ప్రతీపార్టీలో కొందరుంటారు. తాము పట్టిన కుందేలుకి మూడేకాళ్లంటారు. కాలం కలిసొస్తే ఎక్కడో ఉండాల్సినవాళ్లం ఇక్కడే ఉండిపోయామని బాధపడుతుంటారు. తెలంగాణ కాంగ్రెస్‌పార్టీలో అలాంటివాళ్లు కొందరేం ఖర్మ చాలామందున్నారు. వారిలో నా దారి రహదారి అంటుంటారు భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎంతచెడ్డా సీనియర్ లీడర్. నాలుగు డబ్బులున్నోడు. అందుకే ఎన్నిసార్లు దొరికిపోతున్నా నాలుగ్గోడల మధ్య చీవాట్లతోనే వదిలేస్తోంది కాంగ్రెస్ అధినాయకత్వం. ఇప్పటికే పార్టీలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లంతా ఒక్కరయ్యారు. పార్టీ రేవంత్‌వర్గం పాత కాంగ్రెస్ వర్గంగా చీలిపోయింది.
రేవంత్ వచ్చాక పార్టీ స్పీడ్ పెరిగింది. అదే సమయంలో ఎప్పుడూ లేనంతగా చీలిపోయింది. చివరికి సీనియర్లను సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ హైకమాండ్ స్టేట్ ఇంచార్జిని కూడా మార్చేసింది. అయినా కోమటిరెడ్డి లాంటివారు నోటికొచ్చింది మాట్లాడుతూ కొంప ముంచుతున్నారు. ఆమధ్య పాదయాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్‌గాంధీ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ పార్టీతో పొత్తుండదని యువనేత చెప్పాకకూడా ఏమో గుర్రం ఎగురావచ్చు అంటున్నారు కోమటిరెడ్డి. ఈసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ లెక్కలేసుకుంటుంటే ఏపార్టీకీ 60కి మించి సీట్లు రావని కోమటిరెడ్డి బాంబుపేల్చారు. అంటే ఆయన లెక్కలో కాంగ్రెస్ ఎంత దేకినా ఆ ఫిగర్ మించదన్నమాట.
బీఆర్ఎస్ ఎలాగూ బీజేపీతో కలవలేదు. ఇక ఎన్నికలతర్వాత కేసీఆర్-కాంగ్రెస్ దోస్తీ అనివార్యమన్నది కోమటిరెడ్డి సూత్రీకరణ. జరిగితే జరగొచ్చేమో. ఎన్నికల తర్వాత సమీకరణాలు ఎలా ఉంటాయో చెప్పలేం. కానీ తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లు కోమటిరెడ్డి ఏడాదిముందే వాగేయటంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి బలమైన పాయింట్ దొరికింది. బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒకే తాను ముక్కలంటోంది కమలంపార్టీ. ఆ రెండు పార్టీల అనైతికబంధం బయటపడిందంటోంది. తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్‌కే హ్యాండ్ ఇచ్చారు కేసీఆర్. అలాంటిది ఆయన పార్టీకి అనుకూలంగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ కొంపముంచే వ్యవహారమే. అబ్బే నేనలాఅనలేదని తర్వాత కోమటిరెడ్డి ఎంత గింజుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.