బీఆర్ఎస్ లో శల్యసారథ్యం..

By KTV Telugu On 9 November, 2023
image

KTV TELUGU :-

పార్టీకి విధేయంగా ఉంటామని ప్రకటిస్తారు. అన్ని తామై చూసుకుంటామని, గెలిపించిన తర్వాతే ప్రగతి  భవన్ గడప తొక్కుతామని కూడా ప్రతజ్ఞలు చేస్తారు. తెగ ఆరాటపడుతున్నట్లు నటిస్తారు. లోతుగా అధ్యయనం చేస్తే మాత్రం అసలు సంగతి బయట పడుతుంది. క్షేత్రస్థాయిలో వారి ఆగడాలు ఒక్కటొకటిగా తెలుస్తాయి. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వాళ్లు చేస్తున్నదేమిటో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. హవ్వా.. వీళ్లలో ఇంత కుట్ర ఉందా అని ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది.పైగా  ఏదోక పదవి ఉన్న వాళ్లే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు…

ఏ పార్టీలోనైనా టికెట్ ఆశించి భంగపడిన వాళ్లు ఎక్కువే ఉంటారు. వంద మంది ఆశావహులుంటే ఒకరికి టికెట్ వస్తుంది. టికెట్ రాలేదని కొందరు పార్టీని వదిలి వెళ్లడం కూడా మామూలు విషయమే అవుతుంది. బీఆర్ఎస్ లో మాత్రం ఇప్పుడు కొందరు నేతలు పార్టీలో ఉంటూనే గోతులు తవ్వుతున్నారు. వారిలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వాళ్లూ ఉన్నారు. వాళ్లంతా పార్టీ కోసం పనిచేస్తున్నట్లే నటిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా సిట్టింగులకు మరో ఛాన్స్ ఇవ్వడంపై ఆగ్రహం చెందిన వాళ్లంతా తెరవెనుక  మంత్రాంగం నడిపిస్తున్నారు.కలిసి పనిచేయాలన్న పార్టీ అధిష్టానం అభ్యర్థనను సైతం వాళ్లు పట్టించుకోవడం లేదు..

ఆయా నాయకుల గేమ్ ప్లాన్ మామూలుగా లేదని తెలుస్తోంది. కుల సంఘాల నేతలకు ఫోన్లు చేసి మరీ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దానితో కుల సంఘాల నేతలకు కూడా పాలు పోవడం లేదు. ఇదేమిటి సొంత పార్టీ వారే ఓడించాలంటున్నారేమిటని వాళ్లు ప్రశ్నించుకుంటున్నారు. అలాంటి వారిలో మంత్రి పదవి పొందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, నాగార్జున సాగర్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉన్నట్లు సమాచారం.

తాండూరు ప్రచారంలో ఉండాల్సిన మహేందర్ రెడ్డి, అక్కడ పనిచేయకుండా కొడంగల్ లో పోటీ చేస్తున్న తన సోదరుడు నరేందర్ రెడ్డి కోసం ప్రచారానికి వెళ్లారు. తాండూరులో ఉన్న పట్నం అనుచరులు కూడా ఎమ్మెల్యే  రోహిత్‌రెడ్డి వర్గానికి సహకరించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.భూపాలపల్లి టికెట్ రాకపోవడంతో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్థానికంగా ప్రచారం చేయకుండా, ఎక్కువ సమయం హైదరాబాల్‌లోనే గడుపుతున్నారు.నాగార్జునసాగర్ టికెట్ ఇవ్వనందుకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి సైతం అక్కడి సిట్టింగ్ అభ్యర్థి నోముల భగత్‌కు సహకరించడం లేదని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కోటిరెడ్డి కదలికలపై పార్టీ నాయకత్వం నిఘా పెట్టి క్షేత్రస్థాయి నుంచి వివరాలను తెప్పించుకుంది. స్టేషన్ ఘన్ పూర్ టికెట్  రాని  రాజయ్యకు రైతు బంధు రాష్ట్ర చైర్మన్ పదవి ఇచ్చారు. ఐనా సరే తన సోదరి వరుస అయ్యే కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర గెలుపు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ  పోతే చాలా మంది బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణను పక్కనపెట్టి అధికారిక అభ్యర్థులను కిందకు లాగి పడేసే ప్రయత్నంలో ఉన్నారు.దీనికి సంబంధించిన నిఘా వర్గం  నివేదికలు సీఎం కేసీఆర్ కు చేరాయి. కాకపోతే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా అది పార్టీ జయాపజయాలపై ప్రభావం  పడుతుందని కేసీఆర్ మౌనం వహిస్తున్నారు. మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి