తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌కు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నడిగడ్డకు చెందిన గులాబీ నేతల్ని కారు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీతో హస్తం పార్టీ నేతలు టచ్‌లో ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆ నాయకులు హస్తం గూటికి చేరుతారనే గుసగుసలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్టాపిగ్గా మారింది. కారు దిగాలనుకుంటున్నా ఆ నేతలు ఎవరో చూద్దాం.
వరుస పరాజయాలతో కుదేలైన గులాబీ పార్టీకి పాలమూరు జిల్లాలో మరో షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు కారు దిగేందుకు సిద్దమవుతున్నారా? వారం…పది రోజులుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న ప్రచారం నిజమనే అంటున్నారు అక్కడి నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 14 స్దానాలకు గాను..12 స్దానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్జులే గెలిచారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్దులు విజయం సాధించారు. ఇక ఎంపీ ఎన్నికల్లో ఓ సీటులో కాంగ్రేస్.. మరో సీటు బీజేపీ గెలుచుకున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే జరిగిన స్దానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ది గెలిచారు. ఈ పరిణామంతో పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసే దిశగా కాంగ్రేస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రేస్ పార్టీ..భవిష్యత్‌లో మరింత బలోపేతం కావాలని చూస్తోంది. అందులో భాగంగా గద్వాల ఎమ్మెల్యే, ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు ప్రచారం సాగుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు సన్నిహితుడిగా పేరున్న కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్పించే బాధ్యతను ఆయనకే అప్పగించినట్టు చెబుతున్నారు. ఈయనతో పాటు ఆ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సైతం హస్తం గూటికి చేరుతారనే టాక్ నడుస్తోంది. ఇటీవలే కర్నూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో చేరికలపై చర్చలు జరిగినట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఓకేసారి జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇద్దరి మధ్యా ఆ సాన్నిహిత్యం కూడా ఉంది.
దీంతో కృష్ణమోహన్‌రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరతాడనే ప్రచారానికి బలం చేకూరుతోంది. కాంగ్రెస్ లోకి గులాబీ ముఖ్య నేతల చేరికల వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు గద్వాల, అటు అలంపూర్ లో కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నాయకుల వ్యవహారశైలి ఇబ్బందులు తెచ్చి పెడుతూ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారారని.. వారికి చెక్ పెట్టేందుకే బీఆర్ఎస్ నుంచి చేరికలకు శ్రీకారం చుట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో విబేధాల కారణంగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రేస్లో చేరిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు.ప్రస్తుతం కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రేస్ పార్టీలో చేరుతారనే ప్రచారంతో సరిత వర్గీయుల్లో ఆందోళన మొదలయ్యింది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై పార్టీ మారాలనే వత్తిడి కూడా కార్యకర్తల నుంచి పెరిగినట్టు తెలుస్తోంది.
అయితే తనను కాంగ్రేస్ పార్టీలోకి రావాలని అడిగిన మాట వాస్తవమేనని..అదే జరిగితే అందరికీ చెప్పే పార్టీ మారతానని చెప్పటం ఆసక్తికరంగా మారింది. గతంలో పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఆ కంచుకోటను బద్దలు కొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రేస్ పార్టీ మాత్రమే విజయం సాధించాలనే రీతిలో సీఎం రేవంత్‌రెడ్డి తన జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హస్తం గూటికి చేరటం ఖాయమనే ప్రచారం జోరందుకుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…