మాటలు కోటలు దాటతాయా… చేతలు గుమ్మాలు దాటవా. తెలంగాణ ప్రజలను హామీలతో సరిపెట్టాలని బీజేపీ చూస్తోందా. మిషన్ 400 లో భాగంగా తెలంగాణలో పది ఎంపీ సీట్లు గెలుచుకోవడమొక్కటే ఆ పార్టీ లక్ష్యమా. మోదీ మాటలను నమ్మకూడదని తెలంగాణ జనం ఎందుకు అనుకుంటున్నారు. బీజేపీకి విజయావకాశాలున్నాయా… అసలా పార్టీ చేస్తున్నదేమిటి…
ఉత్తరాది పార్టీగా పేరుపడిపోయిన బీజేపీకి ఇప్పుడు దక్షిణాదిపై కూడా మక్కువ పెరిగింది. కర్ణాటక వెలుపలు కొన్ని ఎంపీ సీట్లు సాధించే క్రమంలో రాజకీయ సర్దుబాట్లకు కూడా సిద్ధమైంది. దక్షిణ రాష్ట్రాల్లో ఉన్న 130 లోక్ సభా స్థానాల్లో కనీసం సగమైన కైవసం చేసుకునేందుకు బీజేపీ కంకణ బద్దమై ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీ ఆశయం నెరవేరాలంటే కర్ణాటకలో పాతిక సీట్లు వస్తే సరిపోదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పార్టీకి ఏపీలో కొన్ని స్థానాలతో పాటు తెలంగాణలో ఏడు నుంచి పది సీట్లు సాధిచాలన్న తపన ఉంది. వీలైతే తమిళనాడులో నాలుగైదు…. కేరళలో ఒకటి రెండు స్థానాలపై కమలనాథులు కన్నేశారు.ఇక దక్షిణాదిన ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నప్పటికీ ఎక్కువ ఫోకస్ తెలంగాణపైనే పెట్టినట్లుగా భావించాల్సి వస్తోంది. ఎందుకంటే పోటీ చేసే స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయన్న విశ్వాసం ఆ పార్టీకి కలుగుతోంది ముక్కోణ పోటీలో బీజేపీకి లబ్ధి కలిగే విధంగా మోదీ, అమిత్ షా లెక్కలేస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తెలంగాణలో వరుస పర్యటనలకు మోదీ ప్లాన్ చేశారు. ఇక వస్తూపోతూ ఉంటానని ఆయన చెప్పేశారు. రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ పేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభించామని మోదీ చెప్పుకున్నారు. దేశంలో ఏడు మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని, అందులో ఒకటి తెలంగాణకు కేటాయిస్తామని మోదీ మహాశయుడు హామీ ఇచ్చారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు భారీ స్థాయిలో అమలవుతున్నాయని బీజేపీ తరచూ ప్రకటిస్తోంది. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, బేటీ బచావో బేటీ పఢావో, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనతో పాటు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ద్వారా తెలంగాణ ప్రజలు లబ్ధిపొందారని కేంద్రం చెప్పుకుంటోంది. కేంద్రప్రభుత్వ పన్నుల బట్వాడాలో భాగంగా 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 60 వేల కోట్ల రూపాయల నిధులను తెలంగాణకు విడుదల చేశామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రపన్నుల్లో రాష్ట్ర వాటా 41 శాతం ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా అంత డబ్బు రావడం లేదన్న తెలంగాణ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చుతోంది. వరదలు వచ్చినప్పుడల్లా కేంద్ర బృందాలు నష్టాన్ని అంచనా వేసి కేంద్రసాయాన్ని ప్రకటిస్తున్నాయని మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రభుత్వ సంస్ధలకు, కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం 9 లక్షల 80 వేల 904 కోట్ల రూపాయల సాయం అందించినట్లు కిషన్ రెడ్డి గతేడాది ప్రకటించారు. నాబార్డు ద్వారా వివిద సంస్ధలకు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు రుణాలు అందించినట్లు, వివిధ ప్రభుత్వ సంస్థలకు వడ్డీ లేని మరో లక్షన్నర కోట్ల రూపాయలు అందించినట్లు కూడా మంత్రి చెప్పారు.వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకోసం రాష్టంలో 5 లక్షల 27 వేల కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు
ఓటరు దేవుడ్ని ఆకట్టుకునేందుకు ఎన్నెన్నో చెబుతుంటారు. అందులో కొన్ని అమలవుతాయి. అమలు కానివి ఎన్నో ఉంటాయి. అంకేలు వేరు క్షేత్రస్థాయి వాస్తవాలు వేరు. అది అభివృద్ధీ, సంక్షేమానికి సంబంధించిన లెక్క. అయితే 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలే ప్రామాణికంగా బీజేపీ తెలంగాణలో దూసుకుపోవాలనుకుంటోంది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరన్నది మాత్రం ఆ పార్టీ గుర్తించలేకపోతోంది. ఎందుకంటే కాంగ్రెస్ అడ్డుగోడను ఎలా ఛేదించాలన్నదే ఇప్పుడు కమలం పార్టీ పెద్దల ముందున్న మిలియన్ డాలర్ ప్రశ్న…
ఆపరేషన్ తెలంగాణను బీజేపీ సక్సెస్ చేసుకుంటుందా అన్నదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్ల చర్చనీయాంశమని చెప్పక తప్పదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో గెలిచింది. అది కూడా హైదరాబాద్లోని గోషామహల్లో రాజాసింగ్. 103 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. కానీ 2019 లోక్ సభ ఎన్నికలు వాళ్లకు తొలిసారి నమ్మకాన్ని కలిగించాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి వెడితే మోదీ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడుతుందని భావించే కేసీఆర్ తెలివిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ పార్లమెంట్ ఎన్నికలకొచ్చేసరికి ఆయన భయాలు నిజయమ్యాయి.బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గట్టిగా దృష్టిపెడితే ఇక్కడ అవకాశముందనే నమ్మకం పార్టీకి కలిగింది. తర్వాత హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో గట్టిపోటీ నివ్వడం వారి విశ్వాసాన్ని పెంచింది. తర్వత జరిగిన రెండు ఉపఎన్నికలు బీజేపీని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. దుబ్బాక,హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరు బాటలో నడిచిన బీజేపీ.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది సీట్లు గెలుచుకోగలిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మూడో ఎన్నికలో పార్టీ తన బలాన్ని పెంచుకున్నట్లయ్యింది. పైగా లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు బాగా పెరిగాయి. సిట్టింగు ఎంపీలే ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం బాట పడుతున్నారు. దానితో తెలంగాణకు సంబంధించి బీజేపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అధికార కాంగ్రెస్ కు తాము మాత్రమే ప్రధాన ప్రత్యర్థి అని.. రెండు పార్టీలు కాదని తెలంగాణ ఓటరు తమ వైపుకు వచ్చేస్తారని బీజేపీ విశ్వసిస్తోంది. ఏడు నుంచి పది స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. కాకపోతే కాంగ్రెస్ రూపంలో ఆ పార్టీకి పెద్ద అడ్డింకే ఎదురవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడో రైజింగ్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి నలుగురు చేరితే, కాంగ్రెస్ పార్టీలోకి ఎనిమిది మంది చేరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫ్రెండ్లీ లీడర్ అన్న పేరు కూడా తెచ్చుకున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్న సంకల్పం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మరో పక్క బీజేపీ కేవలం పది ఎంపీ సీట్ల కోసం వస్తుందే తప్ప రాష్ట్ర సంక్షేమం ఆ పార్టీకి పట్టదన్న అభిప్రాయం జనంలో ఉంది. ప్రత్యర్థులపై విమర్శలు చేసినంత సులభంగా సమస్యల పరిష్కారానికి బీజేపీ ఇష్టపడదని కూడా జనానికి అర్థమవుతూనే ఉంది…
బెసిగ్గా ఉత్తరాదికి ఇచ్చినంత ప్రాధాన్యం బీజేపీ పెద్దలు దక్షిణాదికి ఇవ్వడం లేదన్నది ఒక బలమైన వాదన. తెలంగాణలో ఎలాగూ అధికారానికి రాలేమని గ్రహించిన ఆ పార్టీ పెద్దలు కేవలం ఎంపీ సీట్ల కోసమే తాపత్రయ పడుతున్నారని ఫీలింగు కలుగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో తక్షణమే ప్రాజెక్టులకు సమరవేగంతో పనులు కానిచ్చేస్తామని కూడా వాళ్లు చెప్పడం లేదు. ఇంతిచ్చాము, అంతిచ్చాము అని అంకెల గారడీతో కాలయాపన చేస్తున్నారనే జనం అనుకుంటున్నారు. వాస్తవ లెక్కలు వేరుగా ఉంటున్నాయన్న అందరూ గ్రహించారు. అందుకే నిర్దేశిత లక్ష్యం వైపుకు బీజేపీ ప్రయాణించడం కష్టమేనన్న ఫీలింగ్ వస్తోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…