తెలంగాణ బీజేపీలో ఏం జరగబోతోంది.

By KTV Telugu On 18 November, 2022
image

ఈటల, కోమటిరెడ్డికి బీజేపీ అధిష్టానం పిలుపు
ఎందుకు పిలిచిఉంటారని బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ

తెలంగాణ మీద బీజేపీ సీరియస్‌గా దృష్టి సారించింది. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయినా నిరాశ పడకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి రావలనేది ఆ పార్టీ మెయిన్‌ టార్గెట్‌గా పెట్టుకుంది. కేసీఆర్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీ కన్నా బీజేపీ చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించి కమలదళాన్ని ఎదుర్కునేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇటీవల రామగుండం వచ్చిన మోదీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉపఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, ఈటల రాజేందర్ ను ఢిల్లీకి ఆహ్వానిచటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బేగంపేట విమానాశ్రయం వద్ద బీజేపీ పెద్దలు రాజగోపాల్‌రెడ్డిని ప్రధానికి పరిచయం చేసినప్పుడు మునుగోడులో బాగా పోటీ ఇచ్చావని కోమటిరెడ్డి భుజం తట్టి ప‌్రశంసించారు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులను హస్తినకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. విచిత్రం ఏమిటంటే వీళ్లిద్దరూ మరో పార్టీ నుంచి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేసివారే. ఒకరు విజయం సాధించగా, మరొకరు ఓడిపోయారు. హైకమాండ్ పిలుపుతో వెంటనే ఇద్దరు నేతలు ఈటల, కోమటిరెడ్డి హస్తినకు పయనం అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈ ఇద్దరు నేతలు భేటీ అవుతారు. తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల విషయాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భవిష్యత్తు రాజకీయాల గురించి మాట్లాడుకునే అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా వ్యూహాలు రచించుకునే అవకాశం ఉంది.
తెలంగాణలో మరింత బలోపేతం కావడానికి వీరికి అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే డీకే అరుణ ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ హైకమాండ్‌ ఏం చేయబోతోందని బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది.