కారెక్కనున్న కమలనాథులు ?

By KTV Telugu On 28 December, 2023
image

KTV TELUGU :-

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు  మారుతున్నాయా.. పొత్తులు లేకుండా లోక్ సభ ఎన్నికల్లో  లబ్ధి పొందడం సాధ్యం కాదా.. ఆ క్రమంలో బీఆర్ఎస్ పెద్దలు లోక్ సభకు  పోటీ చేయడమే కాకుండా.. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారా.. తాజా సర్వేలు అనుహ్య ఫలితాలను ఇవ్వడంతో గులాబీ  దళపతి పూర్తిగా వ్యూహం మార్చేశారా….

ఒక సర్వే సంస్థ బీఆర్ఎస్ – బీజేపీ లోక్ సభ ఎన్నికల పొత్తుకు బీజం వేసిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా సీ ఓటర్ ఒక సర్వేను ప్రచురించింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి మూడు లోపు, బీఆర్ఎస్‌కు నాలుగైదు సీట్లు వస్తాయని  కాంగ్రెస్‌కు పది ప్లస్ వస్తాయని సీఓటర్ సంస్థ వెల్లడించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితానే తీసుకుని విశ్లేషణ చేస్తే ఇదే రిజల్ట్ వస్తుంది. ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు కానీ.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అదేమిటంటే..  బీఆర్ఎస్, బీజేపీకి కలిసి పోటీ చేస్తే పధ్నాలుగు సీట్లు వచ్చేలా స్వీప్ చేస్తారని సీఓటర్ సంస్థ వెల్లడించింది.పైగా   లోక్ సభ ఎన్నికల విషయంలో బీజేపీ చిన్న నిర్లక్ష్యానికి కూడా చాన్సివ్వడం లేదు.  అన్ని రాష్ట్రాల్లోనూ గట్టి పట్టుతో ప్రయత్నిస్తోంది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉంది.ఓటర్లతో ఆ పార్టీకి హనీమూన్ నడుస్తోంది.  మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే.. అధికార పార్టీకి అడ్వాంటేజ్.. కొత్త మోజు  కాంగ్రెస్ కు లాభిస్తుంది. అందుకే.. బీఆర్ఎస్, బీజేపీ కలయికపై చర్చ ప్రారంభమయింది.

మాజీ సీఎం  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్సతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని అనుకుంటున్నారు. అది చాలా తప్పుడు అభిప్రాయం అనుకోవాలి. ప్రస్తుతం ఆయన  ఇంట్లో పడుకుని వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో  పోగొట్టుకున్న పరువును లోక్ సభ ఎన్నికలతో పూడ్చుకోవాలని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. మరోసారి కాంగ్రెస్ ను పైచేయిగా నిలిచే అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పూర్తిగా  పడుకోవాల్సిన వస్తుందని కూడా కేసీఆర్ కు తెలుసు..

పొత్తులు  చాప కింద నీరులా విస్తరిస్తుంటాయి. బీఆర్ఎస్ – బీజేపీ స్నేహం కూడా అదే రూటులో రావచ్చు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దక్షిణాదిలో బీజేపీకి అనుకున్నదానికంటే ఎక్కువ సీట్లు రావాలంటే ఏదోక  పార్టీతో పొత్తు అనివార్యమవుతుంది. ఏపీలో  ఎలాగూ జనసేన ఉంది. తమిళనాడులో అన్నాడీఎంకేతో  తెగదెంపులు చేసుకున్నట్లు భావిస్తున్నా…. మళ్లీ ఒకటయ్యే ఛాన్స్ ఉంది. దానితో ఇప్పుడు తెలంగాణ విషయంలో  బీఆర్ఎస్ వైపే కమలం పార్టీ నేతలు చూస్తున్నారు. అవసరమైతే కారేక్కేందుకు సిద్దమవుతున్నారు. పైగా తెలంగాణలో కాంగ్రెస్ బలపడటం బీజేపీకి ఇష్టం లేదు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అతి తక్కువ స్థానాలకు పరిమితం చేయగలిగితే… ఆ పార్టీని నైతికంగా దెబ్బకొట్టి..వారిలోని విభేదాలను బయట పడెయ్యొచ్చన్న  అభిప్రాయం బీజేపీలో ఉంది. అందుకే బీఆర్ఎస్  తో పొత్తుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అన్ని జాతీయ ప్రయోగాలను కొన్ని రోజులు పక్కన పెట్టి బీజేపీతో చెట్టాపట్టాలేసుకునేందుకు సిద్ధమవుతోంది. అందుకే కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని కేసీఆర్ తనయ కవిత ఇటీవల వ్యాఖ్యానించినట్లుగా  చెబుతున్నారు. గతంలో కూడా ఎన్డీయేలో చేరేందుకు  బీఆర్ఎస్ ప్రయత్నించినట్లు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు.  దీన్ని కేటీఆర్, కవిత ఖండించినప్పటికీ కేసీఆర్ పల్లెత్తు మాట అనలేదు.అన్ని లెక్క చూసుకుని లోక్ సభ ఎన్నికల నాటికి  పొత్తు కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. బీజేపీ హైకమాండ్ నుంచి ప్రదిపాదన రావాలని  కేసీఆర్ ఎదురు చూస్తున్నట్లు, అప్పుడు బెట్టు  చేసి – పట్టు విడుపులు పాటించి అయిష్టంగా ఒప్పుకున్నట్లు ఆయన కలరింగ్ ఇవ్వాలని భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.పైగా పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు విపక్షంలోకి రావడం వల్ల ఏదోక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల్సిన అనివార్యత ఉందని కేసీఆర్ కు కూడా తెలుసు. అది బీజేపీ అయితే  బావుంటుందని బీఆర్ఎస్ విశ్వసిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబంపైనా, బీఆర్ఎస్ మాజీ మంత్రులపైనా విచారణలు జరిపేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్  ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ వత్తిడి నుంచి బయటపడి, కాంగ్రెస్ దూకుడును అడ్డుకోవాలంటే కమలనాథుల చేయి పట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదీ ఒక రకంగా మ్యారేజీ ఆఫ్ కన్వీనియన్స్ అని చెప్పాలి…

బీఆర్ఎస్ అధినేత  మదిలో ప్లాన్ బీ కూడా ఉందని చెబుతున్నారు. తాను స్వయంగా లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నారు. సిద్ధిపేట స్ట్రాంగ్ మేన్  హరీష్ రావును కూడా కేంద్రానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 90 శాతం బీజేపీతో పొత్తు  వైపే అడుగులు వేయాలనుకుంటున్నారు. మిగతా పది శాతం ఒంటరి పోరుకు రెడీ అవుతున్నారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిన కొందరికి ఎంపీ టికెట్లిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు..

అసెంబ్లీ ఎన్నికల జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను సైతం ఖరారు చేసే పనిలో పడిపోయింది. మల్కాజ్ గిరి స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావును పోటీ చేయించాలనుకుంటున్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మికి భువనగిరి టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు. రాజగోపాల్ కు  మంత్రి పదవి ఇవ్వలేని  పరిస్తితుల్లో ఈ విధంగా సంతృప్తి  పరిచే ప్రయత్నం జరుగుతోంది. సికింద్రాబాద్ సీటుకు యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఖరారైనట్లు సమాచారం.ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఓడించగలరన్న నమ్మకం పార్టీ పెద్దల్లో కలిగిందట. హైదరాబాద్లో అసదుద్దీన్ ఒవైసీపై పై క్రికెటర్ అజారుద్దీన్ లేదా ఫీరోజ్ ఖాన్ ను బరిలోకి దించాలనుకుంటున్నారు. మరో పక్క బీజేపీ నిజామాబాద్  ఎంపీ అర్వింద్ పై ఆయన సోదరుడు సంజయ్ ను నిలబెట్టాలని  కూడా చర్చ  జరుగుతోంది. పోటీకి సంజయ్ నిరాకరిస్తే ఎమ్మెల్సీ జీవన్  రెడ్డిని రంగంలోకి దించుతారు. రేవంత్ రెడ్డికి  సన్నిహితుడైన మల్లు రవిని… నాగర్ కర్నూలు నుంచి బరిలోకి దించుతారని భావిస్తున్నారు. ఏఐసీసీ సెక్రటరీ వంశీ చంద్ రెడ్డిని మహబూబ్ నగర్ నుంచి బరిలోకి దించుతారని చెబుతున్నారు. మెదక్ నుంచి విజయశాంతి పోటీ చేసే అవకాశం ఉంది.  ఖమ్మం నుంచి రేణుకా చౌదరి  పేరు ఖాయమైనట్లేనని భావిస్తున్నారు. ఈ పేర్లు బాగా ప్రచారమవుతున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ ఎంతో జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేయాల్సి ఉంటుంది. మెదక్ నుంచే  కేసీఆర్ పోటీ  చేయాలని నిర్ణయించుకున్నారట. విజయశాంతి కాదు… సోనియా స్వయంగా వచ్చి పోటీ చేసినా మెదక్లో గులాబీ బాస్ ను ఓడించలేరని ఆయన  పార్టీ వర్గాలు అంటున్నాయి. కేటీఆర్, హరీష్ రావు మధ్య కీచులాట పెరిగిందని వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో ఎలాంటి పేచీ లేకుండా మేనల్లుడిని ఢిల్లీలో కూర్చోబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ క్రమంలో కరీంనగర్  లేదా మరో లోక్ సభా స్థానం నుంచి హరీష్ రావును పోటీ చేయించాలని భావిస్తున్నారు. నిజానికి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. కమలం పార్టీతో పొత్తు కుదిరినపక్షంలో కరీంనగర్  సీటును ఆ పార్టీకి  వదిలేసి హరీష్ రావును జహీరాబాద్ లేదా మరో స్థానం నుంచి పోటీ చేయిస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. కల్వకుంట్ల కవిత  నిజామాబాద్ నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది.బీజేపీతో పొత్తు ఉంటే మాత్రం కవితకు లోక్ సభ అవకాశం ఉండదని కూడా వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బాల్క సుమన్ ను పెద్దపల్లి లోక్ సభా స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. 2014లో ఆయన పెద్దపల్లి నుంచి గెలిచారు. 2019లో చెన్నూరు అసెంబ్లీ స్థానంలో గెలిచి ఈ సారి ఓడిపోయారు. కాంగ్రెస్ తరపున పెద్దపల్లిలో జీ.వివేక్  కుమారుడు గడ్డం వంశీ పోటీ చేస్తారని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓడిపోయిన కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్  రెడ్డి….ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కందాల ఉపేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ అంతమందికి అవకాశాలు ఎక్కడ నుంచి ఇవ్వాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ఖమ్మం నుంచి ఈ సారి కూడా నామానాగేశ్వరరావుకే చాన్స్ దక్కుతుందని చెబుతున్నారు.

ఏదేమైనా మరో ఐదేళ్లు  చేతులు ముడుచుకు కూర్చునేందుకు బీఆర్ఎస్ అధినేత సిద్దంగా లేరు. రాజకీయం క్రియాశీలంగా ఉండాలన్నా పార్టీని కాపాడుకోవాలన్నా ఎన్నికల్లో గెలిచి  తీరాల్సిందేనని  కేసీఆర్ డిసైడయ్యారు. ఈ క్రమంలో లోక్ సభ బరిలోకి ఆయన స్వయంగా దిగుతున్నారు. అందుకే బలాబలాలను బేరీజు వేసుకుని  బీజేపీతో పొత్తుకు సైతం సిద్ధమవుతున్నారు.. బీజేపీకి కూడా రాజకీయ అవసరాలున్నాయి కదా. చూడాలి మరి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి