తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ మీద కేసీఆర్ ఎదురు దాడి చేస్తుంటే కేసీఆర్‌కు జలక్ ఇవ్వడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ రెండు పార్టీల సమరానికి ఖమ్మం జిల్లా వేదికగా మారింది. ఈ నెల 18న ఖమ్మం నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించి తన ఉనినికి చాటుకోవాలని అనుకున్నారు. కానీ ఢిల్లీకి బదులుగా ఈనెల 18న ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానిస్తున్నారు. సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానాలు పంపించారు.
అయితే సరిగ్గా ఆవిర్భావ సభ నేపథ్యంలోనే ఖమ్మంలో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుల్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతకాలంగా కేసీఆర్ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీని వీడతారని చాలారోజులుగా ప్రచారం జరుగుతోంది. దాంతో ఇటీవల ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీని తగ్గించింది. ఆ విధంగా మాజీ ఎంపీకి పొమన్నలేక పొగబెట్టినట్లయింది. ఇక పొంగులేటి బిజెపిలో చేరడం కన్ఫర్మ్ అయింది. ఈనెల 18 న ఆయన అమిత్‌షాతో సమావేశం కాబోతున్నారు. ఆ వెంటనే తన వర్గీయులతో సహా కాషాయ కండువా కప్పుకుంటారు.
మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా కేసీఆర్‌పై అసంతృప్తిగా ఉన్నారు.
2018లో ఆయన పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే తనపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఆ తరువాత బీఆర్ఎస్లో చేరిపోయారు. మళ్లీ పాలేరు నుంచి తానే పోటీ చేస్తానని వార్ వన్‌సైడ్ అని ప్రకటించారు కందాల. దాంతో తుమ్మలకు పాలేరు లో దారి మూసుకుపోయినట్లయింది. ఆయన కూడా బీఆర్ఎస్ను వీడిపోయే ఆలోచనతో ఉన్నారు. ఇదే అదనుగా బీజేపీ అలర్ట్ అయింది. పొంగులేటిని తుమ్మలను పార్టీలో చేర్చకుని చేర్చుకుని కేసీఆర్‌కు జలక్ ఇవ్వడానికి రెడీగా ఉంది.