గులాబీ దండుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల చిట్టా ఇప్పుడు విప్పుతున్నారు. ఎవ్వరినీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్న రేవంత్ ప్రభుత్వం అక్రమాలను ఒకటొకటిగా బయటకు తీస్తోంది. కొన్ని వర్గాల్లో వస్తున్న ఫిర్యాదలను కూడా సీరియస్ గానే తీసుకుంటోంది.
కేసీయార్ పదేళ్ళ పాలనలో గులాబీ పార్టీ నేతలు చాలమంది భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే మంత్రులు, ఎంఎల్ఏలు చెరువులు, కుంటలను కూడా వదిలిపెట్టలేదు. ఏదో రూపంలో అధికారులను మ్యానేజ్ చేసుకుని బినామీల పేర్లతో రాయించేసుకున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు స్వయంగా ఫిర్యాదు చేయటం అప్పట్లో సంచలనమైంది. తన తండ్రి ఒక చెరువును చెరపట్టి సొంతం చేసేసుకున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. అప్పట్లో అదో సంచలనమైంది. దానికి సంబంధించిన విచారణ ఇప్పుడు వేగవంతమయ్యే అవకాశం ఉంది.
ప్రైవేటు భూములను కబ్జాలుచేసిన మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు ఇంకా చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళపై ఇపుడు పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు. మాజీ మంత్రులను కూడా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు.మాజీమంత్రి మల్లారెడ్డి పైన శామీర్ పేట పోలీసులు ఇటీవలే కేసు నమోదు చేశారు. శామీర్ పేటలో మల్లారెడ్డి ఏకంగా 40 ఎకరాలను కబ్జాచేసి సొంతం చేసేసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. భూ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదుచేశారు. ఇక బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో 2,185 చదరపు మీటర్ల స్ధలాన్ని పాలేరు మాజీ ఎంఎల్ఏ కందాల ఉపేందర్ రెడ్డి కబ్జాచేశారని పోలీసులు కేసు నమోదుచేశారు. ఎంఎల్ఏ కబ్జాచేసిన స్ధలం ప్రభుత్వానిదేనట. షేక్ పేట్ ఎంఆర్వో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఉపేందర్ రెడ్డిపైన పోలీసులు కేసు నమోదుచేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కూడా ఫిర్యాదులు అందాయి.నాగేందర్ తమ భూములు కబ్జా చేశాడంటూ బేగంపేట్ బస్తీ వాసులు ఆరోపించారు. దీనిపై మంగళవారం ప్రజావాణిలో మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రకాశ్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా ప్రజాభవన్ కు చేరుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ భూమిని తాము కష్టపడి కొనుక్కున్నామని, ఇప్పుడు ఆ భూమి నుంచి తమను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ భూమిలో కట్టుకున్న ఇళ్లను కూలగొట్టిస్తామని బెదిరిస్తున్నారంటూ బాధితులు కొందరు కన్నీటిపర్యంతమయ్యారు.దానిపై ఇంకా విచారణ ప్రారంభం కావాల్సి ఉంది.
హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములతో పాటు ప్రైవేటు వ్యక్తులతో వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. దీనికి బినామీ లావాదేవీలను సైతం నిర్వహించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయిన బాధితులు ఇప్పుడు వాటన్నింటినీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఎంత త్వరగా విచారణ జరుపుతారో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…