పంచ పాండవులు మంచం కోళ్లవలే ముగ్గురే అని రెండు వేళ్లు చూపించబోయి ఒక్క వేలు చూపించాడట వెనకటికో పిచ్చి పుల్లయ్య. తెలంగాణాలో వైద్య కళాశాలల పంచాయతీ అలానే ఉంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణాకు అన్ని రంగాల్లోనూ అన్యాయం చేస్తోందని బి.ఆర్.ఎస్. నిప్పులు చెరుగుతోంది. వైద్యకళాశాల కేటాయింపులోనూ కేంద్ర వైఖరిపై ధ్వజమెత్తింది. అయితే దానిపై కేంద్రం వివరణకు రాష్ట్రం వాదనకు మధ్య పొంతనే కుదరడం లేదంటున్నారు మేథావులు.
అసెంబ్లీ ఎన్నికలు తరుముకు వస్తోన్న తెలంగాణాలో పాలక బి.ఆర్.ఎస్. పార్టీ దూకుడు పెంచింది. బి.ఆర్.ఎస్. కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసుకుంటోన్న బిజెపిని డిఫెన్స్ లో పడేసేలా బి.ఆర్.ఎస్. వ్యాఖ్యలు చేస్తోంది. తెలంగాణా రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏ విషయంలోనూ న్యాయం చేయడం లేదని ముఖ్యమంత్రి కేసీయార్ పదే పదే ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని కేసీయార్ దుయ్యబట్టారు. బిజెపి పాలనతో పోలిస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే పదేళ్ల పాలనలోనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టిందని కేసీయార్ కొనియాడారు. ఇదంతా కాంగ్రెస్ తో సీక్రెట్ డీల్ కోసమేనని బిజెపి ఆరోపించింది. దాన్ని బి.ఆర్.ఎస్. ఖండించింది కూడా.
తాజాగా తెలంగాణాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు సంబంధించి రచ్చ నడుస్తోంది. తెలంగాణాలో కొత్త వైద్య కళాశాలలు కేటాయించాల్సిందిగా తాము ఎన్ని సార్లు విన్నవించుకున్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించకుండా తెలంగాణ ప్రజలను నిలువునా ముంచిందని బి.ఆర్.ఎస్. మండిపడుతోంది.
దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ బి.ఆర్.ఎస్. నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణాకు ఏకంగా 9 మెడికల్ కాలేజీలు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా ఇవ్వలేదనడం విడ్డూరంగా ఉందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పదే పదే వంచిచండం అలవాటు అయిపోయింది కాబట్టే బి.ఆర్.ఎస్. నేతలు పచ్చి అబద్ధాలతో కాలక్షేపం చేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీయార్ ట్విట్టర్ లో ఆసక్తికర పోస్టు ఒకటి పెట్టారు.
తెలంగాణాకు 9 మెడికల్ కాలేజీలు ఇచ్చామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. మెడికల్ కాలేజీలకు సంబంధించి తెలంగాణా నుండి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని మరో కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ వ్యాఖ్యానించారు. ఇక ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే తెలంగాణా నుండి రెండు ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయని అంటున్నారని కేటీయార్ వివరించారు. మరి ఈ ముగ్గురు కేంద్ర మంత్రుల్లో ఎవరి మాటల్లో నిజం ఉందో వారే తేల్చుకోవాలన్న కేటీయార్ ఒక్క కాలేజీ ఇవ్వకపోయినా 9 కాలేజీలను ఊహల్లో సృష్టించిన కిషన్ రెడ్డి నిజంగానే ఆణిముత్యం అంటూ కేటీయార్ సెటైర్ వేశారు.
భారత ఆర్ధిక వ్యవస్థ ఫైవ్ ట్రిలియన్ మార్క్ టచ్ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన కూడా ఓ జోకే నంటూ కేసీయార్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యనూ తప్పుబట్టారు నిర్మలా సీతారామన్. దాన్ని ప్రస్తావిస్తూ కేసీయార్ తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని తెలంగాణాలో మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా కేసీయార్ కు తెలీదన్నారు సీతారామన్. మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ కావాలో క్లారిటీ ఇవ్వాలని అడిగితే మెడకిల్ కాలేజీలు ఉన్న చోటనే మళ్లీ వైద్య కళాశాలలు కావాలంటూ తలా తోక లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని నిర్మలా సీతారామన్ సెటైర్ వేశారు. బి.ఆర్.ఎస్.-బిజెపిల మధ్య కేవలం మెడికల్ కాలేజీల మధ్యనే వార్ సాగడం లేదు. ఏడాదిన్నరగా ఏదో ఒక అంశంపై రెండు పార్టీల మధ్య యుద్ధం నడుస్తోనే ఉంది. కొంత కాలం వడ్లు కొనుగోలు కోసం యుద్దం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదంటూ బి.ఆర్.ఎస్. నేతలు విరుచుకు పడ్డారు. తెలంగాణా రైతులను ముంచేస్తున్నారంటూ మండి పడ్డారు. అవసరమైతే తామే వడ్లు కొంటామని ప్రకటన చేశారు.
అయితే కేసీయార్ అంతా డ్రామా ఆడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన వివరాలకు అనుగుణంగానే వడ్లు కొనుగోలు చేశామని అప్పట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బి.ఆర్.ఎస్. బిజెపిలు మహాసంగ్రామానికే సై అన్నాయి. ఆ వ్యవహారాలు కోర్టు పరిధిలో ఉన్నాయిపుడు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సృష్టించిన ప్రకంపనలు సాగుతుండగానే ఢిల్లీ లిక్కర్ స్కాం తెరపైకి తెచ్చింది కేంద్రం. డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి తనయ కల్వకుంట్ల కవిత పేరు కూడా ఛార్జ్ షీట్లో ప్రస్తావనకు రావడం విశేషం. రేపో మాపో కవితను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని కవిత స్పష్టం చేశారు. తన తండ్రి కేసీయార్ బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నందునే రాజకీయ కక్షసాధింపుగా తనను ఈ కేసులో ఇరికించారన్నది కవిత ఆరోపణ. తెలంగాణలో బి.ఆర్.ఎస్. కు తామే ప్రత్యామ్నాయమని చాటి చెప్పుకునేందుకు బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
నిజానికి తెలంగాణాలో బి.ఆర్.ఎస్. కు గట్టిపోటీ నిచ్చే స్థితిలో కాంగ్రెస్ ఉంది. అయితే ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలను ఆసరా చేసుకుని కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని తాము కైవసం చేసుకోవాలని కమలనాధులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బి.ఆర్.ఎస్. ను తామే గిల్లి ఆ తర్వాత కజ్జాలు పెట్టుకుంటున్నారని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బి.ఆర్.ఎస్. పై నిత్యం నిప్పులు చెరుగుతున్నారు. చీటికీ మాటికీ రాజీనామా చేస్తానంటూ కేసీయార్ హెచ్చరించడం మానుకోవాలన్న బిజెపి నేతలు కొంత కాలం ఆగితే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. ఎలాగూ ఓడుతుంది కాబట్టి అప్పుడు ఎలాగూ గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించక తప్పదని వారు గుర్తు చేస్తున్నారు. ఈ లోగా రాజీనామా గురించి తొందరెందుకు సార్ అంటూ బిజెపి నాయకులు సెటైర్ వేస్తున్నారు. బి.ఆర్.ఎస్. బిజెపిల మధ్య అన్ స్టాపబుల్ గా సాగుతోన్న వార్ ను కాంగ్రెస్ నిశితంగా గమనిస్తోంది. ఇది నిజమైన యుద్దమేనా లేక రెండు పార్టీలూ కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నాయా అని కాంగ్రెస్ అనుమానిస్తోంది కూడా. తెలంగాణా ప్రజలు మాత్రం టికెట్ లేకుండా మాంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను ఫ్రీగా చూసి ఎంజాయ్ చేస్తున్నారని రాజకీయ పండితులు అంటున్నారు.