అంతా అనుకూలమే..ఐనా-BJP TELANGANA-DHARMAPURI ARAVINDH-MP-ELECTIONS

By KTV Telugu On 27 February, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో బీజేపీ పరిస్థితేమిటి.ఈ సారి ఎంపీ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు.. సిట్టింగులు ఖచితంగా  విజయం సాధిస్తారా.  జనంలోనే ఉండే లోక్ సభ సభ్యులు ఎందుకు  గట్టెక్కలేరు. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు రోజువారీ వినిపిస్తున్నాయి. అందులోనూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విషయంలో ఇప్పుడు ఒక  పక్క ఆత్మవిశ్వాసం, మరో పక్క అనుమానమూ కలుగుతున్నాయి….

బీజేపీ హుషారు మీదుంది. ఎక్కడా దూకుడును  బయటకు కనిపించనివ్వకుండా చాపకిందనీరులా పనికానిచ్చేస్తోంది. ఇతర పార్టీలు ఆలోచనలో పడి ఉండగానే గుట్టు చప్పుడు కాకుండా ఎన్నికల శంఖారావాన్ని  పూరించేసింది. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కసరత్తు కొనసాగుతుండగానే కొందరు అభ్యర్థుల విషయంలో స్పష్టత రావడంతో వారు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ప్రచారం  చేసుకుంటున్నారు. పైగా నలుగురు సిట్టింగులకు టికెట్ ఖాయమని సంకేతాలు అందడంతో వాళ్లు ప్రజల్లో ఉండేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. అందులో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముందు వరుసలో ఉన్నారని చెప్పక తప్పదు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. తన ప్రత్యర్థులెవరో ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ అందరికన్నా ముందే కార్యక్షేత్రంలోకి దిగారు.  ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రచార వ్యూహాలకు సంబంధించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి అప్రస్తుతమన్నది అర్వింద్ వాదన. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్ సభ పోరు వేరన్నది ఆయన ఆలోచనా విధానం. గత ఎన్నికల్లోనూ అదే అంశం నిరూపితమైన వేళ.. నిజామాబాద్ లోక్ సభా పరిస్థితులపై ఆయన పూర్తి అవగాహనకు వచ్చారు. పైగా ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహిత ఎంపీల్లో ఆయన కూడా ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐనా రాష్ట్రంలోని  పరిస్థితులు ఆయనకు అనుకూలిస్తాయా అని చెప్పలేకపోతున్నారు. ఏదో వెలికి కనిపిస్తోందని బీజేపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ సాధించిన ఫలితాలు పార్టీ ఢిల్లీ  పెద్దలను సంతృప్తి పరిచాయి. అంచనాల కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు రావడంతో ఎంపీ ఎన్నికలపై ఆశలు పెరిగాయి. కోరుట్లలో పోటీ చేసిన అర్వింద్ ఓడిపోయినప్పటికీ  నిజామాబాద్ అర్బన్ లో ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ లో పైడి రాకేష్ రెడ్డి విజయం సాధించారు. నిజామాబాద్ రూరల్ లో దినేష్ కులాచారి, బోధన్ లో మోహన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఓవరాల్ గా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుపొంది, మూడు లక్షలకు పైగా ఓట్లు సాధించడంతో బీజేపీ గ్రాఫ్ పెరిగింది. వాస్తవానికి  ఏడు అసెంబ్లీ స్థానాల్లో అర్వింద్ సూచించిన వారికే టికెట్లు వచ్చాయి. ఆయన అనుచరులే బరిలోకి దిగారు. దీంతో వచ్చిన ఫలితాలకు సంబంధించిన క్రెడిట్ కూడా అర్వింద్ కే దక్కింది.  ఈ క్రమంలోనే పార్టీలో సంస్థాగత మార్పులు కూడా చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిని మార్చేశారు. బస్వా లక్ష్మీనర్సయ్య ను తొలగించి తన ప్రధాన అనుచరుడు దినేష్ కులాచారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అనేక మంది సీనియర్లను కాదని ఈ మధ్యే పార్టీలో చేరిన దినేష్ కు జిల్లా సారథ్యం అప్పగించడంపై ఎవరేమన్నా అర్వింద్ పట్టించుకోలేదు. మరో వైపు  ఎన్నికల్లో ప్రభావం చూపే కుల సంఘాలతో భేటీ అవుతున్నారు.  ముఖ్యంగా  పసుపు బోర్డు సాధించడంతో అర్వింద్ ను టార్గెట్ చేయడానికి రాజకీయ ప్రత్యర్థులు మరో మార్గం వెదుక్కోవాల్సి వస్తోంది.ఐతే స్థూలంగా  రాష్ట్రంలో పరిస్థితులు అర్వింద్ కు అనుకూలించకపోవచ్చన్న చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజారంజక పాలన అందిస్తోందన్న మంచిపేరు తెచ్చుకుంది. ఆరు గ్యారెంటీలు అమలు దిశగా  వేస్తున్న అడుగులు కాంగ్రెస్ పార్టీకి సరికొత్త ఆక్సిజన్ ఇచ్చాయి. మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి నిర్ణయాలు గ్రామాల్లో కాంగ్రెస్ పట్ల అభిమానాన్ని పెంచాయి. దానితో అర్వింద్ కు ఈసారి బీఆర్ఎస్ కంటే.. కాంగ్రెస్ నుంచే ముప్పు ఉందని అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని బట్టి అర్వింద్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని విశ్వసిస్తున్నారు. మరో పక్క గత ఎన్నికల్లో ఓడిపోయిన కల్వకుంట్ల కవిత.. ఈ సారి నిజామాబాద్ ఎంపీ బరిలోకి దిగితే ముక్కోణ పోటీ రసవత్తరంగా ఉంటుందని చెబుతున్నారు..

ఈసారి ఎన్నికలపై అర్వింద్ కు చాలా ఆశలే ఉన్నాయి. గెలిస్తే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందన్న విశ్వాసమూ ఆయనలో కనిపిస్తోంది. అధిష్టానం వైపు  నుంచి అలాంటి సంకేతాలే వస్తున్నాయి. ఢిల్లీ పెద్దల్లో కూడా ఆయన పట్ల నమ్మకం ఉంది. అయితే కనీసం బొటాబొటీ మెజార్టీతోనైనా గెలుస్తారా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి