తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని అన్నారట. నగర శివారు అజీజ్ నగర్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేసినప్పుడు వీరందరూ చిక్కారు. ఢిల్లీ, తిరుపతి, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.ఆ ముగ్గురిలో ఒకరు ఫరీదాబాద్‌ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ కాగా, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, మూడో వ్యక్తి హైదరాబాద్‌ నివాసి నందకుమార్‌ . ఆయన డెక్కన్‌ ప్రైడ్‌ హోటల్‌ యజమాని.

ఆపరేషన్ ఆకర్ష్ వెనుక అమిత్ షా ఉన్నట్లు ఆరోపణలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురిని కొనుగోలు చేసే ప్రయత్నం వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. బేరసారాలకు వచ్చిన రామచంద్ర భారతీ… నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ఆగ్రనేతతో మాట్లాడించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన అనుచరుడితో మాట్లాడించినట్లు తెలిసింది. ఆ అగ్రనేత అమిత్‌ షా అని టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపిస్తున్నారు. నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. మొత్తం వ్యవహారాన్ని ఆయనకు వివరించారు. మరో పక్క అజీజ్ నగర్ ఫామ్ హౌస్ లో ఉన్న ఒక కారులో కొన్ని బ్యాగులు కనిపించాయి.. అవి డబ్బు సంచులని అనుమానిస్తున్నారు.

రఘునందన్ రావు ముందే చెప్పారా ?

మునుగోడు ఎన్నిక ముగిసిన వెంటనే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమవైపుకు వస్తారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెబుతున్న వీడియో ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేసీఆర్ వారికి వందల కోట్లు ఇచ్చినా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేయడంతో రఘునందన్ రావు చెప్పినది నిజమేననిపిస్తోంది. మరో పక్క ప్రలోభాల వ్యవహారం కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ వారం పైగా ఢిల్లీలో మకాం వేసి .. స్వామిజీలను తన దగ్గరకు పిలిపించుకుని డ్రామాలకు తెరలేపారన్నారు. దమ్ముంటే కేసీఆర్ యాదాద్రికి వచ్చి ఈ డ్రామాతో సంబంధం లేదని ప్రమాణం చేయాలన్నారు. కేసీఆర్ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సహాయ నటుడిగా మారారన్నారు. మరో పక్క టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. బీజేపీ కుట్ర రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయని, ఉద్యమకారులైన ఎమ్మెల్యేలను కొనడం సాధ్యం కాదని ప్రతీసవాలు చేస్తున్నారు. నాడు ఓటు నోటుతో తెలుగుదేశం జీరో అయ్యిందని, ఇప్పుడు బీజేపీ పని అయిపోయిందని అంటున్నారు…. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు వద్దని బీజేపీకి హితవు పలికారు…