కాంగ్రెస్ దూకుడును అడ్డుకోవడంలో ఎదురుదాడి చేయడంలో బీఆర్ఎస్ నేతల్లో ఒక్క కవిత మాత్రమే అందరికీ కనిపిస్తున్నారు. మిగతా అందరూ నిర్లిప్తంగా ఉన్నారు. కేసీఆర్ అసలు బయటకు రావడం లేదు. జిల్లాలు పర్యటిస్తారని.. అసెంబ్లీకి వస్తారని కేటీఆర్ చేసిన ప్రకటనలన్నీ తేలిపోయాయి. కేటీఆర్ కూడా పెద్దగా కనిపించడం లేదు. హరీష్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నా లెక్కలోకి రావడం లేదు. కానీ కవిత మాత్రం దూకుడుగా ఉన్నారు. కాంగ్రెస్‌పై పోరాటంలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ముందు ముందు బీఆర్ఎస్ పోరాటానికి .. కాంగ్రెస్ పై యుద్ధానికి తెలంగాణలో ఆమె నేతృత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ లో ఇప్పుడు కవిత మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో, కవిత జాతీయ రాజకీయాల్లో ఉండేవారు. ఎంపీగా ఉన్నప్పుడు .. ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడూ కవితే కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆమె కేటీఆర్ కన్నా ఎక్కువగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. కాంగ్రెస్ పై తరచూ ఆరోపణలు, విమర్శలు చేస్తూ హైలెట్ అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలిలోనూ ప్రభుత్వాన్ని అనేక అంశాలపై నిలదీశారు. బాధితుల్ని కలిసేందుకు వెళ్లిపోతున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా కాలం రాజకీయాల్లో లేకుండా కనుమరుగయ్యారు. తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయిన తర్వాత తన పోరాటం ప్రారంభించారు. కానీ పార్టీకి ప్రతిబంధకాలు ఎదురు కావడంతో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు బయటకు రావడంతో మరింత ఆత్మరక్షణ ధోరణిలో పడాల్సి వచ్చింది. ఆమె బాధ్యతలు తీసుకున్న నిజామాబాద్ అర్బన్ బిజెపి గెలుపొందడమే కాకుండా బిఆర్ ఎస్ మూడో స్థానంలోకి పడిపోయింది. ఇలా ఆమెకు రాజకీయ పరిస్థితిలు ఎపుడు అనుకూలంగా లేవు. అయితే ఇపుడు పరిస్థితి మారిపోయింది. పార్టీ ప్రతిపక్షంలోకి రావడంతో ఆమెకు ఎలాంటి ఆంక్షలు.. ప్రతిబంధకాలు.. లేకుండా పోయాయి. దీంతో తన సహజసిద్ధమైన రాజకీయంతో కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు.
ఇటీవల శాసనమండలి సమావేశాల్లో తన వాణిని గట్టిగా వినిపించారు. సోషల్ మీడియాలో కవిత యాక్టివ్ అయ్యారు. దాదాపుగా రోజూ ఆమె పత్రికా విలేఖరుల సమావేశాలు నిర్వహిస్తూన్నారు. గత పదేళ్లలో ఒక్క సారి కూడా ప్రస్తావించకపోయినా జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని ఉద్యమం ప్రారంభించారు. దీనికోసం గ్రామస్థాయి నుంచి ఉద్యమం నిర్వహిస్తామని, మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతూ భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పూలే విగ్రహం ఏర్పాటు చేసే దాకా ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు,ఇందిరాపార్క్ వేదికగా మహాధర్నా నిర్వహిస్తామని, ప్రతి గ్రామం నుంచి 10-15 పోస్టు కార్డులు పంపిస్తామని కవిత చెప్పారు.ఫూలేకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని, ఫూలే దంపతుల జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఆమె కోరారు. ఓబీసీ జనగణన చేపట్టి, మహిళా బిల్లులో ఓబీసీ కోటాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నీటిపారుదల శాఖపై కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేత పత్రం, కాగ్ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టులపై సర్కారు వైఖరిని కవిత తిప్పి కొట్టారు. దీంతోపాటు పలు సమస్యలను శాసనమండలిలో కవిత వినిపించారు. గతంలో అధికారంలో ఉన్నపుడు మాట్లాడని కవిత ప్రతిపక్షంలోకి రాగానే తన విమర్శల దాడిని పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కుల గణన తీర్మానం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. చట్టబద్ధతను ప్రశ్నించారు. సచివాలయ ప్రాంగణంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై శాసనమండలిలో లేవనెత్తేందుకు చైర్మన్ అనుమతిని కోరారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజావాణిని వినడం లేదు..ఢిల్లీవాణినే వింటున్నారని, ప్రజావాణికి ఒక్క రోజే హాజరైన సీఎం వారానికి రెండు సార్లు ఢిల్లీకి పయనమవుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు తెలంగాణ బస్సును పంపించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఖర్చు కోసం తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల అంశంపైనా ఎదురుదాడి చేశారు.
ఇలా కవిత అన్నీ తానై వ్యవహరిస్తూ విమర్శల ధాటిని పెంచారు. ఇతర బీఆర్ఎస్ నేతల కంటే.. కవితనే ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. ఇప్పుడు ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదు. పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలకు పరిమితం కానున్నారు. దీంతో ప్రతిపక్ష నేతగా మరింత ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…