భారతీయ జనతా పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన రెండో జాబితాలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే టికెట్లు ఖరారు చేశారు. మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన నలుగురు నేతలకు బీజేపీ టికెట్లు ఇచ్చారు. మొదటి జాబితాలోనూ ఫిరాయింపు దార్లకే పెద్ద పీట వేశారు. రెండో జాబితా అంతే. ఇక మూడో జాబితాలో రాబోయే రెండు సీట్లు ఫిరాయింపు నేతలకే ఇవ్వడం ఖాయం. తెలంగాణలో బలపడ్డామంటున్న బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరా ?
భారతీయ జనతా పార్టీ అంటే గతంలో సిద్దాంత పార్టీ. పార్టీలో చేరికలకు ఆపరేషన్లు చేసే వారు కాదు. చేరేందుకు పెద్దగా నేతలు ఆసక్తిచూపేవారు కాదు. బీజేపీ సిద్ధాంతాలను పూర్తిగా ఆకళింపు చేసుకుని కింది స్థాయి నుంచి ఎదిగిన వారే నేతలుగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి.. లక్ష్మణ్ , ఇంద్రసేనారెడ్డి, సోము వీర్రాజు ఇలాంటి వారంతా.. ఆ తరహా నేతలు. కానీ ఇప్పుడు.. బీజేపీని చూస్తే.. మొత్తం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. వారికే ప్రాధాన్యం లభిస్తోంది. దీని వల్ల కింది స్థాయి నుంచి పని చేసుకుంటూ వస్తున్న వారికి నిరాశ కలుగుతోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అదే కనిపిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ గొడం నగేష్ ను బీఆర్ఎస్ పార్టీ నుంచి రప్పించి కాషాయం కండువా కప్పిన మూడు రోజుల్లోనే టికెట్టు ఇచ్చారు. ఆదిలాబాద్ బీజేపీ టికెట్టు ఆశించిన సిట్టింగ్ ఎంపీ సోయంబాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ లు తీవ్ర అసంతృప్తి జ్వాలలతో రగులుతున్నారు. పార్టీలో ఉన్న తమను కాదని బీఆర్ఎస్ పార్టీ నేతకే టికెట్టిస్తారా అని వారు మండిపడుతున్నారు. పార్టీకి ఎవరూ లేని సమయంలో బీజేపీలో చేరి పోటీ చేసి.. ఎంపీగా గెలిచానని సోయం బాపూరావు అంటున్నారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని.. పార్టీ మారిపోవడానికి సిద్ధమని ఆయన అంటున్నారు. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ ను బీజేపీ బరిలోకి దించింది. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఢిల్లీకి పిలిపించి ఆయనకు కేంద్ర నేతలతో కాషాయ కండువా కప్పి ఎన్నికల బరిలోకి దించారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డిని నల్గొండ ఎంపీ బరిలో దించారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సైదిరెడ్డి కమలం పార్టీలో చేరిన మూడు రోజులకే టికెట్ దక్కించుకున్నారు.
బీజేపీ మొదటి జాబితాలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు .. బీజేపీ అభ్యర్థులుగా ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దించారు. మొదటి జాబితా ప్రకటించడానికి ముందు నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిపోయారు. వారికి టిక్కెట్లు ఇచ్చేశారు. పోతుగంటి రాములు కుమారుడికి చాన్సిచ్చారు. భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మల్కాజిగి నుంచి ఈటల రాజేందర్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, , చెవేళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాస్త అటూఇటూగా ఫిరాయించి పార్టీలోకి వచ్చిన వారే. బండి సంజయ్ , కిషన్ రెడ్డి మాత్రమే బీజేపీని అంటి పెట్టుకుని ఉన్నారు. మిగతా అంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. రెండో జాబితాతో కలిసి మొత్తం తెలంగాణలో పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి ఖమ్మం నియోజకవర్గం కాగా.. మరొకటి వరంగల్ నియోజకవర్గం. ఈ రెండింటిలోనూ ఫిరాయింపు దార్లకే చాన్సివ్వనున్నారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఇటీవల పార్టీలో చేరిన జలగం వెంకట్రావు లేదా కొత్తగా చేరే నేతకు టిక్కెట్ ఇస్తారు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేరు ప్రచారంలో ఉంది. అంటే ఆ రెండు సీట్లు కూడా ఫిరాయిపు దారులకే ఇస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ రాజకీయ మార్పులతో గతంలోనే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్రస్థుతం మాజీ కాంగ్రెస్ నాయకురాలైన డీకే అరుణను ఎన్నికలబరిలోకి దించారు. దీంతో మరో సీనియర్ నాయకుడైన జితేందర్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. మెదక్ పార్లమెంటు బరిలో మాజీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావును దించారు. రఘనందన్ రావు గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి, ఆపై బీజేపీ తీర్థం స్వీకరించారు. పెద్దపల్లి పార్లమెంట్ బరిలో బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ ను రంగంలోకి దించారు. ఆయన బీఆర్ఎస్ లో మండల స్థాయి నేత. మొత్తం మీద బీజేపీ ఇతర పార్టీల్లో బలమైన అభ్యర్థులకు కాషాయ కండువా కప్పి వారికే బీజేపీ టికెట్లు ఇవ్వడంపై కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
సొంత పార్టీ నేతలపై ఎందుకు నమ్మకం పెట్టుకోవడం లేదనేది.. రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తున్న ప్రశ్న. ఇలాంటి పరిస్థుతుల్లో తము పని పనిచేయడం అవసరమా అన్న్ భావన కలుగుతోంది. పార్టీలో చేరే వారు ప్రజా నేతలా అంటే కానే కాదన్న వాదన ఉంది. కేవలం బీఆర్ఎస్ లో కొన్ని పదవులు అనుభవించడమే వారి ప్లస్ పాయింట్. అంత మాత్రానే సీట్లు ఇచ్చేస్తారా ?. ఇలా వచ్చిన వారు పార్టీని అంటి పెట్టుకుని ఉంటారా? అని క్యాడర్ నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం లేకుండా పోతోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…