కాగల కార్యాన్ని గంధర్వులే కాదు అప్పుడప్పుడు రాజకీయ ప్రత్యర్ధులు కూడా తీరుస్తూ ఉంటారు. తెలంగాణా బిజెపి నేతల విషయంలో జరుగుతోంది అదే. ఎన్నికల ఏడాదిలో బిజెపి నెత్తిన పాలు పోసినట్లు కాంగ్రెస్-బిఆర్ఎస్ లు వ్యవహరించడంతో కమలనాథులు కథకళి డ్యాన్స్ చేసి మరీ పండగ చేసుకుంటున్నారు. అటు కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. లు సెల్ఫ్ గోల్స్ వేసుకుని చేతులు కాల్చుకున్నాయి.
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న తెలంగాణాలో ఎలా పాగా వేయాలా అని బిజెపి చాలా సీరియస్ గా కసరత్తులు చేస్తోంది. ఏడాది క్రితం నుంచే బిజెపి అగ్రనేతలంతా తెలంగాణాలో పర్యటనలు చేస్తూ ఇక్కడి క్యాడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ హోం మంత్రి అమిత్ షాలతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణాపై స్పెషల్ ఫోకస్ పెట్టి కష్టపడుతున్నారు. ఇతర పార్టీల నుండి అగ్రనేతలను బిజెపి వైపు ఆకర్షించేందకు ఆపరేషన్లూ నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే బి.ఆర్.ఎస్. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి తదితరులను బిజెపిలో చేర్చుకున్నారు. పాలక పక్షమైన బి.ఆర్.ఎస్. తో నిత్యం యుద్ధం చేస్తూ బి.ఆర్.ఎస్. కు ప్రత్యామ్నాయం తామేనని చాటుకునే ప్రయత్నమూ చేస్తున్నారు బిజెపి నేతలు.
గ్రామీణ తెలంగాణాలో బిజెపి కన్నా తమకే బలం ఉన్నా కాంగ్రెస్ నాయకత్వం దాన్ని క్యాష్ చేసుకోలేకపోతోంది. కాంగ్రెస్ బలహీనతను తమ బలంగా మలుచుకోడానికి బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సరిగ్గా ఈ తరుణంలోనే అధికార పక్షమైన బి.ఆర్.ఎస్. తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా సెల్ఫ్ గోల్స్ వేసుకుని బిజెపికి అడ్వాంటేజ్ కల్పించాయి. ముందుగా బి.ఆర్.ఎస్. అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలన కన్నా యూపీయే హయాంలో మన్మోహన్ సింగ్ పాలనే ఎన్నో రెట్లు అద్భుతంగా ఉందని కీర్తించారు. దేశ స్థూల జాతీయోత్పత్తితో పాటు పెర్ క్యాపిటా ఇంకమ్ లోనూ బిజెపి హయాం కన్నా కాంగ్రెస్ హయాంలోనే దేశం ముందంజలో ఉందని లెక్కలతో సహా అసెంబ్లీలో ఏకరవు పెట్టారు. మన్మోహన్ సింగ్ ఎన్నో మంచి పనులు చేసినా వాటిని చెప్పుకోలేకపోయారని కానీ మోదీ ఏమీ చేయకపోయినా చాలా చేసేసినట్లు డప్పు కొట్టుకున్నారని కేసీయార సెటైర్ వేశారు.
కేసీయార్ కాంగ్రెస్ పాలన గురించి ఇంత అద్భుతంగా మాట్లాడేసరికి తాము ఎక్కడ ఉన్నామో తమ పార్టీ పాలన గురించి పొగుడుతోన్న నేత ఏ పార్టీకి చెందిన వారో అన్నట్లు తెలంగాణా కాంగ్రెస్ నేతలు అయోమయం నిండిన వదనాలతో చూస్తుండిపోయారు. అటు బిజెపి నేతలు సైతం కేసీయార్ ఏం చెప్పదలచుకున్నారు. ఎవరిని తిట్టదలచుకున్నారు అని కాసేపు అర్ధోక్తిలో ఉండిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ తేరుకున్నారు. కేసీయార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడంతో కాంగ్రెస్ నేతలు సంబర పడ్డారు. బిజెపి నేతలు మొదట్లో కాస్త కంగారు పడ్డారు. కేసీయార్ ఆంతర్యం ఏమై ఉంటుందా అని ఆలోచించారు.ఆ వెంటనే కాంగ్రెస్ తో కేసీయార్ సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారని అందుకే యూపీయే ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు బిజెపి నేతలు. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు బి.ఆర్.ఎస్. తప్పనిసరిగా కాంగ్రెస్ తోనే పొత్తులు పెట్టుకోవలసి వస్తుందని కోమటి రెడ్డి జోస్యం చెప్పారు.
కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. లు రెండూ లౌకిక వాద పార్టీలు కాబట్టే బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశం రెండు పార్టీలకూ ఉండదని అందుకే ఆ రెండు పార్టీలూ కలవక తప్పదని కోమటి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో సీనియర్లంతా ఒక్కతాటిపైకి వచ్చి కలసి కట్టుగా పోటీచేసినా 60స్థానాలు రావడం గగనమే అన్నారు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో అందరి కన్నా ఎక్కువగా సంతోష పడింది బిజెపి నేతలే. కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన వెంటనే బిజెపి తెలంగాణా శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచే పరిస్థితి లేదన్నది ఆ పార్టీనాయకత్వానికే అర్ధం అయిపోయిందని అందుకే కోమటిరెడ్డి పొత్తుల గురించి వ్యాఖ్యలు చేశారని అన్నారు. మరో వైపు కేసీయార్ కూడా తాము గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న భయంతోనే కాంగ్రెస్ తో పొత్తుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని బిజెపి పేర్కొంది. తమకు మాత్రం విజయంపై ఎలాంటి అనుమానాలు లేవని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 90కి పైగా స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బిజెపియేనని కమలనాధులు ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయ వ్యూహాల్లో భాగంగా ప్రత్యర్ధి పార్టీలను అయోమయానికి గురి చేయాలని నేతలు భావిస్తూ ఉంటారు. అది కూడా వ్యూహంలో భాగమే అయితే ఒక్కోసారి అది బెడిసికొట్టి బూమెరాంగ్ అవుతుంది. తెలంగాణాలో అదే జరిగిదంటున్నారు రాజకీయ పండితులు. బిజెపిని అయోమయంలోకి నెడదామని ఇటు బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ అసెంబ్లీలో ఓ వ్యాఖ్య చేస్తే దానికి కొనసాగింపుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో వ్యాఖ్య చేశారు. ఈ రెండూ కూడా బిజెపికి అడ్వాంటేజ్ గా మారాయంటున్నారు రాజకీయ పండితులు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలైంది. కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసి ఉంటారా అని హైకమాండ్ ఆరా తీస్తోంది. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అయితే అదే పనిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి వర్గం కూడా దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. సీనియర్ నేత కోమటిరెడ్డికి చెక్ పెట్టడానికి ఇదే మంచి అదను అని రేవంత్ వర్గం భావిస్తోంది.
తామంతా పార్టీ పూర్తిస్థాయి మెజారిటీ వస్తుందని నూరిపోస్తూ ఉంటే దానికి బిన్నంగా కోమటిరెడ్డి పార్టీ శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా పార్టీ అవకాశాలను నాశనం చేసేలా వ్యవహరించారని అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి రేవంత్ వర్గం సిద్ధమైంది. బి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు సంపాదించాలని చూస్తోన్న కమ్యూనిస్టులు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలకు నిర్ధిష్ఠ సంఖ్యలో సీట్లు కేటాయిస్తేనే బి.ఆర్.ఎస్. తో కానీ మరో పార్టీతో కానీ పొత్తు పెట్టుకుంటామని వారంటున్నారు. ఒక వేళ బి.ఆర్.ఎస్. తమతో సీట్లు పంచుకోడానికి సిద్ధంగా లేకపోతే కాంగ్రెస్ తో నైనా పొత్తు పెట్టుకోవాలని కామ్రేడ్లు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బి.ఆర్.ఎస్., కాంగ్రెస్ లు రెంటితోనూ పొత్తులు కుదరకపోతే ఒంటరి పోరు తప్పదని కమ్యూనిస్టులు అంటున్నారు.
మొత్తానికి వచ్చే ఎన్నికలు మాంచి రసకందాయంలో నడవడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు.