కాంగ్రెస్ ప్లేస్‌లో బీజేపీ ఉండాల్సింది అని కరీంనగర్‌లో స్వల్ప తేడాతో బండి సంజయ్ పరాజయం పాలైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్ ప్లేస్ లో అంటే.. అధికార పార్టీగా ఉండేదని ఆయన అభిప్రాయం. బీజేపీ హైకమాండ్ ఆయనను చీఫ్‌గా తీసేయకుండా… కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు చేసి ఉంటే అదే జరిగి ఉండేదని రాజకీయ పండితుల అంచనా. బండి సంజయ్ కూ అదే అనిపిస్తోంది. కాస్త పరిశీలించి చూస్తే… ఎలాంటి బీజేపీ ఎలా ఎదిగింది… ఎలా ఒరిగింది అని జాలి చూపిస్తున్నారు. ఇదంతా హైకమాండ్ కావాలని చేసిందేమో అని కూడా మథనపడుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. 2018లో కేవలం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. అది కూడా గోషామహల్ నియోజకవర్గంలో . ఇప్పుడు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మరో ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో కామారెడ్డి కూడా ఉండటం ఆ పార్టీకి ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇవి మెరుగైన ఫలితాలే కానీ అసలు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పొజిషన్ లో బీజేపీ ఉండాలని.. చారిత్రక అవకాశాన్ని స్వయం తప్పిదాలతో కోల్పోయామని ఆ పార్టీ నేతలు మథనపడుతున్నారు.
బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ చీఫ్‌గా తొలగించక ముందు బీజేపీ దూకుడు మీద ఉండేది. బీఆర్ఎస్‌తో తాడోపేడో తేల్చుకునే పార్టీగా అందరూ భావించేవారు. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి త్రిముఖ పోరులో కూడా లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముఖాముఖి పోరుకు గ్రౌండ్ వదిలేసి పక్కకు వెళ్లిపోయింది. అధికారం కోసం పోటీ పడాల్సిన కీలక పొజిషన్లో ఉండాల్సిన పార్టీ ఎన్నికల నాటికి దిగజారిపోయింది. 2018లో ఘోర పరాజయంతో ప్రారంభమైన బీజేపీ .. ఆ తర్వాత ఎంతో ఉన్నతిని చూసింది. తీరా అసలు యుద్ధంలో మాత్రం.. తేలిపోయింది. ఆ పార్టీని ఎవరో తొక్కేయలేదు. ఆ పార్టీ నేతలే తొక్కేశారు. దక్షిణాది రాజకీయాలను అర్థం చేసుకోవడంలో బీజేపీ అగ్రనేతలు విఫలమయ్యారా లేకపోతే ఢిల్లీ రాజకీయాల కోసం వ్యూహాత్మకంగా కావాలనే ఆ పార్టీ ఎదుగుదలను నియంత్రించారా అన్నది వాళ్లకే తెలియాలి.
బీజేపీ పెద్దలకు దక్షిణాది రాష్ట్రాల రాజకీయం అర్థం కాలేదేమోనని తెలంగాణ బీజేపీ విషయలో వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎవరికైనా అనిపిస్తుంది. లక్ష్మణ్ నేతృత్వంలో 2018లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ పరువు పోయింది. 110 నియోజవర్గాల్లో డిపాజిట్లు రాలేదు. గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. కానీ పార్లమెంట్ ఎన్నికల నాటికి కోలుకున్నారు. అనూహ్యమైన ఓటు బ్యాంకుతో పాటు నాలుగు పార్లమెంట్ సీట్లు గెల్చుకున్నారు. ఐదు నెలల్లోనే ఇలా ఎలా కం బ్యాక్ అయ్యారని రాజకీయవర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. రాష్ట్ర నేతల పోరాటానికి మోదీ ప్రజాకర్షణ తోడయిందనుకున్నారు.
బండి సంజయ్ ను చీఫ్‌గా నియమించిన తర్వాత ఇక దూకుడు అంటే ఏమిటో ఆ పార్టీ చూపించింది. వివాదాస్పద ప్రకటనలతో అయినా సరే కేసీఆర్ ను బండి సంజయ్ ఎదుర్కున్నారు. కేసీఆర్‌కు సరైన ప్రత్యర్థి బండి సంజయ్ అనే పరిస్థితి వచ్చింది. ఆయన బీఆర్ఎస్ సర్కార్ పై రాజీలేని పోరాటం చేశారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికి బీజేపీ చాయిస్ అయిపోయింది. బండి సంజయ్ పాదయాత్రతో బీజేపీ మరింత బలపడింది. దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచారు. గ్రేటర్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల సాధించారు.
కానీ చేరికలతో సైడ్ ఎఫెక్టచులు రావడంతో మొత్తం డిస్టర్బ్ కావడం ప్రారంభమయింది. బీఆర్ఎస్ నుుంచి గెంటేయడంతో ఈటలను చేర్చుకుంది. తమ పార్టీ నేతలందరి కన్నా ఆయనను గొప్పనేతగా ప్రొజెక్ట్ చేసుకోవడంతో సంప్రదాయ బీజేపీ నేతలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. హైకమాండ్ కూడా ఈటలకే ప్రాధాన్యం ఇచ్చింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని రాజకీయ నేతలందరూ నమ్మడంతో చేరికలు పెరిగాయి. కానీ అంతర్గత విబేధాల కారణంగా తర్వాత పరిస్థితి రాను రాను క్షీణించడం ప్రారంభించింది. బండి సంజయ్ కు ప్రాధాన్యం తగ్గించారు. చివరికి ఊహించరని రీతిలో ఆయనను పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి బాధ్యతలిచ్చారు. ఇది ఒక్క సారిగా నెగెటివ్ ప్రచారానికి కారణం అయింది. బీఆర్ఎస్ కోసమే ఇలా చేశారని ప్రజలు నమ్మడంతో అసలు పతనం ప్రారంభమయింది.
కిషన్ రెడ్డి, ఈటలకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత చేరికలు లేకపోగా ఉన్న వారు వెళ్లిపోయారు. అతి కష్టం మీద కొంత మంది సీనియర్లను నిలుపుకున్నా… ఇక నుంచి వారు కూడా ఉంటారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీకే వారు మొగ్గుచూపలేదు. ఫలితాల తర్వాత వారు పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదు.
తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలంతా ఓడిపోయారు. నియోజకవర్గాల్లో పని చేసుకున్న కొంత మంది నేతలు మాత్రం గెలుపొందారు. ప్రస్తుత సీఎం కేసీఆర్‌ను.. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. కానీ ఎంపీలుగా గెలిచిన ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాపూరావు పరాజయం పాలయ్యారు. ఈటల రాజేందర్ ను రెండు చోట్ల పోటీ చేయించారు. రెండు చోట్ల ఓడిపోయారు. హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి గెలిచారు. ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఓట్లన్నీ ఆయనకే పడ్డాయి. కానీ ఈ సారి హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థికి యాభై వేల ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన పరాజయం పాలవ్వాల్సి వచ్చింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ సీట్లు వచ్చాయి కానీ బీజేపీ బలపడి కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం.
మరెక్కడా బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్ పరిధిలో యాభై వరకూ డివిజన్లలో విజయం సాధించినా… అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. స్వయంగా అంబర్ పేట నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో ఉన్నారు. అక్కడ కిషన్ రెడ్డి పోటీ చేయాల్సి ఉంది. పరిస్థితి తెలుసు కాబట్టే అయన తప్పించుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు బీజేపీకి వచ్చిందన్నది ఇక్కడ కీలకం.
టీవీల్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్న సమయంలో మైయాక్సిస్ ఇండియా సంస్థకు చెందిన సెఫాలజిస్ట్ ఒకరు తెలంగాణలో బీజేపీ పరిస్థితిని విశ్లేషించారు. బండిసంజయ్ ను అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే.. అధికారానికి ప్రధాన పోటీ దారుల్లో ఒకటిగా బీజేపీ ఉండేదన్నారు. ఈ విషయంపై ప్రజల్లోనూ స్పష్టత ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా.. బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తీసుకు వచ్చారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో వేలు పెట్టారు. జనసేనతో పొత్తు కోసం వెంపర్లాడారు. అన్నీ ఏ మాత్రం ఉపయోగపడని వ్యూహలేనని రుజవయ్యాయి. తెలంగాణ బీజేపీ ప్రస్థానం చూస్తే…. పెరుగుట విరుగుట కొరకే అని నిరూపించింది. పెరిగింది కానీ నిలబెట్టుకోలేకపోయింది. విరిగిపోయింది. దీనికి ఆ పార్టీ స్వయంకృతమే కారణం. సాధారణంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఓడించుకుంటుందని సెటైర్లు వేస్తారు.. కానీ తెలంగాణలో బీజేపీని మాత్రం.. .బీజేపీనే ఓడించుకుంది.. అలా ఇలా కాదు.. ఎవరూ ఊహించనంత ఘోరంగా పార్టీని బీజేపీ హైకమాండ్ ఓడించుకుందని అనిపిస్తే అందులో విచిత్రం ఏమీ ఉండదు.తెలంగాణలో ఓ రాష్ట్రంలో అధికారంలో ఉండే గొప్ప అవకాశాన్ని బీజేపీ కోల్పోయింది. దీనికి హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలే కారణం. మరి వచ్చే ఎన్నికలకైనా బీజేపీని ఎదగనిస్తారా జాతీయ రాజకీయాల కోసం అలా ఉంచేస్తారా అన్నది చూడాల్సి ఉంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…