క్షేత్రస్థాయి బలోపేతానికి తెలంగాణ బీజేపీ తంటాలు

By KTV Telugu On 23 February, 2023
image

2023 ఆఖరులో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కమలనాథులు రెడీ అవుతున్నారు. ఆ దిశగా పార్టీని బలోపేతం చేసే చర్యలకు శ్రీకారం చుట్టే ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైంది. అంతకు మించి మరో ప్లాన్ ను కూడా అమలు చేస్తున్నారు. గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్లో పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసినట్లుగానే తెలంగాణలోనూ శాశ్వత పాత్రిపదికన బలోపేతం చేయాలని వారు పథక రచన చేస్తున్నారు.

ఇప్పటికే ప్రజా సమస్యలే లక్ష్యంగా కమలం పార్టీ ముందుకు వెళ్తోంది. స్ట్రీట్ మీటింగ్స్‌తో కాషాయదళం బిజీ బిజీగా ఉంది. ఒకట్రెండు రోజులతో ఆ సభలు కూడా ముగియబోతున్నాయి. దాంతో కమలనాథులు నెక్ట్స్‌ టార్గెట్‌ను ఫిక్స్ చేసుకున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ముగిసిన వెంటనే బూత్ స్వశక్తికరణ్ పేరిట మరో డ్రైవ్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. పార్టీని బూత్ స్థాయికి చేర్చేందుకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఉపయోగపడతాయని బీజేపీ భావిస్తోంది. అదేసమయంలో స్వశక్తికరణ్​ కార్యక్రమంతోపాటు పోలింగ్ బూత్‌ల బలోపేతంపై ఫోకస్‌ పెట్టనుంది.

నిజానికి పోలింగ్ బూత్ ఇన్‌చార్జ్‌ల నియామకం కమలం పార్టీ పెద్దలకు కఠిన పరీక్షే అవుతుంది. అయితే బూత్ స్వశక్తీకరణ్ పేరుతో దాన్ని సులువుగా పూర్తిచేయడంపై కసరత్తు చేస్తున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌తో పార్టీని ప్రతి ఇంటికీ చేర్చడంపై నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బూత్ స్వశక్తికరణ్ ద్వారా పోలింగ్ బూత్‌ల వారీగా కమిటీలు వేసి భవిష్యత్‌లో పార్టీ బలాన్ని మరింత పెంచుకోవాలని బీజేపీ నాయకత్వం చూస్తోంది. అందుకే బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుతోపాటు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ సరళ్ యాప్‌పై బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. ఇప్పటివరకు కమిటీల ఏర్పాటు ఎంతమేరకు వచ్చింది ఎన్ని వీథి సభలు నిర్వహించారనే దానిపై సమీక్షలు జరపబోతున్నారు.

సరళ్‌ యాప్‌లో భాగంగా ఎంతమంది పేర్లను అప్‌డేట్ చేశారనే అంశాలపై హైకమాండ్ ఫోకస్ పెంచనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సహా ఇన్‌చార్జ్‌ అర్వింద్ మీనన్ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్ర పదాధికారులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో భేటీ అవుతారు. దానిలో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సమీక్షలు జరగనున్నాయి. హైకమాండ్ వ్యూహాలను పూర్తిస్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా సునీల్‌బన్సల్ టూర్ సాగనుంది. బీజేపీ జాతీయ నేతల వ్యూహాలను అమలు చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.

అంతవరకూ బాగానే ఉన్నా బూత్ కమిటీల నియామకం కమలం పార్టీకి పెద్ద టాస్క్‌గా మారింది. ఒక్కో బూత్ కమిటీలో 22మంది సభ్యులు ఉండాలనే నిబంధన జాతీయ నాయకత్వం విధించింది. ‌తెలంగాణలో సుమారు 35వేల బూత్ కమిటీలున్నాయి. ఇప్పటివరకు 10వేల బూత్ కమిటీలు మాత్రమే కమలం పార్టీ పూర్తి చేసింది.‌ అందుకే తెలంగాణ నాయకత్వంపై అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది. దీంతో బూత్ కమిటీల నియామకం పూర్తి చేయలేక బీజేపీ రాష్ట్ర, జిల్లా నేతలు తర్జనభర్జన పడుతున్నారు. దానితో బూత్ కమిటీల నియామకంలో వారికి సహకరించే దిశగా మరో కమిటీని ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల కమిటీల ఏర్పాటులోనే చిక్కులు తప్పడం లేదు. వాటిని అధిగమిస్తే తొలి విజయం సాధించినట్లేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి.